Published : 14/06/2021 17:43 IST

కేంబ్రిడ్జి మెచ్చిన టీచరమ్మ!

పిల్లల జీవితాలను మార్గనిర్దేశం చేసేది ఉపాధ్యాయులే. కానీ ఆమె కేవలం దారి చూపి వదిలేయట్లేదు. ఎలా నిలదొక్కుకోవాలో కూడా నేర్పిస్తోంది. అందుకే ఆమె పిల్లల ఫేవరెట్‌ అయ్యింది. సహాధ్యాయులతోనూ బెస్ట్‌ అనిపించుకుంది. అంతేనా.. కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ సైతం ‘డెడికేటెడ్‌ టీచర్‌’ అవార్డును ప్రకటించేసింది. 112 దేశాల అభ్యర్థులను వెనక్కి నెట్టిమరీ దీన్ని దక్కించేసుకుంది. ఇదంతా అన్నమ్మా లూసీకి ఎలా సాధ్యమైంది? తెలుసుకుందాం రండి.

న్నమ్మా లూసీ.. షార్జాలోని జెమ్స్‌ ఓఓఈ హైస్కూల్లో సోషల్‌ టీచర్‌. ఆమె తరగతి పాఠాలకే పరిమితమవదు. జీవితంలో ఎలా ముందుకు సాగాలో, సమస్యలను ఎలా ఎదుర్కోవాలో కూడా నేర్పిస్తుంది. దేశభక్తి, ఆడవాళ్లను గౌరవించడం, సమాజసేవ వంటి వాటిపైనా అవగాహన కల్పిస్తుంది. తరగతిలో ప్రతి విద్యార్థికీ కొంత సమయం కేటాయిస్తుంది. విషయాన్ని సీరియస్‌గా కాకుండా ఆసక్తికరంగా వివరిస్తుంది. ఏ సమయంలోనైనా వారికి చిరునవ్వుతో అందుబాటులో ఉండే ఈ తీరే ఆమెను వాళ్లకి దగ్గర చేసింది.

అన్నమ్మది బెంగళూరు. మూడేళ్ల వయసులోనే తల్లిదండ్రులు చనిపోయారు. నన్‌లు ఆమెను చేరదీశారు. బడికెళ్లేప్పటి నుంచే సామాజిక సేవలో పాలుపంచుకునేది. వేసవి సెలవుల్లో అందరూ ఇంటికి వెళితే ఈమె దగ్గర్లోని గ్రామాలకు వెళ్లి వాలంటీర్‌గా పనిచేసేది. పిల్లలకు పాఠాలు చెప్పడం, డ్యాన్స్‌ నేర్పించడం వంటివీ నేర్పించేది. విద్యాభ్యాసం పూర్తయ్యాక ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకుంది. 23 ఏళ్లుగా దీనిలో కొనసాగుతోంది. మొదట బెంగళూరులో కెరియర్‌ ప్రారంభించి తర్వాత షార్జాకి వెళ్లింది. ఇక్కడా ఏటా వేసవి సెలవుల్లో ఉగాండా, ఇరాక్‌, భారత్‌ల్లోని గ్రామాలకు వెళ్లి పేద పిల్లలకు విద్యాబోధన చేస్తోంది.

కరోనా సమయంలో తన విద్యార్థుల కోసం ‘లెర్నింగ్‌ జర్నీ’ పేరుతో ఒక ఆన్‌లైన్‌ ప్రోగ్రామ్‌ను ఉచితంగా ఏర్పాటు చేసింది. దీనిలో విద్యార్థులు ఒత్తిడికి లోనవకుండా కొన్ని కార్యక్రమాలను నిర్వహించింది. మోటివేషనల్‌ స్పీకర్లు, ఇతర టీచర్లను ఆహ్వానించి, ఈ వేదికగా వారితో మాట్లాడించేది. వారిలో ధైర్యం నింపడంతోపాటు భవిష్యత్తులో అవసరమైన జీవన నైపుణ్యాలనూ నేర్పించింది. అలా తరగతే కాకుండా జీవిత పాఠాలనూ బోధిస్తోంది. కేంబ్రిడ్జ్‌ విశ్వ విద్యాలయం గత కొన్నేళ్లుగా ఏటా ఒకరిని ఎంపికచేసి ‘డెడికేటెడ్‌ టీచర్‌’ అవార్డును ప్రకటిస్తుంది. ఇది ప్రపంచవ్యాప్త పోటీ. దీనిలో ఎవరైనా తమకు నచ్చిన ఉపాధ్యాయులను ఎవరైనా నామినేట్‌ చేయొచ్చు. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన దరఖాస్తుల నుంచి వీరిని ఎంపిక చేస్తారు. విద్యార్థుల జీవితాల్లో తమకు తెలియకుండానే బలమైన ముద్ర వేసేవారికి దీన్ని అందిస్తారు.

ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 112 దేశాల నుంచి 13,000 దరఖాస్తులు వచ్చాయి. మిడిల్‌ ఈస్ట్‌, నార్త్‌ ఆఫ్రికా కేటగిరీలో మొత్తంగా ఆరుగురు రీజనల్‌ విన్నర్‌లను ఎంపిక చేశారు. 30%పైగా ఓట్లతో అన్నమ్మ ప్రథమ స్థానంలో నిలిచింది. నగదు బహుమతితోపాటు కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ ప్రెస్‌ బుక్‌లో స్థానం కల్పిస్తారు. ఇంకా కేంబ్రిడ్జ్‌ ప్యానెల్‌లోనూ చోటు కల్పిస్తారు. ఈ ఏడాదికి కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రచురించే ప్రతి ఎడ్యుకేషన్‌ బుక్‌ ‘థాంక్యూ’ పేజీలోనూ ఈమె ఫొటో ఉంచుతారు.

‘ఈ అవార్డు సంతోషాన్నిచ్చింది. కానీ ఇది నా ఒక్కదాని వల్లే సాధ్యమైందంటే ఒప్పుకోను. అందరం సమష్టిగా సాగడం వల్లే నా ఆలోచనలను ముందుంచే అవకాశమొచ్చింది. కాబట్టి ఈ విజయం మా అందరిదీ’ అంటోంది అన్నమ్మ.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని