Published : 11 Jul 2021 01:12 IST

ఆ పాటలో అంత నాటకముంది!

పదచిత్రమంటే అక్షరాలతో బొమ్మకట్టడం. ఓ నాటకంలా పాటతో శ్రోతల మదిలో దృశ్యాలని ఆవిష్కరించడం. తెలుగు శ్రోతలకి చాలాకాలం తర్వాత అలాంటి అరుదైన అనుభూతి నిచ్చిన పాట ‘ఆచార్య’ సినిమాలోని ‘లాహే... లాహే’. ఆదిదంపతుల అనాది సరసవిరసాలని అలతి అలతి పదాలతో ఎంతో పొందికగా దృశ్యమానం చేశారు రచయిత రామజోగయ్య శాస్త్రి. క్లాసూ మాసూ అన్న విభజన రేఖని చెరిపేసి విన్నవాళ్లందరి లోనూ ఉత్తమాభిరుచిని పెంచే ఈ పాట పుట్టుక గురించి ఆయన చెబుతున్నారిలా...

‘కథ చోటుచేసుకునే స్థలాన్ని  చూచాయగా చెప్పాలి. జడలు విరబోసుకున్న పార్వతమ్మ రూపాన్నీ... జటాజూటధారి శివయ్య ఆకారాన్నీ కళ్లకి కట్టాలి. వాళ్లిద్దరి ప్రణయాన్ని చమత్కారంగానే... కానీ సభక్తికంగా వివరించాలి!’ అన్నారు ‘ఆచార్య’ దర్శకుడు కొరటాల శివ. ఆదిదంపతుల ప్రేమ సన్నివేశమైనంత మాత్రాన పూర్తిగా భక్తిగీతమైపోకుండా చిరంజీవిగారు డ్యాన్స్‌ చేయడానికీ ఆస్కారం ఉండాలి అనుకున్నాం. నేనే ఓ చిన్నపాటి నాటకాన్ని మనసులో అనుకున్నాను. అర్ధరాత్రి వేళ అమ్మవారు స్వామిని తలచీతలవంగానే... అర్ధనారీశ్వరుడు ఉన్నపళంగా కదిలొస్తాడు. వచ్చిన స్వామిని చూసి ‘ఈవేళ కూడా ఇదేం రూపమయ్యా నీకు!’ అని రుసరుస లాడుతుంది దేవి. దేవర ఆమె కోపాన్ని తగ్గించే పనిలో పడతాడు. అమ్మ కోపం తగ్గి అయ్యకి దగ్గరయ్యేలోపు నాలుగోజాము మొదలైపోతుంది... ఇది నేను అనుకున్న రూపకం. పార్వతి పర్వతరాజు ముద్దులపట్టి కాబట్టి... ‘కొండలరాజుకి బంగరు కొండ’ అన్న పాదంతో ప్రారంభించాను. ఆమె గిరిజన ఇలవేల్పు అనే అర్థం వచ్చేలా ‘కొండాజాతికి అండాదండా’ అనీ చేర్చాను. ఇక ‘మద్దేరాతిరి లేచీ మంగళగౌరి...’ అంటూ పాటలోని నాటకానికి సంబంధించిన మొదటి సన్నివేశం ప్రారంభించాను. ఆ తర్వాతది శివయ్య వర్ణన. ఈశ్వరుడి విరహ తీవ్రతని చెప్పేలా ‘మెల్లో మెలికల నాగులదండ వలపుల వేడికి ఎగిరిపడంగ’ అని వివరించాను. మూడో సీను - శివయ్య రాకని చూసి అమ్మవారు సిగ్గులమొగ్గకావడం, అంతలోనే ఆయన రూపం చూసి రుసరుసలాడటం. విరబోసుకున్న జుట్టు, కొరవిలాంటి కళ్లున్న అమ్మవారి రూపాన్ని శ్రీ మాతంగిగా పూజిస్తారు. అది ఎక్కడ ఎప్పుడు విన్నానో తెలియదుకానీ ఈ పాటలో  చటుక్కున ‘సీమాతంగి’గా వచ్చిపడింది. అమ్మవారి కోపాన్ని తీర్చడానికి ‘అడ్డ నామాలయ్య’ ఆమె గడ్డంపట్టుకుని బతిమిలాడటం నాలుగో సన్నివేశం. ఆ ఆదిదంపతుల సరసాన్ని అక్కడితో ఆపడం సముచితం అనిపించి ఓ చిన్న చమత్కారంతో ముగించాలనుకున్నాను. ఆ ఇద్దరూ చేరవయ్యేలోపు ‘ఏకాంతసేవ ముగిసింది స్వామీ. ఇక రండి..!’ అని భక్తులు పిలుస్తున్నట్టు ‘ఒద్దికజేరే నాలుగోజాముకు గుళ్లో గంటలు మొదలాయె...’ అంటూ ముక్తాయించాను.

అదీ సందేశం...
దంపతులు ఎంతగా చిటపటలాడినా ఎవరో ఒకరు ఓ మెట్టుదిగాలన్న సందేశం శివపార్వతుల ప్రణయకథలో ఉందని చెబుతూ ‘ప్రతిరోజిది జరిగే ఘట్టం...’ అనే పాదాలతో భరతవాక్యం పలికాను. ఈ పదచిత్రానికి... చిరంజీవి గారి స్థాయికి తగ్గట్టు, నేటితరం మెచ్చేట్టు అద్భుతమైన బాణీకట్టారు మణిశర్మ. ‘ఖలేజా’లోని ‘సదాశివా సన్యాసి’ తర్వాత మేమిద్దరం చేసిన శివయ్యపాట ఇది! గాయనులు హారికా, సాహితీ దీనికి ప్రాణంపోశారు. రికార్డింగ్‌ కాగానే చిరంజీవిగారు ఎంతో ఉద్విగ్నంగా ఫోన్‌ చేసి ‘అద్భుతం’ అంటూ అభినందించడం ఈ పాటకి దక్కిన గొప్ప అవార్డుగా భావిస్తున్నా. పాట విడుదలయ్యాక... సామాన్య శ్రోతలూ, సాహితీప్రియులే కాదు వేదపండితులూ ట్విటర్‌లో హల్‌చల్‌ చేయడం మొదలుపెట్టారు. నండూరి శ్రీనివాస్‌గారు లాంటి ఆధ్యాత్మిక వక్తలు తమ వ్యాఖ్యానాలతో పాటస్థాయిని ఎంతో ఎత్తుకు చేర్చారు. ఓ మంచి గీతాన్ని కళ్లకద్దుకునే సదభిరుచి ప్రేక్షకుల్లో ఇంకా ఉందనడానికి ఇదే నిదర్శనం అనిపించింది!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని