Loan Against FD: ఎఫ్‌డీని బ్రేక్‌ చేయకుండానే అత్యవసర సమయంలో డబ్బు పొందొచ్చిలా..

Loan Against FD: చాలా మంది అత్యవసర సమయాల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ని బ్రేక్‌ చేస్తుంటారు. కానీ, ఆ అవసరం లేకుండా.. ఎఫ్‌డీపైనే రుణం తీసుకునే వెసులుబాటు ఉంటుంది.

Published : 08 May 2023 13:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (Fixed Deposit)పై రుణాలకు ఇటీవలి కాలంలో ఆదరణ పెరుగుతోంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా విడుదల చేసిన 2023 ఏప్రిల్‌ బులెటిన్‌ ప్రకారం 2022- 23లో ఈ తరహా లోన్‌లలో 43 శాతం వృద్ధి నమోదైంది. భారత్‌లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రిటైల్‌ లోన్‌లలో ఈ కేటగిరీ ముందుంది. 2023 ఫిబ్రవరి నాటికి ఎఫ్‌డీ (Fixed Deposit)లపై జారీ చేసిన రుణాల మొత్తం రూ.1.13 లక్షల కోట్లకు చేరింది.

డబ్బు అవసరం ఉన్నప్పుడు ఆస్తుల్ని తనఖా పెట్టి రుణాలను తీసుకుంటుంటాం. అదే తరహాలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను సైతం తనఖాగా చూపించి లోన్‌ (Loan Against FD) పొందొచ్చు. అత్యవసర సమయాల్లో, స్వల్ప వ్యవధి కోసం డబ్బు అవసరమైనప్పుడు కచ్చితంగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (Loan Against FD)పై లోన్‌ను ఒక ఆప్షన్‌గా పరిగణించొచ్చు. వడ్డీరేటు కూడా ఇతర రకాల లోన్లతో పోలిస్తే తక్కువగానే ఉంటుంది. చాలా బ్యాంకులు ఎఫ్‌డీపై రుణాలను ఓవర్‌డ్రాఫ్ట్‌ రూపంలో అందజేస్తాయి.

ఎఫ్‌డీపై రుణం వల్ల ప్రయోజనాలు..

70%- 90% వరకు రుణం..

ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ మొత్తం విలువలో 70-90% వరకు రుణం (Loan Against FD)గా పొందొచ్చు. ఉదాహరణకు రూ.10 లక్షల ఎఫ్‌డీ ఉందనుకుందాం. అప్పుడు బ్యాంకు రూ.7 నుంచి రూ.9 లక్షల వరకు రుణాన్ని అందజేస్తుంది. అయితే, ఇది బ్యాంకుని బట్టి మారొచ్చు.

తక్కువ వడ్డీరేటు..

ఎఫ్‌డీపై రుణం (Loan Against FD) తీసుకుంటే వడ్డీరేటు కూడా తక్కువగానే ఉంటుంది. సాధారణంగా ఎఫ్‌డీపై ఇచ్చే వడ్డీరేటు కంటే 2% నుంచి 3% అధికంగా ఉంటుంది. ఉదాహరణకు మీ ఎఫ్‌డీపై బ్యాంక్‌ ఆరు శాతం వడ్డీరేటు ఇస్తుందనుకుందాం. అలాంటప్పుడు దీనిపై తీసుకునే రుణానికి వడ్డీరేటు 8-9% మధ్య ఉంటుంది. వ్యక్తిగత రుణాలతో పోలిస్తే ఇది తక్కువే.

కాలపరిమితి ఇలా..

ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌కి వర్తించే కాలపరిమితే.. దానిపై తీసుకునే రుణానికీ వర్తిస్తుంది. కావాలనుకుంటే తక్కువ గడువుతో రుణం తీసుకోవచ్చు. కానీ, ఎఫ్‌డీ కాలపరిమితి కంటే మాత్రం రుణ గడువు అధికంగా ఉండొద్దు. ఉదాహరణకు ఐదేళ్ల గుడువుతో ఎఫ్‌డీ తీసుకుంటే.. రుణ కాలపరిమితి ఆ కాలాన్ని మించిపోకూడదు.

ప్రాసెసింగ్‌ ఫీజు ఉండదు..

ఇతర రుణాల్లోలాగా ఎఫ్‌డీపై తీసుకునే రుణానికి ఎలాంటి ప్రాసెసింగ్‌ రుసుములు ఉండవు. అయితే, బ్యాంకును బట్టి ఈ నిబంధన మారుతుంది. ఒకవేళ ఏదైనా బ్యాంకు రుసుము వసూలు చేసినా.. అది చాలా తక్కువగా ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ చాలా సులభం..

పెద్దగా పత్రాలు, ప్రక్రియలు అవసరం లేకుండానే ఎఫ్‌డీపై రుణం పొందొచ్చు. సంబంధిత ఫారాలపై రుణం తీసుకుంటున్నట్లు సంతకం చేసి కేవైసీ సమర్పిస్తే సరిపోతుంది.

ఎఫ్‌డీని బ్రేక్‌ చేయాల్సిన అవసరం లేదు..

చాలా మంది ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో ఎఫ్‌డీని బ్రేక్‌ చేస్తుంటారు. దీని వల్ల కొంత వరకు వడ్డీ ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుంది. కానీ, ఎఫ్‌డీపై రుణాన్ని తీసుకుంటే దాన్ని బ్రేక్‌ చేయాల్సిన అవసరం ఉండదు. ఇటు మన అవసరం తీరడంతో పాటు ఎఫ్‌డీ కూడా కొనసాగుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని