హమీదా... గూగుల్‌ డూడుల్‌గా!

మే 4, 1954... ఈసారి హమీదా ఓటమి ఖాయం అనుకున్నారంతా. ప్రత్యర్థి పేరు పొందిన రెజ్లర్‌... బాబా పహిల్వాన్‌ మరి. అతనికి ఎదురే లేదన్న అభిప్రాయం అందరిది. ఆయనా గెలవగలనన్న నమ్మకంతోనే ఉన్నాడు.

Updated : 07 May 2024 15:34 IST

మే 4, 1954... ఈసారి హమీదా ఓటమి ఖాయం అనుకున్నారంతా. ప్రత్యర్థి పేరు పొందిన రెజ్లర్‌... బాబా పహిల్వాన్‌ మరి. అతనికి ఎదురే లేదన్న అభిప్రాయం అందరిది. ఆయనా గెలవగలనన్న నమ్మకంతోనే ఉన్నాడు. కాబట్టే... ఓడిపోతే ఆటకు స్వస్తి పలుకుతానని ధీమాగా చెప్పాడు. అదే హమీదా ఓడితే అతణ్ని పెళ్లాడాలి. పోటీ మొదలైంది. అందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. అలా నిమిషం దాటి కొన్ని సెకన్లు గడిచాయో లేదో విజేత తేలిపోయింది. ప్రేక్షకులు కోరుకున్నట్టు బాబా పహిల్వాన్‌ కాదు గెలిచింది. గతంలో ఇద్దరు పేరొందిన పురుష రెజ్లర్లను మట్టికరిపించిన హమీదానే ఈసారీ విజేత.

అసలు ఈమె మహిళేనా? కొంచెం కూడా ఆడతనం లేదన్న మాటలు పట్టించుకోకుండా అక్కడి నుంచి చక్కా వెళ్లిపోయారామె. కానీ ఈ సంఘటన ఆమేంటో ప్రపంచానికి పరిచయం చేసింది. హమీదా బానోది... ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్‌ దగ్గర్లోని చిన్న గ్రామం. పహిల్వాన్ల కుటుంబం. అదే ఆమెకు కుస్తీపై మనసు పారేసుకునేలా చేసింది. ఆడవాళ్లకు ఆటలంటేనే ఒప్పుకోని రోజులవి. పొట్టి దుస్తులు వేసుకొని కుస్తీ పడతానంటే ఊరుకుంటారా? కానీ హమీదా అందరిలా పరదా మాటున ఉండిపోవడానికి ఇష్టపడలేదు. ఎవరెన్ని చెప్పినా, ఆంక్షలు విధించినా కుస్తీలో శిక్షణ కొనసాగించారు. అయితే ఎవరితో పోటీపడతారు? దేశంలో తొలి మహిళా రెజ్లర్‌ ఆమె. పైగా చిన్నచూపు! అందుకే తనని ఓడించిన తొలి మగవాడినే పెళ్లాడతానని ప్రకటించారు. ఆమె గర్వం అణచుదామనుకుని ఊళ్లోవాళ్లూ, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చినవాళ్లూ పోటీపడినా గెలుపు ఆమెనే వరించింది. ప్రపంచ పోటీల్లో సత్తా చాటిన దేశీ వీరులూ ఆమె చేతిలో చిత్తయ్యారు. వారిలో బాబా పహిల్వాన్‌ ప్రముఖుడు. ఆ తరవాతి నుంచి విదేశాల నుంచీ ఆమెకు సవాలు విసిరారెందరో. దశాబ్ద కాలంలో 320 బౌట్లు. అన్నింటా విజయం హమీదాదే! అందుకే ప్రపంచ పత్రికలన్నీ ఆమెను కొనియాడాయి. ‘అమెజాన్‌ ఆఫ్‌ అలీగఢ్‌’ అన్న కితాబునిచ్చాయి. అయితే ఇవన్నీ దాటడానికి హమీదా దాటొచ్చిన సవాళ్లూ ఎన్నో. పోటీకోసమని పంజాబ్‌కెళితే అవమానాలు, తిరిగి వెళ్లిపొమ్మంటూ నిరసనలు. కొల్హాపూర్‌లో ఆమె విజయాన్ని తట్టుకోలేకపోయినవారు రాళ్లు రువ్వారు. కొన్నిచోట్ల తీరా ఆట సమయానికి రద్దు చేసేవారు. అయినా ఆమె వెనుదిరగలేదు. తనెవరికీ తీసిపోనని నిరూపించుకుంటూ వెళ్లారు. అలా... ఎందరో అమ్మాయిలు ఈ రంగంలోకి రావడానికీ, విజయకేతనం ఎగురవేయడానికీ కారణమయ్యారు. కాబట్టే... ఆమెను గుర్తుచేస్తూ తాను ప్రపంచానికి పరిచయమైన ఈ మే 4న అంటే నిన్న, హమీదా బానో డూడుల్‌ని గూగుల్‌ విడుదల చేసింది. ఈమెవరా అని వెదికిన వారంతా ఆమె గొప్పతనాన్ని సామాజిక మాధ్యమాల్లో పొగుడుతున్నారు. అన్నట్టూ ఈ డూడుల్‌ని రూపొందించిందీ అమ్మాయే! తన పేరు దివ్యా నేగి. సవాళ్లకు ఎదురెళ్లి నిలిచిన హమీదా కథను నేటి తరానికి అందించాలని బోలెడు రిసెర్చ్‌ కూడా చేసిందట. మరి హమీదా స్ఫూర్తిని మనమూ అందుకుందామా?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్