స్టార్ల స్టార్టప్స్‌.. పట్టేశాయి యూనికార్న్ స్టేటస్!

దేశంలో స్టార్టప్‌ల్లో సెలబ్రిటీలు పెట్టుబడి పెట్టడం కొత్తేమీ కాదు. సినీ ప్రముఖులు అమితాబ్‌, అక్షయ్‌ కుమార్‌, సునీల్‌ శెట్టి, క్రికెటర్లు సచిన్‌, ధోనీ, విరాట్‌ వివిధ స్టార్టప్‌ల్లో పెట్టుబడి పెట్టిన వారే. 110కి పైగా స్టార్టప్‌ల్లో భారత ప్రముఖుల పెట్టుబడులు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

Published : 16 Jan 2024 08:35 IST

క్రికెట్‌, సినిమా రంగాల్లో చాలా మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. అందులో విజయవంతం అయ్యేది కొందరే. ఆయా రంగాల్లో రాణించిన కొందరు వ్యాపారాలు చేయడం కొత్తేమీ కాదు. అలాంటిది కేవలం ఆలోచనే వ్యాపారంగా మొదలయ్యే స్టార్టప్‌ల్లో పెట్టుబడి అంటే కాస్త రిస్క్‌తో కూడుకున్న వ్యవహారమే. అలాంటి వాటిలోనూ పెట్టుబడి పెట్టిన కొందరు క్రికెట్‌, సినీ ప్రముఖులు సక్సెస్‌ అయ్యారు. అంతేకాదు వారు పెట్టుబడి పెట్టిన కంపెనీలు యూనికార్న్‌ స్టేటస్‌ను సాధించాయి.

దేశంలో స్టార్టప్‌ల్లో సెలబ్రిటీలు పెట్టుబడి పెట్టడం కొత్తేమీ కాదు. సినీ ప్రముఖులు అమితాబ్‌, అక్షయ్‌ కుమార్‌, సునీల్‌ శెట్టి, క్రికెటర్లు సచిన్‌, ధోనీ, విరాట్‌ వివిధ స్టార్టప్‌ల్లో పెట్టుబడి పెట్టిన వారే. 110కి పైగా స్టార్టప్‌ల్లో భారత ప్రముఖుల పెట్టుబడులు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. వారి స్టార్‌డమ్‌ ఓ విధంగా ఆయా కంపెనీల వృద్ధికి దోహదం చేస్తుంటాయి. ఈక్విటీకి బదులుగా చిన్న వ్యాపార సంస్థల్లో ఇన్వెస్ట్‌ చేసే వారిని ఏంజెల్ ఇన్వెస్టర్లు అంటారు. అలా సినీ, క్రికెట్‌ ప్రముఖులు ఏంజెల్‌ ఇన్వెస్టర్లుగా ఉన్న ఆరు స్టార్టప్‌లు 1 బిలియన్‌ డాలర్లు కంపెనీలుగా మారాయి. ఆ కంపెనీలు, సెలబ్రిటీల వివరాలు ఇవీ..

  • 2018లో ప్రారంభమైన మొబైల్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఆన్‌లైన్‌ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లో క్రికెటర్‌ విరాట్‌కు పెట్టుబడులు ఉన్నాయి. 2019లో విరాట్‌ ఇందులో ఇన్వెస్ట్‌ చేశారు. 2021లో 150 మిలియన్‌ డాలర్లు నిధులను ఈ కంపెనీ సమీకరించింది. దీంతో 2.3 బిలియన్‌ డాలర్ల వాల్యూషన్‌తో యూనికార్న్‌ క్లబ్‌లో చేరింది.
  • డిజిటల్‌ ఇన్సురెన్స్‌ కంపెనీ అయిన ‘డిజిట్‌ ఇన్సురెన్స్‌’ 2016లో ప్రారంభమైంది. ఈ కంపెనీలో విరుష్క జోడీకి పెట్టుబడులు ఉన్నాయి. 2020లో ఈ జంట పెట్టుబడి పెట్టింది. 2021లో 1.9 బిలియన్ డాలర్ల వాల్యూషన్‌తో ఈ కంపెనీ యూనికార్న్‌గా అవతరించింది.
  • ప్రీ ఓన్డ్‌ కార్స్‌ విక్రయాలు, ఫైనాన్సింగ్‌ చేపట్టే కార్స్‌24 సంస్థ 2015లో ప్రారంభమైంది. ఈ కంపెనీలో మహేంద్ర సింగ్‌ ధోనీ 2019లో వ్యూహాత్మక పెట్టుబడిదారుగా మారారు. అంతేకాదు ఈ కంపెనీ బ్రాండ్‌ అంబాసిడర్‌గానూ మహీ వ్యవహరిస్తున్నారు. 2020లో 200 మిలియన్‌ డాలర్లను కంపెనీ సమీకరించింది. 1 బిలియన్ డాలర్ల వాల్యూషన్‌తో యూనికార్న్‌ స్టేటస్‌ సంపాదించింది.

  • ఆన్‌లైన్‌ మేకప్‌ బ్రాండ్‌ మైగ్లామ్‌ 2017లో ప్రారంభమైంది. 2021 నవంబర్‌లో ఈ కంపెనీ యూనికార్న్‌ స్టార్టప్‌గా హోదా సాధించింది. ఈ స్టేటస్‌ సాధించిన తొలి బ్యూటీ కామర్స్‌ స్టార్టప్‌ కూడా ఇదే. ఈ స్టేటస్‌ సాధించడానికి కొన్ని నెలల ముందు 2021 జూన్‌లో శ్రద్ధా కపూర్‌ పెట్టుబడి పెట్టారు.
  • పాత కార్లను విక్రయించే సంస్థ స్పిన్నీలో మాజీ సచిన్‌ తెందూల్కర్‌గా పెట్టుబడి పెట్టారు. 2015లో ప్రారంభమైన ఈ కంపెనీలో 2021 డిసెంబర్‌లో ఇన్వెస్ట్‌ చేశారు. అంతేకాదు బ్రాండ్‌ అంబాసిడర్‌గానూ అవతారమెత్తారు. సచిన్‌ పెట్టుబడి పెట్టడానికి కొన్ని రోజుల ముందే 2021 నవంబర్‌లో ఈ కంపెనీ 285 మిలియన్‌ డాలర్లు సమీకరించింది. తద్వారా యూనికార్న్‌ క్లబ్‌లో చేరింది.
  • స్టాక్‌బ్రోకర్‌ అయిన అప్‌స్టాక్స్‌లో క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ 2022లో ఆయన ఇన్వెస్ట్‌ చేశారు. ఏడాది ముందే అంటే 2021 నవంబర్‌లోనే ఈ సంస్థ యూనికార్న్‌ క్లబ్‌లో చేరింది.

వీరే కాదు.. బాలీవుడ్‌ ప్రముఖులైన శిల్పా శెట్టి ఏడు స్టార్టప్‌ల్లో పెట్టుబడులు పెట్టారు. ఐశ్వర్యారాయ్‌ బచ్చన్, అమితాబ్‌, శ్రద్ధా కపూర్‌ ఆరేసి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. అనుష్కశర్మకు మొత్తం ఐదు అంకురాల్లో పెట్టుబడులు ఉన్నాయి. నటుడు, క్రికెటర్‌ వ్యాఖ్యాత గౌరవ్‌ కపూర్‌ అయితే ఏకంగా 19 స్టార్టప్‌ల్లో పెట్టుబడి పెట్టారు.

-ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని