EPFO: అధిక పింఛన్ అందేదెన్నడో..
‘దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించనట్లు’ తయారైంది ఉద్యోగులు, పింఛన్‌దారుల పరిస్థితి. ఉద్యోగ విరమణ తర్వాత అధిక పింఛన్ పొందేందుకు ఈపీఎఫ్ చందాదారులకు అవకాశం కల్పిస్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
సుప్రీంకోర్టు తీర్పు వెలువడి నెల రోజులు
నిబంధనలు జారీ చేయని ఈపీఎఫ్ఓ
ఆందోళనలో చందాదారులు
ఈనాడు, హైదరాబాద్: ‘దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించనట్లు’ తయారైంది ఉద్యోగులు, పింఛన్‌దారుల పరిస్థితి. ఉద్యోగ విరమణ తర్వాత అధిక పింఛన్ పొందేందుకు ఈపీఎఫ్ (EPF) చందాదారులకు అవకాశం కల్పిస్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఇది జరిగి నెల రోజులు దాటింది. ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అవసరమైన నిబంధనలను ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) (EPFO) ఇప్పటివరకు జారీ చేయలేదు. దీంతో అధిక పింఛన్ వస్తుందన్న ఆశ ఎప్పుడు ఫలిస్తుందోనని చందాదారులు ఆందోళన చెందుతున్నారు.
సుప్రీం వెసులుబాటు కల్పించినా..
ఉద్యోగుల పింఛన్ పథకం(ఈపీఎస్)లో ఏటా 27.95 కోట్ల మంది చందాదారులు చందా చెల్లిస్తున్నారు. ప్రస్తుతం 72.73 లక్షల మంది పింఛన్‌దారులు ఉన్నారు. ఉద్యోగులు, కార్మికులు ఈపీఎస్ కింద ఏటా చెల్లించే వాటా రూ.50 వేల కోట్లు ఉండగా.. పింఛన్ల కోసం ఈపీఎఫ్ఓ రూ.20 వేల కోట్ల వరకు వెచ్చిస్తోంది. ప్రస్తుత పింఛన్‌దారుల్లో 95 శాతం మందికి నెలకు రూ.2వేల లోపే సొమ్ము అందుతోంది. వారు కొన్నేళ్లుగా అధిక పింఛన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మొత్తాన్ని పెంచేందుకు ఈపీఎఫ్ఓతో పాటు ఆర్థికశాఖ ఈపీఎస్ నిధుల్లో లోటును సాకుగా చూపిస్తోంది. మరోవైపు అధిక వేతనాలు పొందుతున్నవారు పింఛన్ నిధికి ఎక్కువ మొత్తంలో చెల్లించినా.. ఆ మేరకు ఎక్కువ పింఛన్ తీసుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. ఈపీఎఫ్ చట్టంలోని పేరా 11(3) ప్రకారం 2014 నాటి సవరణకు ముందు గరిష్ఠ వేతన పరిమితి రూ.6,500గా ఉంది. అంతకు మించి వేతనం పొందుతున్న ఉద్యోగులు ఈపీఎస్‌లో చేరేందుకు ఆ వేతనంపై 8.33 శాతం పూర్తిగా ఈపీఎస్‌లో జమ చేయాలి. ఉద్యోగులు ఈ పథకంలో చేరేందుకు గరిష్ఠ గడువు తేదీ ఏమీ చెప్పలేదు. 2014లో గరిష్ఠ వేతన పరిమితిని రూ.15 వేలకు పెంచింది. దీనికి ముందు ఆప్షన్ ఇచ్చిన ఉద్యోగులు.. ఆరు నెలల్లోగా అధిక వేతనంపై ఈపీఎస్‌లో చేరేందుకు ఆప్షన్ ఇవ్వాలని సూచించింది. 2014 సవరణ నాటికి ఈ పథకంలో చేరని ఉద్యోగులు ఆప్షన్ ఇచ్చేందుకు ఈపీఎఫ్ఓ అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల భవిష్యనిధి పింఛన్ పథకం- 2014 సవరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గరిష్ఠ వేతన పరిమితి రూ.15 వేల కన్నా ఎక్కువ వేతనం పొందుతూ ఇప్పటివరకు పింఛన్ పథకంలో చేరని ఉద్యోగులకు వెసులుబాటు కల్పించింది. 2014 సవరణకు ముందు అధిక పింఛన్ పొందేందుకు ఈపీఎస్‌లో చేరనివారికి నాలుగు నెలల సమయం ఇచ్చింది. సుప్రీంతీర్పు ఇచ్చినప్పటి నుంచి నాలుగు నెలల్లోగా యజమానితో కలిసి ఉమ్మడిగా ఆప్షన్లు ఇచ్చేందుకు అవకాశం కల్పించాలని సూచించింది. అయినా ఈపీఎఫ్ఓ ఇప్పటివరకు నిబంధనలు వెలువరించలేదు. అధిక పింఛన్‌పై ఆశతో విశ్రాంత, ప్రస్తుత ఉద్యోగులు ప్రాంతీయ పీఎఫ్ కార్యాలయాలకు వెళ్లి సంప్రదిస్తున్నారు. అయితే కేంద్ర పీఎఫ్ కార్యాలయం నుంచి నిబంధనలు వచ్చేవరకు ఏమీ చెప్పలేమంటూ వారిని సిబ్బంది తిప్పిపంపుతున్నారు.
ఈపీఎస్ నిధులపై మదింపు!
పింఛన్ మొత్తం పెంచాలన్న డిమాండ్ల నేపథ్యంలో ఉద్యోగుల పింఛన్ నిధిలో జమ అవుతున్న నిధులపై మదింపు చేయాలని ఈపీఎఫ్ఓ నిర్ణయించింది. ఏటా వసూలవుతున్న చందా నిధులు, చెల్లిస్తున్న పింఛన్ సొమ్మును బట్టి భారం అంచనా వేయాలని సూచించింది. ఎనిమిదేళ్ల క్రితం కనీస వేతన పరిమితిని రూ.6,500 నుంచి రూ.15 వేలకు పెంచిన నేపథ్యంలో.. ఆ తర్వాతి నుంచి ఏటా పడుతున్న భారాన్ని లెక్కించాలని సూచించింది. అధిక వేతనం పొందుతూ ఆ మేరకు పింఛన్ నిధి చెల్లించినవారికి అధిక పింఛన్ ఇవ్వడం వల్ల ఈపీఎఫ్ఓపై పడే భారాన్ని పరిశీలించనుంది. దీంతో పాటు పింఛన్‌ను లెక్కించేందుకు సగటు వేతనాన్ని 24 నెలలు.. 30.. 36.. 60 నెలలకు పరిశీలించి, ఆ మేరకు వ్యత్యాసాన్ని ఇవ్వాలని సూచించింది. అవసరమైతే ఇప్పటివరకు 20 ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న వారికి అదనంగా ఇస్తున్న రెండేళ్ల బోనస్ సర్వీసు తొలగింపు, ముందస్తు పింఛన్ వయోపరిమితిని 50 నుంచి 55 ఏళ్లకు పెంచడం తదితర విషయాలను పరిశీలించి నివేదిక తెప్పించుకోనుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Ponguleti: ఏడున్నరేళ్లుగా ఇబ్బందులు పెట్టారు: పొంగులేటి
-
India News
Pathaan: ‘పఠాన్’ సినిమా కోసం పక్క రాష్ట్రానికి దివ్యాంగుడు
-
Ts-top-news News
Hyderabad: సరదా తెచ్చిన సమస్య.. కాపాడిన తిరుమలగిరి పోలీసులు
-
Ap-top-news News
Tamil Nadu: తెలుగువారు తలచుకుంటే సాయంత్రానికి జీవో ఖాయం: కిషన్‌రెడ్డి
-
Ap-top-news News
Bachula Arjunudu: తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడి ఆరోగ్యం విషమం
-
India News
ట్రాన్స్‌జెండర్‌తో వివాహం.. యువకుడికి బంధువుల వేధింపులు