అమెరికాలో ఐటీ ఉద్యోగాలు ‘కట్‌’కట

‘ఫ్రంట్‌డెస్క్‌’.. అమెరికాలో ప్రాప్‌టెక్‌ అంకుర సంస్థ. ఈ సంస్థ సీఈఓ ఈ మధ్య ఉద్యోగులందరితో మాట్లాడాలని ‘గూగుల్‌ మీట్‌’ ఏర్పాటు చేశారు.

Updated : 07 Feb 2024 18:43 IST

కొత్త ప్రాజెక్టుల కొరత
అంకుర సంస్థలకు నిధుల లేమి...
‘కృత్రిమ మేధ’ నుంచి సవాళ్లు
ఈనాడు, హైదరాబాద్‌

‘ఫ్రంట్‌డెస్క్‌’.. అమెరికాలో ప్రాప్‌టెక్‌ అంకుర సంస్థ. ఈ సంస్థ సీఈఓ ఈ మధ్య ఉద్యోగులందరితో మాట్లాడాలని ‘గూగుల్‌ మీట్‌’ ఏర్పాటు చేశారు. ఏ శుభవార్త చెబుతారోనని దాదాపు 200 మంది ఉద్యోగులు  ఆసక్తిగా అందరూ తమ స్క్రీన్ల ముందు కూర్చున్నారు. సమావేశం మొదలు కాగానే మిమ్మల్ని అందరినీ తీసేస్తున్నా... అని ప్రకటించి, రెండు నిమిషాల్లో సమావేశాన్ని ముగించారు! 

కొద్దిరోజుల క్రితం ‘బెటర్‌.కామ్‌’ అనే ఆన్‌లైన్‌ మార్ట్‌గేజ్‌ లెండింగ్‌ సేవల సంస్థ తన రియల్‌ ఎస్టేట్‌ విభాగంలోని ఉద్యోగులందరినీ ఇదేవిధంగా ‘జూమ్‌ కాల్‌’ ద్వారా తొలగించింది. కొత్తగా నియామకాలు చేపట్టకపోవటానికి తోడు, ఐటీ ఉద్యోగులను తొలగిస్తున్న సంస్థల్లో చిన్న, మధ్యస్థాయి కంపెనీలు, అంకుర సంస్థలు మాత్రమే కాదు, ఐటీ దిగ్గజాలైన అమెజాన్‌, యూనిటీ సాఫ్ట్‌వేర్‌, గూగుల్‌... తదితర సంస్థలు ఉండటం గమనార్హం. యూఎస్‌లో ఐటీ రంగంలో కష్టకాలం కొనసాగుతున్నట్లు ఈ పరిణామాలతో స్పష్టమవుతోంది.

ఏడాది కిందటి నుంచే..

ఐటీ ఉద్యోగుల తొలగింపు గత ఏడాది నుంచే మొదలైంది. ఎప్పటికప్పుడు పరిస్థితులు మెరుగుపడతాయని, కొత్త ప్రాజెక్టులతో, పెద్దఎత్తున నియామకాలతో మళ్లీ ఐటీ రంగం కళకళలాడుతుందని ఆశించినా, ఆ కల నిజం కాలేదు. గత ఏడాదిలో యూఎస్‌లో ఐటీ కంపెనీలు దాదాపు 2.40 లక్షల మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ 32,000 ఐటీ ఉద్యోగాలు పోయినట్లు తెలుస్తోంది. నిన్నటికి నిన్న స్నాప్‌ ఇంక్‌., అనే సంస్థ తన ఉద్యోగుల్లో 10 శాతాన్ని (దాదాపు 540 మంది) తగ్గించనున్నట్లు ప్రకటించింది. ఓక్తా ఇంక్‌. అనే మరొక సంస్థ 400 మంది ఉద్యోగులను తీసివేయనున్నట్లు గత నెలలో స్పష్టం చేసింది. మైక్రోసాఫ్ట్‌ తన గేమింగ్‌ డివిజన్‌లో, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో విభాగంలో, వీడియో గేమ్‌ సాఫ్ట్‌వేర్‌ సేవల సంస్థ యూనిటీ సాఫ్ట్‌వేర్‌, మెసేజింగ్‌ అంకురం డిస్‌కార్డ్‌ ... వందల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి.

కారణాలెన్నో..

‘కొవిడ్‌ పరిమాణాల్లో ఐటీ కంపెనీలు పెద్ద ఎత్తున నియామకాలు చేశాయి. ఆ తర్వాత పరిస్థితులు మారడంతో పాటు అనుకోని విధంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. అధిక వడ్డీరేట్లు, ఆర్థిక సమస్యలు వివిధ రంగాలను ఇబ్బంది పెడుతుండడంతో అవి ఐటీ ప్రాజెక్టులకు బడ్జెట్లు తగ్గిస్తున్నాయి. దీంతో ఆశించిన రీతిలో ఐటీ కంపెనీలకు కొత్త ప్రాజెక్టులు రావడం లేదు. మరోపక్క కృత్రిమ మేధ (ఏఐ) ఐటీ కంపెనీలను ఆందోళనకు గురిచేస్తోంది. దీన్ని అందిపుచ్చుకోని పక్షంలో వెనుకబడిపోతామని ఉద్దేశంతో తమ శక్తియుక్తులన్నింటినీ ఏఐ వైపు మళ్లిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏఐ నైపుణ్యం లేని ఉద్యోగులను భారంగా కంపెనీలు భావిస్తున్నట్లు, ఆ ఉద్యోగుల స్థానంలో ఏఐ నైపుణ్యం కల వారిని తీసుకునే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అందువల్ల ఓ పక్క ఉద్యోగుల తొలగింపు అనివార్యం అవుతోంది. మరోపక్క ఏఐ, సంబంధిత విభాగాల్లో ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయని మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

మారితేనే మనుగడ...: ఐటీ సాంకేతిక పరిజ్ఞానంలో వినూత్నమైన మార్పులు వస్తున్నట్లు, అందువల్ల ఇంతకు ముందు మాదిరిగానే సాధారణమైన ఐటీ సేవలు మాత్రమే అందించే ఐటీ కంపెనీలకు మనుగడ కష్టమని హైదరాబాద్‌లోని ఐటీ వర్గాలు వివరిస్తున్నాయి. కృత్రిమ మేధ, మెషీన్‌ లెర్నింగ్‌, క్లౌడ్‌, బ్లాక్‌చైన్‌ వంటి నూతన టెక్నాలజీలపై ప్రాజెక్టులు చేయగల సత్తా సమకూర్చుకోవటంతో పాటు ఐటీ పరిశోధన-అభివృద్ధికి పెద్దపీట వేసే కంపెనీలే దీర్ఘకాలంలో మనగలుగుతాయని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే సూత్రం ఐటీ ఉద్యోగులకూ వర్తిస్తుందని తమ తమ నైపుణ్యాలను పెంచుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి.


మన దేశంలోనూ...

న దేశంలోనూ కాస్త అటూ ఇటుగా ఇదే తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఐటీ నియామకాలు పెద్దగా లేకపోగా, కొన్ని సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. 

  • స్విగ్గీ 400 మంది ఉద్యోగులను(7%) తొలగించింది. ఇందులో కాల్‌ సెంటర్‌, టెక్‌, కార్పొరేట్‌ విభాగాలకు చెందిన ఉద్యోగులున్నట్లు సమాచారం. ఖర్చులు అదుపు తప్పిన కారణంగా వలోరాంట్‌ అనే గేమ్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీ 500 మందికి పైగా ఉద్యోగులను తీసివేసింది. 
  • సేల్స్‌ఫోర్స్‌ తన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో 10 శాతాన్ని తీసివేయనున్నట్లు వెల్లడించింది. ఈ సంస్థకు మన దేశంతో పాటు వివిధ దేశాల్లో 70,000 మంది ఉద్యోగులు ఉన్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని