Satya Nadella: సాహో.. సత్య నాదెళ్ల

ఒక టెక్‌ కంపెనీలో విశేషమైన మార్పు తీసుకువచ్చిన ఘనత సత్య నాదెళ్లకు దక్కుతుంది. స్టీవ్‌ జాబ్స్‌ ఐఫోన్‌ ఆవిష్కరణతో యాపిల్‌ కంపెనీని అగ్రగామిగా తీర్చిదిద్దిన ఉదంతంతో సత్య నాదెళ్ల సాధించిన ఘనతను పోల్చవచ్చు.

Updated : 04 Feb 2024 07:57 IST

మైక్రోసాఫ్ట్‌ పగ్గాలు చేపట్టి నేటితో 10 ఏళ్లు

ఒక టెక్‌ కంపెనీలో విశేషమైన మార్పు తీసుకువచ్చిన ఘనత సత్య నాదెళ్లకు (Satya Nadella) దక్కుతుంది. స్టీవ్‌ జాబ్స్‌ ఐఫోన్‌ ఆవిష్కరణతో యాపిల్‌ కంపెనీని అగ్రగామిగా తీర్చిదిద్దిన ఉదంతంతో సత్య నాదెళ్ల సాధించిన ఘనతను పోల్చవచ్చు.

వాల్‌స్ట్రీట్‌ విశ్లేషకులు


గ్రగామి ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్‌లో (Microsoft) గత పదేళ్లలో ఎన్నో మార్పులు.. విజయాలు. కొన్ని విభాగాల్లోనేమో అనూహ్య వృద్ధి. అన్నిటికీ మించి స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో మైక్రోసాఫ్ట్‌ షేరు 1000 శాతానికి పైగా పెరిగి, మార్కెట్‌ విలువ దాదాపు 3 ట్రిలియన్‌ డాలర్లకు చేరడం విశేషం. ఇవన్నీ భారత సంతతికి చెందిన సత్య నాదెళ్ల (Satya Nadella) సారథ్యంలోనే సాధ్యమయ్యాయి. మైక్రోసాఫ్ట్‌ సీఈఓగా ఆయన బాధ్యతలు చేపట్టి నేటికి పదేళ్లు. 

నాదెళ్ల అడుగుపెట్టడానికి ముందు వరకు మైక్రోసాఫ్ట్‌ (Microsoft) మందగమనంతో సాగింది. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత క్లౌడ్‌ కంప్యూటింగ్‌, కృత్రిమ మేధ(ఏఐ)పై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి కార్యకలాపాలను పరుగు పెట్టించారు. దీంతో మైక్రోసాఫ్ట్‌ మార్కెట్‌ విలువ కూడా శరవేగంగా పెరిగింది. గత పదేళ్ల కాలంలో మైక్రోసాఫ్ట్‌ వాటాదార్ల సంపద 2.8 ట్రిలియన్‌ డాలర్లకు పెరగడం గమనార్హం. సత్య నాదెళ్ల సీఈఓగా బాధ్యతలు చేపట్టిన నాడు 10,000 డాలర్లు పెట్టి మైక్రోసాఫ్ట్‌ షేర్లు కొనుగోలు చేస్తే, ఆ షేర్ల విలువ ఇప్పుడు 1,13,000 డాలర్లు అయింది.

అనుమానాల్ని పటాపంచలు చేసి..: ‘ఐటీ పరిశ్రమ సంప్రదాయాన్ని గౌరవించదు, పరిశోధననే గౌరవిస్తుంది-అని సీఈఓగా బాధ్యతలు చేపట్టినప్పుడు సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగులతో అన్నారు. అప్పటికే ఆయన 22 ఏళ్లుగా మైక్రోసాఫ్ట్‌లో పని చేస్తున్నారు. కొత్తగా ఆయన ఏమి చేయగలరు..? అని ఎంతో మంది అనుమానించారు. బిల్‌ గేట్స్‌, స్టీవ్‌ బామర్‌ తర్వాత మైక్రోసాఫ్ట్‌కు (Microsoft) సీఈఓ కావడం అంటే పెద్ద సవాలే. సత్య నాదెళ్ల చేసే ప్రతి పనిని, ప్రతి కదలికను ఆ ఇద్దరితో పోల్చి చూస్తారు. కానీ అందరి అపనమ్మకాలను పటాపంచలు చేస్తూ, మైక్రోసాఫ్ట్‌లో శరవేగంగా మార్పులు తీసుకువచ్చారు. సంస్థకు ఉన్న శక్తియుక్తులన్నింటినీ కేంద్రీకరించి ‘అజూర్‌’ క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించారు. ఒక చిన్న అంకుర సంస్థకు మైక్రోసాఫ్ట్‌తో అవసరం ఉండదు, కానీ అటువంటి సంస్థలన్నింటినీ ఓపెన్‌ ఏఐ ద్వారా అజూర్‌ ప్లాట్‌ఫామ్‌ మీదకు తీసుకురాగలిగారు. దీంతో గూగుల్‌, అమెజాన్‌లతో పోల్చితే మైక్రోసాఫ్ట్‌ పైచేయి సాధించే అవకాశం ఏర్పడింది. విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ మీద లభించే రాయల్టీ మీద ఆధారపడటాన్ని తగ్గించారు. సెల్‌ఫోన్ల వ్యాపారంలో రాణించాలనే ఆకాంక్షకు కళ్లెం వేశారు. నోకియా ఫోన్ల వ్యాపారాన్ని ఆయన కంటే ముందు సీఈఓగా ఉన్న స్టీవ్‌ బామర్‌ 7.3 బి.డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అప్పటిదాకా అంతర్గతంగా ఉత్తమ ఫలితాలు సాధించడం కంటే, ప్రజలు-పరిశ్రమలో బ్రాండ్‌ బిల్డింగ్‌ వైపు మైక్రోసాఫ్ట్‌ ఎక్కువగా మొగ్గుచూపేది. ఆ వైఖరిని ఆయన పూర్తిగా మార్చారు.


సైబర్‌ దాడులను తట్టుకుని మరీ..

సత్య నాదెళ్లకు (Satya Nadella) గత పదేళ్లలో సవాళ్లూ ఎదురయ్యాయి. మైక్రోసాఫ్ట్‌ ఉత్పత్తులు సైబర్‌ దాడులకు నిలవలేకపోవడం ఇందులో ముఖ్యమైనది. మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌ 365 వర్క్‌ టూల్‌పై రష్యా, చైనా హాకర్లు పెద్దఎత్తున దాడులు చేయడం, యూఎస్‌ ప్రభుత్వ ఉన్నతాధికార్లు, మైక్రోసాఫ్ట్‌ సీనియర్‌ అధికార్ల ఇ-మెయిళ్లను హ్యాక్‌ చేయడం తెలిసిందే. రష్యా దాడి చేయడానికి కొద్దిగా ముందు ఉక్రెయిన్‌కు మైక్రోసాఫ్ట్‌ క్లౌడ్‌ హోస్టింగ్‌ సేవలు అందించింది. ఆ సమయంలో నాటో సేనలకు చెందిన నెట్‌వర్క్స్‌ మీద పెద్దఎత్తున సైబర్‌ దాడులు జరగడం కలకలం రేకెత్తించింది. దీంతో రష్యా, చైనాలతో కలిసి ఒక సదస్సును నిర్వహించేందుకు సత్య నాదెళ్ల పూనుకున్నారు. మరోపక్క, ఓపెన్‌ ఏఐతో మైక్రోసాఫ్ట్‌ ఇప్పటికీ కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటోంది. అయినప్పటికీ సత్య నాదెళ్ల (Satya Nadella) తాను ఎంచుకున్న మార్గంలో ముందుకు సాగుతున్నారు. ఇంకా ఎన్నో విజయాలను ఆయన ఆవిష్కరిస్తారు.. మనం ఎన్నో విశేషాలు చూస్తాం అని ఐటీ నిపుణులు, వాల్‌స్ట్రీట్‌ పెట్టుబడిదార్లు భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని