ఆర్థిక స్వేచ్ఛకు హామీ

ఒక వ్యక్తి జీవితంలో ఆర్థిక స్వేచ్ఛను సాధించడం ఎంతో కీలకం. సొంతిల్లు, పిల్లల ఉన్నత చదువులు, వారి పెళ్లి, రుణాలను తిరిగి చెల్లించడం ఇలా ఎన్నో విషయాల్లో ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి

Published : 04 Nov 2022 00:09 IST

ఒక వ్యక్తి జీవితంలో ఆర్థిక స్వేచ్ఛను సాధించడం ఎంతో కీలకం. సొంతిల్లు, పిల్లల ఉన్నత చదువులు, వారి పెళ్లి, రుణాలను తిరిగి చెల్లించడం ఇలా ఎన్నో విషయాల్లో ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. మహిళల విషయానికి వస్తే ఇప్పటికీ ఆర్థిక స్వాతంత్య్రం సాధించలేదనే గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. భారతీయ శ్రామిక శక్తిలో మహిళల సంఖ్య 2.3 శాతం పెరిగింది. 2020లో 22.8 శాతం ఉండగా, 2021లో 25.1 శాతానికి చేరింది. కానీ, ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో కుటుంబంపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. మహిళలు ఆర్థిక విషయాలపై పూర్తి అవగాహన పెంచుకోవాల్సిన తరుణమిది. ఇదే క్రమంలో సరైన పథకాలను ఎంచుకొని, వాటిలో పెట్టుబడి పెట్టేందుకూ సిద్ధం కావాలి. మహిళలు తమ ఆర్థిక లక్ష్యాలను సాధించేందుకు వీలు కల్పించే పథకాల్లో రాబడి హామీతో ఉన్న బీమా పాలసీలూ కీలకమని చెప్పొచ్చు.

ఒకే పథకం ద్వారా రెండుప్రయోజనాలు పొందాలనుకునే వారికి ఈ గ్యారంటీడ్‌ రిటర్న్స్‌ ప్లాన్‌లు తోడ్పడతాయి. ఇందులో జీవిత బీమా రక్షణతోపాటు, హామీతో కూడిన రాబడీ అందుతుంది. వీటిలో ఉండే మరిన్ని ప్రయోజనాల విషయానికి వస్తే..

రాబడి- రక్షణ

సాధారణంగా మహిళలు అధిక నష్టభయం ఉన్న పథకాలకు దూరంగా ఉంటారు. కొత్తగా మదుపు చేసేవారికి ఇవి సరిపోవు కూడా. రాబడి హామీ బీమా పథకాల్లో నష్టభయం ఉండదు. కాబట్టి, వీటిలో సులభంగా మదుపు చేసేందుకు వీలుంటుంది. నష్టభయం తగ్గించుకోవడం ద్వారా ఆర్థిక స్వేచ్ఛను సాధించడానికి ఇవి ఉపయోగపడతాయి. పెట్టుబడికీ రక్షణ ఉంటుంది కాబట్టి, ఎలాంటి ఇబ్బందీ ఉండదు.

ఆర్థిక స్థిరత్వం..

చాలామంది మహిళలు దీర్ఘకాలిక పెట్టుబడి పథకాలను ఎంచుకోవడానికి ఇష్టపడరు. మధ్యలో ఆదాయం ఆగిపోతే అనే సందేహమే ఇందుకు కారణం. మహిళలు కొంతకాలం పాటు పొదుపు చేసిన డబ్బును, ఒకేసారి సింగిల్‌ ప్రీమియం గ్యారంటీడ్‌ రిటర్న్స్‌ పాలసీలో జమ చేసుకునే వీలుంది. వ్యవధి తీరాక వచ్చే మొత్తం అవసరానికి వినియోగించుకోవచ్చు.

పదవీ విరమణలో..

చాలామంది మహిళలు పదవీ విరమణ ప్రణాళికల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇది సరికాదు. రిటైర్మెంట్‌ తర్వాత కనీసం 30 ఏళ్ల జీవితానికి అవసరమైన నిధులను పోగు చేసుకోవాలి. దీనికోసం స్థిరంగా రాబడిని అందించే పథకాలను ఆదాయం ఆర్జించేటప్పుడే తీసుకోవాలి. పదవీ విరమణ తర్వాత క్రమం తప్పకుండా ఆదాయం వచ్చే ఏర్పాటు చేసుకునేందుకు వీలవుతుంది. అప్పుడు పదవీ విరమణ తర్వాతా ఆర్థికంగా స్వేచ్ఛగా ఉండొచ్చు.
 

- ధీరజ్‌ సెహగల్‌, చీఫ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఆఫీసర్‌,బజాజ్‌ అలియాంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని