బోయింగ్‌ మ్యాక్స్‌ విమానాలకేమైంది?

విమానం ఎక్కాలని ఎవరికుండదు. అయితే అలా ప్రయాణిస్తున్నపుడు విమానం తలుపు ఊడి పడిపోతే... ఊహించడానికే భయంకరంగా ఉంది కదా. మరి అలస్కా ఎయిర్‌లైన్స్‌లో ఇటీవల ప్రయాణించిన వారి పరిస్థితి ఎలా ఉండి ఉంటుందంటారు.

Updated : 14 Jan 2024 14:59 IST

తలుపు ఊడిపోయిన సంఘటనతో సర్వత్రా ఆందోళన
చాలా దేశాల్లో ఆ సిరీస్‌ కార్యకలాపాలు బంద్‌

విమానం ఎక్కాలని ఎవరికుండదు. అయితే అలా ప్రయాణిస్తున్నపుడు విమానం తలుపు ఊడి పడిపోతే... ఊహించడానికే భయంకరంగా ఉంది కదా. మరి అలస్కా ఎయిర్‌లైన్స్‌లో ఇటీవల ప్రయాణించిన వారి పరిస్థితి ఎలా ఉండి ఉంటుందంటారు. ఈ ఘటన తర్వాత పలు దేశాలకు చెందిన విమానయాన కంపెనీలు బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాలను.. ముఖ్యంగా మ్యాక్స్‌ 9 విమానాల కార్యకలాపాలను పక్కన పెట్టేశాయి. ఇంతకీ బోయింగ్‌కే ఎందుకీ సమస్యలు వస్తున్నాయి?

ఇదొక్క ఘటనే కాదు.. 2018, 2019లలో రెండు బోయింగ్‌ మ్యాక్స్‌ సిరీస్‌ విమానాల దుర్ఘటనలు ఇంకా కళ్లముందే కదలాడుతున్నాయి. ఇండోనేషియాలో ఒకటి, ఇథియోపియాలో ఒకటి కూలి వందల మంది ప్రాణాలను తీశాయి.

ఇంతకీ ఏం జరిగిందంటే..

అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ 737 మ్యాక్స్‌ 9 విమానం అమెరికాలోని పోర్ట్‌లాండ్‌ నుంచి జనవరి 5న కాలిఫోర్నియాకు బయలుదేరింది. 171 మంది ఆ సమయంలో ప్రయాణిస్తున్నారు. విమానం 16,000 అడుగుల ఎత్తుకు చేరగానే.. ఎడమవైపున్న తలుపు ఊడిపోయింది. వెంటనే వెనక్కి తిప్పి అత్యవసర ల్యాండింగ్‌ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అదనపు అత్యవసర మార్గం స్థానంలో ఒక ప్లగ్‌ లేదా ప్యానెల్‌ను ఆ విమానంలో ఉపయోగించారు. 220 మంది ప్రయాణించగల ఆ విమానానికి నిబంధనల ప్రకారం.. అత్యవసర మార్గాలనూ ఏర్పాటు చేశారు. లేఅవుట్‌కు సులువుగా ఉండేలా ప్యానెల్‌/ప్లగ్‌ను అత్యవసర  మార్గంలా ఏర్పాటు చేశారు. అదే ఇక్కడ ఊడిపోయింది.

అంతక్రితమూ ఇలా జరిగిందా?

మ్యాక్స్‌ 9 విమానాల్లో ఇలా తొలిసారి జరిగిందా అన్న ప్రశ్నలూ వచ్చాయి. ఒక వేళ ఇదొక్కటే ఈ తరహా సంఘటన అయి ఉంటే మాత్రం డోర్‌ను బిగించడంలో వైఫల్యమనే చెప్పాలని అమెరికా నేషనల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సేఫ్టీ బోర్డ్‌(ఎన్‌టీఎస్‌బీ) మాజీ సభ్యుడిని ఉటంకిస్తూ ఒక ఆంగ్ల వార్తా పత్రిక తన కథనంలో పేర్కొంది. కాగా, ఎన్‌టీఎస్‌బీ 737 మ్యాక్స్‌ 9 తయారీ ప్రక్రియను పరిశీలిస్తుందని.. డోర్‌/ప్లగ్‌కు చెందిన హింజ్‌లు, స్టాప్‌ ఫిటింగ్‌లతో పాటు కేబిన్‌ ప్రెజరైజేషన్‌ను సైతం పరిశీలిస్తుందని అందులో తెలిపింది. కనీసం ఒక బోల్ట్‌ అయినా ఊడిపోయి ఈ సంఘటన జరిగి ఉండాలని విశ్లేషకులు భావిస్తున్నారు.  

ప్రపంచవ్యాప్తంగా..

అలస్కా ఘటన తర్వాత 171 వరకు ‘మ్యాక్స్‌ 9’ విమానాలను అమెరికాకు చెందిన ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆకాశంలోకి ఎగరనీయకుండా కట్టడి చేసింది. అమెరికానే కాదు.. పనామా, తుర్కియే, మెక్సికో దేశాలూ ఈ సంఘటన తర్వాత ‘737 మ్యాక్స్‌ 9’ విమానాలను నిలిపివేశాయి. చైనాలో ఎటువంటి మ్యాక్స్‌ 9 సిరీస్‌ విమానాలు లేనప్పటికీ.. 2018, 2019 దుర్ఘటనల తర్వాత ఇతర మ్యాక్స్‌ సిరీస్‌ విమానాలన్నిటినీ పక్కన పెట్టింది.

ఆ డోర్ల సరఫరాదారుకూ సమస్యలే..

బోయింగ్‌ 737 ఫ్యూజ్‌లేజెస్‌ను బోయింగ్‌ మాజీ అనుబంధ కంపెనీ అయిన స్పిరిట్‌ ఏరోసిస్టమ్స్‌ తయారు చేస్తోంది. తాజాగా అలస్కా సంఘటనలోని విమానానికి డోర్‌ ప్లగ్‌లను ఈ కంపెనీయే ఇన్‌స్టాల్‌ చేసింది. 737 ఫ్రేమ్‌సెట్‌లో 70 శాతం వరకు స్పిరిట్‌ నిర్మిస్తుందని ఆ కంపెనీ వెబ్‌సైట్‌ చెబుతోంది. వీటిని బోయింగ్‌ ఫ్యాక్టరీకి ఈ కంపెనీ పంపుతుంది. అక్కడ రెక్కలు, తోక, ఇంటీరియర్స్‌ ఇన్‌స్టాలేషన్‌ జరుగుతుంది. ఈ స్పెషల్‌ డోర్‌ అసెంబ్లీని ఇంటీరియర్స్‌ కోసం తీసివేసి ఆ తర్వాత బిగిస్తారు. ఆ సమయంలో సరైన తనిఖీలు జరగాల్సి ఉంటుంది. మరో పక్క, స్పిరిట్‌ కూడా కరోనా నుంచీ ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. మ్యాక్స్‌ సిరీస్‌, డ్రీమ్‌లైనర్‌ విమానాల సమస్యల వల్ల ఈ కంపెనీ ఒత్తిడికి గురైంది.  

బోల్టులే కాదు.. నియంత్రణలూ లూజే

ఇప్పటిదాకా జరిగిన సంఘటనల్లో బోయింగ్‌పై గట్టి చర్యలే తీసుకుని ఉండాలి. అయితే నియంత్రణలో లేని లోపాల కారణంగా ఆ దిశగా అడుగులు పడలేదు. 2018, 2019 దుర్ఘటనల తర్వాత అప్పటి సీఈఓను తొలగించారు. అదీ ఏడాదిన్నర తర్వాత. ట్రంప్‌ ప్రభుత్వం ఆ కంపెనీపై 2.5 బి.డాలర్ల అపరాధ రుసుమును విధించింది. సాఫ్ట్‌వేర్‌ మార్పులను ఎఫ్‌ఏఏకు తెలియజేయడంలో విఫలమైనందుకు ఎటువంటి క్రిమినల్‌ చర్యలూ చేపట్టలేదు. కాబట్టి విమాన డోర్‌ బోల్ట్‌లనే కాదు.. నియంత్రణలనూ పట్టించుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.


భారత్‌పై ప్రభావం ఏమిటి?

అలస్కా ఘటనను మన దేశమూ తీవ్రంగానే పరిగణించింది. దేశంలోని అన్ని విమానయాన కంపెనీలు తక్షణం మ్యాక్స్‌ 9 విమానాలన్నిటినీ తనిఖీ చేయాలని ఆదేశించింది. ఈ తనిఖీలు సంతృప్తికరంగా జరిగాయని ప్రకటించింది. ప్రస్తుతానికైతే ఏ ఇబ్బందీ లేదని తెలుస్తోంది. ఇక ఎయిరిండియా, ఇండిగోలు బోయింగ్‌ వద్ద పెట్టిన భారీ విమానాల ఆర్డర్లు ఈ సంఘటన వల్ల ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఆకాశ ఎయిర్‌ 2024లో తొలి భారీ ఆర్డరును పెట్టనుందన్న వార్తలు వస్తున్నాయి. తాజా పరిణామాలతో దీనిపై ఎటువంటి ప్రభావం ఉంటుందో చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని