శాంసంగ్‌కు యాపిల్‌ గుడ్‌బై.. ఆ విషయంలో ఇక సొంతకాళ్లపై!

ఇతర సంస్థలు తయారు చేసే డిస్‌ప్లే వినియోగాన్ని తగ్గించి సొంతంగా తయారీపై యాపిల్‌ దృష్టి పెట్టింది. దీనివల్ల శాంసంగ్‌, ఎల్‌జీ వంటి కంపెనీలపై ప్రభావం పడనుంది.

Published : 11 Jan 2023 22:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌ (Apple) కొత్త ఆలోచన చేస్తోంది. సొంతంగా తయారుచేసిన డిస్‌ప్లేలనే ఇకపై తమ ఉత్పత్తులకు వాడాలని కంపెనీ భావిస్తోంది. ఇందులో భాగంగా 2024 నుంచి తమ ఐఫోన్లలో సొంతంగా తయారుచేసిన డిస్‌ప్లేలను వినియోగించేందుకు ప్రయత్నాలు మెదలు పెట్టింది. శాంసంగ్‌, ఎల్‌జీ వంటి సంస్థలపై ఆధారపడడం తగ్గించుకోవడంలో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలిసింది.

శామ్‌సంగ్‌ (Samsung), ఎల్‌జీ (LG) వంటి సంస్థలు తయారు చేసిన డిస్‌ప్లేలనే యాపిల్ కంపెనీ తన ఉత్పత్తుల్లో ఇంతకాలం వినియోగించుకుంటూ వచ్చింది. వాటి వాడకాన్ని తగ్గించటం కోసం తానే సొంతంగా డిస్‌ప్లేని తయారుచేయడానికి పూనుకుంది. దాదాపుగా అన్ని యాపిల్‌ ఉత్పత్తుల్లో సొంతంగా తయారు చేసుకున్న డిస్‌ప్లేనే రానున్న రోజుల్లో వాడాలని చూస్తోంది. ఇందుకోసం డిస్‌ప్లే తయారీని ఇప్పటికే యాపిల్‌ ప్రారంభించింది. తొలుత యాపిల్‌ వాచ్‌ల్లో సొంత డిస్‌ప్లేను వినియోగాన్ని ప్రారంభించి.. తర్వాత ఐఫోన్లకూ విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఉన్న ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే స్థానంలో మైక్రో ఎల్‌డీ డిస్‌ప్లేలను తీసుకురావాలని యాపిల్‌ భావిస్తోంది. అదే జరిగితే యాపిల్ సంస్థకు డిస్‌ప్లేలను సరఫరా చేసే రెండు పెద్ద కంపెనీలైన శామ్‌సంగ్‌, ఎల్‌జీకి గట్టి దెబ్బేనని చెప్పాలి. దీనివల్ల డిజైన్‌ విషయంలోనూ యాపిల్‌కు మరింత స్వేచ్ఛ దొరుకుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని