రూ.50 లక్షల కోట్లు

దేశీయ మ్యూచువల్‌ ఫండ్లలోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. 2023 డిసెంబరు చివరికి ఫండ్‌ సంస్థల(ఏఎంసీ) నిర్వహణలోని ఆస్తుల విలువ (ఏయూఎం) రూ.50,77,900.36 కోట్లకు చేరింది.

Updated : 09 Jan 2024 06:59 IST

మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడుల విలువ

ఈనాడు, హైదరాబాద్‌: దేశీయ మ్యూచువల్‌ ఫండ్లలోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. 2023 డిసెంబరు చివరికి ఫండ్‌ సంస్థల(ఏఎంసీ) నిర్వహణలోని ఆస్తుల విలువ (ఏయూఎం) రూ.50,77,900.36 కోట్లకు చేరింది. నవంబరులో ఈ విలువ రూ.49,04,992.39 కోట్లుగా ఉంది. ఇదే సమయంలో మొత్తం పోర్ట్‌ఫోలియోలు కూడా 16.18 కోట్ల నుంచి, 16.49 కోట్లకు చేరాయి. ఇది జీవన కాల గరిష్ఠస్థాయి అని భారతీయ మ్యూచువల్‌ ఫండ్ల సంఘం (యాంఫీ) సోమవారం వెల్లడించింది.  రిటైల్‌ పెట్టుబడిదారుల సంఖ్య 13.18 కోట్లకు చేరింది. 2021 మార్చి నుంచి వరుసగా 34 నెలల పాటు మ్యూచువల్‌ ఫండ్లలోకి నికర పెట్టుబడులు కొనసాగాయి. ఈక్విటీ, హైబ్రిడ్‌, సొల్యూషన్‌ ఓరియెంటెడ్‌ పథకాల్లోని రిటైల్‌ పెట్టుబడుల విలువ రూ.28,87,504 కోట్లకు చేరింది. గత నెలలో మొత్తం 21 కొత్త పథకాలను మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు ఆవిష్కరించాయి. ఓపెన్‌ ఎండెడ్‌, క్లోజ్డ్‌ ఎండెడ్‌ ఫథకాలు కలిసి రూ.9,872 కోట్లను సమీకరించాయి. క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్‌) ద్వారా ఫండ్లలోకి రూ.17,610.16 కోట్లు వచ్చాయి. మొత్తం సిప్‌ ఖాతాలు 7.63 కోట్లను మించాయి. డిసెంబరులో కొత్తగా 40.32 లక్షల మంది సిప్‌ ఖాతాలు ప్రారంభించారు.

10 ఏళ్లలో 6 రెట్లు

మ్యూచువల్‌ ఫండ్ల నిర్వహణలోని ఆస్తుల విలువ 2013లో రూ.8.25 లక్షల కోట్లుగా ఉంది. ఈ పదేళ్లలో దాదాపు 6 రెట్ల మేర వీటి విలువ పెరిగింది. క్రమానుగత పెట్టుబడి విధానంపై అవగాహన పెరగడం, ఆర్థిక లక్ష్యాల సాధనకు ఇదొక ఉత్తమ మార్గంగా మదుపర్లు భావిస్తున్నందునే, పెట్టుబడులు పెరుగుతున్నాయి. 2018 డిసెంబరులో 1.91 కోట్లుగా ఉన్న కొత్త మదుపరుల సంఖ్య గత ఏడాది చివరికి 4.21 కోట్లకు చేరింది.

ప్రధాన పాత్ర ‘సిప్‌’లదే

మ్యూచువల్‌ ఫండ్ల ఏయూఎం గణనీయంగా పెరిగేందుకు ప్రధానంగా ‘సిప్‌’లే కారణమని చెప్పొచ్చు. 2020 ఆర్థిక సంత్సరంలో రూ.8వేల కోట్లుగా ఉన్న నెలవారీ సిప్‌ పెట్టుబడులు 2023 డిసెంబరు నాటికి రూ.17,610 కోట్లకు చేరాయి. 2023లో సిప్‌ల ద్వారానే మార్కెట్లోకి రూ.1,41,000 కోట్లు వచ్చాయి. ఈ విధానంలో వచ్చిన మొత్తం పెట్టుబడుల విలువ గత నెలాఖరుకు రూ.10 లక్షల కోట్లకు చేరింది. ఇదీ ఒక మైలురాయిగానే చెప్పొచ్చు.

రూ.కోటి కోట్లకు

మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమపై మదుపరుల విశ్వాసం పెరగడంతోనే పెట్టుబడుల విలువ (ఏయూఎం) రూ.50 లక్షల కోట్ల స్థాయికి చేరిందని యాంఫీ ఛైర్మన్‌ నవ్‌నీత్‌ మునోత్‌ పేర్కొన్నారు. 10 కోట్ల మంది మదుపరులు, రూ.కోటి కోట్ల ఏయూఎం స్థాయికి చేరేందుకు ఎంతోకాలం పట్టదనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఏయూఎం రూ.10 లక్షల కోట్ల స్థాయికి చేరేందుకు 50 ఏళ్లు పట్టిందని, అదే రూ.40 లక్షల కోట్ల నుంచి రూ.50 లక్షల కోట్ల స్థాయికి ఏడాది కాలంలోనే చేరుకుందని యాంఫీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ వెంకట్‌ చలసాని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని