Meta : మెటా బ్లూ టిక్‌ కావాలా.. ఇలా చేయండి!

ట్విటర్‌ తరహాలో చెల్లింపు బ్లూ టిక్‌ ఫీచర్‌ను ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మాతృసంస్థ మెటా అందుబాటులోకి తీసుకొచ్చింది. దాన్ని పొందాలంటే ఇలా చేయండి.

Updated : 11 Jun 2023 21:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : ట్విటర్‌ (Twitter) సీఈవోగా ఎలాన్‌ మస్క్ (Elon Musk) బాధ్యతలు చేపట్టిన తర్వాత వెరిఫైడ్‌ ఖాతాలకు ఇచ్చే బ్లూ టిక్‌ (Blue Tick Verification)ను సాధారణ యూజర్లకు సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు. నెలవారీ రుసుము చెల్లించి యూజర్లు తమ ఖాతాకు బ్లూ టిక్‌ వెరిఫికేషన్‌ పొందొచ్చు. తాజాగా ఇదే విధానాన్ని మరో సోషల్‌ మీడియా (Social Media) దిగ్గజం మెటా (Meta) ఈ నెల 7 నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. మెటాకు చెందిన ఫేస్‌బుక్‌ (Facebook), ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) బ్లూ టిక్‌ పొందాలంటే  ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ యూజర్లు నెలకు రూ. 699 చెల్లించాలి. రాబోయే రోజుల్లో నెలకు రూ.599కే వెబ్‌ బేస్డ్‌ సబ్‌స్క్రిప్షన్‌ తెచ్చే ఆలోచనలో మెటా ఉంది. ప్రభుత్వ గుర్తింపు కార్డు ఏదైనా సమర్పించి యూజర్లు బ్లూటిక్‌ పొందవచ్చు. దీంతో ఖాతాకు రక్షణ ఉండటంతోపాటు, కొన్ని రకాల ఫీచర్లు కూడా అందుబాటులోకి వస్తాయని మెటా చెబుతోంది.

ఎలా పొందాలంటే..

  • తొలుత మీ ఫోన్‌లో ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌లను ఓపెన్‌ చేయాలి.
  • ఏ ప్రొఫైల్‌కు బ్లూ టిక్‌ కావాలనుకుంటున్నారో దాన్ని ఎంచుకోవాలి.
  • ఆ తరువాత సెట్టింగ్స్‌లోని ‘అకౌంట్ సెంటర్‌’ను సెలక్ట్‌ చేయాలి.
  • అక్కడ మెటా వెరిఫైడ్‌ ఐచ్ఛికం కన్పిస్తుంది. ఒక వేళ కనిపించని పక్షంలో యాప్‌ను అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది.
  • వైరిఫైడ్‌ ఐచ్ఛికం ఎంచుకొని పేమెంట్‌ చెల్లించాలి.
  • మెటా సూచనలన్నీ చదివిన తరువాత ప్రభుత్వ గుర్తింపు కార్డును వెరిఫికేషన్‌ కోసం ఇవ్వాలి.
  • ఆ వెరిఫికేషన్‌ పూర్తయిన వెంటనే మీకు బ్లూ టిక్‌ వచ్చేస్తుంది. 

ఎవరికి ఇస్తారంటే..

భారత దేశంలో పుట్టి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ బ్లూ టిక్‌ ఇస్తామని మెటా ఒక ప్రకటనలో తెలిపింది. ఇలా ఇచ్చే ముందు ఆ యూజర్‌ మునుపటి పోస్టుల గురించి కూడా తనిఖీ చేస్తామని వెల్లడించింది. అంతేకాకుండా ప్రభుత్వ గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలనే నిబంధన పెట్టింది. వాటిలోని పేరు, ఫొటో... ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ ఖాతాలోని వివరాలతో సరిపోలితేనే బ్లూ టిక్‌ వస్తుంది.

గతంలో ఈ బ్లూ టిక్ వెరిఫికేషన్‌ను వార్తా సంస్థలు, సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్షర్లు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల ఖాతాలకు మాత్రమే ఇచ్చేవారు. ఇందుకోసం వారు సోషల్‌ మీడియా సంస్థలకు కొన్ని వివరాలు సమర్పించేవారు. వాటి ఆధారంగా ఖాతాలకు బ్లూ టిక్‌ వెరిఫికేషన్‌ ఇచ్చేవారు. ప్రస్తుతం ఆ నిబంధనను సడలించారు. నెలవారీ రుసుము చెల్లించి ఎవరైనా బ్లూ టిక్‌ పొందొచ్చు. మెటా బ్లూ టిక్‌ ఫీచర్‌ అమెరికా, బ్రిటన్‌, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వంటి కొన్ని దేశాల్లో మాత్రమే అమల్లో ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని