అయోధ్యతో పర్యాటకం జోరు

అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రారంభం కావడంతో, ఈ చారిత్రక నగరం ఇకపై అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగులీననుందని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ జెఫ్రీస్‌ తన తాజా నివేదికలో అంచనా వేసింది.

Updated : 28 Jan 2024 06:41 IST

ఏటా 5 కోట్ల మంది సందర్శించే అవకాశం
హోటళ్లు, ప్రయాణ, ఆహార సంస్థలకు గిరాకీ
బ్రోకరేజీ సంస్థ జెఫ్రీస్‌ అంచనా

దిల్లీ: అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రారంభం కావడంతో, ఈ చారిత్రక నగరం ఇకపై అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగులీననుందని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ జెఫ్రీస్‌ తన తాజా నివేదికలో అంచనా వేసింది. ఏడాదికి 5 కోట్ల మంది ఈ ఆధ్యాత్మిక కేంద్రాన్ని సందర్శించే వీలుందని పేర్కొంది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని, అయోధ్యలో 10 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.83,000 కోట్లు) వ్యయంతో వసతులు కల్పించబోతున్నారు.

ఇండియన్‌ హోటల్స్‌, ఐటీసీ, మారియట్‌, ఓయో వంటి ప్రముఖ బ్రాండ్ల హోటళ్లు ఇక్కడ కొలువుదీరనున్నాయి. బర్గర్‌కింగ్‌, మెక్‌డొనాల్డ్స్‌, జుబిలెంట్‌ ఫుడ్స్‌, దేవ్‌యాని ఇంటర్నేషనల్‌ వంటి ఆహార విక్రయ సంస్థలు తమ శాఖలు ఏర్పాటు చేస్తున్నాయి. ఇండిగో, ఎయిరిండియా, స్పైస్‌జెట్‌, ఆకాశ ఎయిర్‌ వంటి సంస్థలు విమాన సర్వీసులు నిర్వహిస్తున్నాయి. ఫలితంగా దేశీయంగా పలు రాష్ట్రాల నుంచి - అంతర్జాతీయ పర్యాటకులు భారీగా తరలి వచ్చే వీలుంది. హోటళ్ల సామర్థ్యం 5 రెట్లు పెరగనుండగా.. ఆహార, ప్రయాణ వ్యాపారాలూ ఊపందుకుంటాయని చెబుతున్నారు.

వడివడిగా నిర్మాణాలు..

ప్రస్తుతం అయోధ్య చుట్టుపక్కల ఉన్న 17 హోటళ్లలో 590 గదులు ఉన్నాయి. మరో 73 కొత్త హోటళ్లు ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే 40 హోటళ్ల నిర్మాణం ప్రారంభమైంది. ఇండియన్‌ హోటల్స్‌ అయోధ్యలో 2 కొత్త ఒప్పందాలు చేసుకుంది. ఇవి 2027 నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తాయి. ఓయో 1,000 హోటల్‌ గదులను ఇక్కడ ఏర్పాటు చేయబోతోంది. 2023 ప్రథమార్ధంలోనే బర్గర్‌ కింగ్‌ ఇక్కడ తన స్టోర్‌ ఏర్పాటు చేసింది. బ్రిటానియా ఇండస్ట్రీస్‌, గోద్రేజ్‌ కన్జూమర్‌, ఐటీసీ, వెస్ట్‌లైఫ్‌ ఫుడ్‌వరల్డ్‌, హెచ్‌యూఎల్‌, దేవ్‌యాని ఇంటర్నేషనల్‌, సఫైర్‌ ఫుడ్స్‌ వంటి ఎఫ్‌ఎంసీజీ కంపెనీలూ ఇక్కడ భారీగా విక్రయాలు జరిపే వీలుంది.

వేగంగా విమానాలు..

ఇండిగో సంస్థ దిల్లీ, అహ్మదాబాద్‌, ముంబయి నుంచి, ఎయిరిండియా బెంగళూరు, కోల్‌కతా, దిల్లీ నుంచి అయోధ్యకు నేరుగా విమానాలు నడుపుతున్నట్లు ప్రకటించాయి. స్పైస్‌జెట్‌, ఆకాశ ఎయిర్‌ కూడా వివిధ నగరాల నుంచి అయోధ్యకు విమానాలను నిర్వహించనున్నాయి. ఐఆర్‌సీటీసీ అయోధ్యకు పర్యాటక ప్యాకేజీలను ప్రకటించింది. మేక్‌ మై ట్రిప్‌, ఈజ్‌ మై ట్రిప్‌ వంటి కంపెనీలు అయోధ్య ప్రయాణాలతో లబ్ధిపడతాయి.

జీడీపీకి ఊతం

2018-19 ఆర్థిక సంవత్సరంలో (కొవిడ్‌కు ముందు) దేశ జీడీపీకి పర్యాటక రంగం 194 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.16.10 లక్షల కోట్ల)ను జత చేయగా, 2032-33 నాటికి 8 శాతం వార్షిక సమ్మిళిత వృద్ధి రేటు (సీఏజీఆర్‌)తో ఇది 443 బి.డాలర్ల (సుమారు రూ.36.77 లక్షల కోట్ల)కు చేరుతుందనే అంచనా ఉంది. జీడీపీలో పర్యాటక రంగ వాటా మన దేశంలో 6.8 శాతం కాగా, వర్థమాన/అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది మరో 3-5 శాతం ఎక్కువగా ఉంది.


అత్యధిక సందర్శకులిక్కడే..

దేశంలో చూస్తే అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయాన్ని 3-3.5 కోట్ల మంది, ఆంధ్ర ప్రదేశ్‌లోని తిరుమలను 2.5-3 కోట్ల మంది ఏటా దర్శిస్తున్నారని అంచనా. అంతర్జాతీయంగా సౌదీ అరేబియాలోని మక్కాను 2 కోట్ల మంది, వాటికన్‌ సిటీని 90 లక్షల మంది వార్షికంగా సందర్శిస్తున్నారు. వీటితో పోలిస్తే సందర్శకుల విషయంలో అయోధ్య ముందు నిలిచే అవకాశం కనిపిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని