కాల్షియం కోసం ఏం తీసుకోవాలి?

నాకు 30 ఏళ్లు. ఇద్దరు పిల్లలు. చిన్న పాపకి రెండేళ్లు. ఈమధ్య వరకూ తనకు పాలిచ్చేదాన్ని. తర్వాత వెన్ను నొప్పి ఎక్కువగా వస్తోంది. గైనకాలజిస్టుని సంప్రదిస్తే కాల్షియం లోపం కావొచ్చన్నారు. కాల్షియం, విటమిన్‌-డి టాబ్లెట్లు వాడమన్నారు. కాల్షియం లోటుని ఆహారంతో సర్దుబాటు చేసుకునే వీలుందా?

Updated : 08 Sep 2022 09:56 IST

నాకు 30 ఏళ్లు. ఇద్దరు పిల్లలు. చిన్న పాపకి రెండేళ్లు. ఈమధ్య వరకూ తనకు పాలిచ్చేదాన్ని. తర్వాత వెన్ను నొప్పి ఎక్కువగా వస్తోంది. గైనకాలజిస్టుని సంప్రదిస్తే కాల్షియం లోపం కావొచ్చన్నారు. కాల్షియం, విటమిన్‌-డి టాబ్లెట్లు వాడమన్నారు. కాల్షియం లోటుని ఆహారంతో సర్దుబాటు చేసుకునే వీలుందా?

- హైమ, హైదరాబాద్‌

గర్భం దాల్చాక బిడ్డ ఎముకల వ్యవస్థ నిర్మాణం కోసం కాల్షియం చాలా ఎక్కువ మోతాదులో అవసరం పడుతుంది. దాదాపు ఆరు నెలలపాటు ఇది బిడ్డకు అవసరం. బిడ్డ పుట్టాక కూడా ఆరు నెలల వరకూ పూర్తిగా తల్లి పాలమీదనే ఆధారపడుతుంది. దాంతో పాలిచ్చే తల్లుల్లో కాల్షియం తగ్గుదల సహజం. అందుకే ఈ టైమ్‌లో కాల్షియం సప్లిమెంట్లు తీసుకోవాలి. మీరు తీసుకున్నారో లేదో మరి. రెండేళ్లు పాలిచ్చామంటున్నారు. దాంతో కాల్షియం, విటమిన్‌-డి లోపం ఉండొచ్చు. డాక్టర్‌ చెప్పిన మేరకు సప్లిమెంట్లు తీసుకోండి.

ఆహారం విషయంలో వైవిధ్యాన్ని పెంచుకోవాలి. రోజూ అన్నం, చపాతి మాత్రమే తీసుకోకూడదు. ఒకపూట అవి తిన్నా రెండోపూట రాగి-గోధుమ చపాతీ, రాగి ముద్ద, రాగి-పిట్టు, రాగి-రవ్వ ఇడ్లీ తీసుకోండి. రాగుల్లో కాల్షియం, ఇనుము ఎక్కువ. ఖర్చు కూడా తక్కువే. అలా కుదరకపోతే పాల ఉత్పత్తుల వినియోగం పెంచుకోండి. సాధారణ వ్యక్తులు రోజూ 300 మి.లీ. పాలు, అంతకు సమానమైన పాల ఉత్పత్తులు తీసుకోవాలి. మీరు 500మి.లీ. తీసుకోండి. పాలు, పెరుగు, చిక్కటి మజ్జిగ, పన్నీర్‌ రూపంలో తీసుకుంటే మంచిది. టోఫు, పన్నీర్‌లతో కూరలైనా చేసుకోండి. ఆకుకూరలూ, పొట్టుతీయని మినుములతో చేసిన ఆహారం తీసుకోవాలి. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే శనగలు, పెసలు, అలసందలు ఉడికించి తీసుకోండి. వీటికి నిమ్మరసం కలపొచ్చు. నువ్వులూ తీసుకోవచ్చు. కాకపోతే వీటిలో కొవ్వు శాతం ఎక్కువ. అధిక బరువులేని వారు తీసుకోవచ్చు. కనీసం మూడు నెలలన్నా ఈ విధంగా పాటించండి. తర్వాతా కొనసాగించడం మేలు. బాగా ఉప్పుండే నిల్వ పచ్చళ్లు, అప్పడాలు, పొడులు.. వద్దు. వీటితో ఆహారంలో కాల్షియం ఉన్నా అది మన ఒంటబట్టదు. శారీరక శ్రమ ఎక్కువై రక్తంలో హిమోగ్లోబిన్‌ తగ్గినా నీరసం, వెన్ను నొప్పి వస్తాయి. ఆహారంలో మార్పులతో తగ్గకపోతే ఓసారి హిమోగ్లోబిన్‌ స్థాయిని పరీక్షించుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని