Retirement Plan: పదవీ విరమణ ప్రణాళిక ఎలా ఉండాలి?

ఎలాంటి ఆర్థికపరమైన ఒత్తిడి లేకుండా, తమ అభిరుచులకు తగినట్లు ప్రశాంతంగా జీవించడం కోసం ఆర్జిస్తున్న సమయంలోనే కచ్చితమైన ప్రణాళికలు వేసుకోవాలి. 

Updated : 22 Sep 2022 17:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పదవీ విరమణ అనేది ఒక సరికొత్త ప్రయాణం. ఎన్నో ఏళ్ల ఉద్యోగ జీవితం తర్వాత విశ్రాంతంగా ఉండే సమయం. ఈ దశకు చేరుకునేసరికి ఎన్నో ఒడుదొడుకులుచ, ఒత్తిళ్లను ఎదుర్కొని, బాధ్యతలను పూర్తిచేసి ఉంటారు. పదవీ విరమణ తర్వాత అయినా ఎలాంటి ఆర్థికపరమైన ఒత్తిడీ లేకుండా తమ అభిరుచులకు తగినట్లు ప్రశాంతంగా జీవించడం అవసరం. దీనికోసం ఆర్జిస్తున్న సమయంలోనే కచ్చితమైన ప్రణాళికలు వేసుకోవాలి.  ఇందులో కూడా రెండు ముఖ్యమైన భాగాలు ఉంటాయి: 1. పెట్టుబడుల ప్రణాళిక. 2. విత్‌డ్రా ప్రణాళిక.

పెట్టుబడుల ప్రణాళిక.. 

త్వరగా ప్రారంభించాలి: రిటైర్మెంట్ కోసం చిన్న వయసు నుంచే పొదుపు, పెట్టుబడులు చేయడం ఎల్లప్పుడూ మంచిదని నిపుణులు చెబుతుంటారు. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి పదవీ విరమణకు చాలా సమయం ఉంటుంది. కాబట్టి చిన్న మొత్తాల్లో పెట్టుబడులు ప్రారంభించినప్పటికీ, కంపౌండింగ్ ప్రభావంతో దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో నిధిని సమకూర్చుకోగలుగుతాం. పైగా చిన్న మొత్తాల్లో డబ్బు కేటాయిస్తాం కాబట్టి ఇతర ఖర్చులు, పెట్టుబడులకు ఇబ్బంది ఉండదు. అలాకాకుండా రిటైర్మెంట్ దగ్గరలో  ఉండగా పెట్టుబడులు ప్రారంభిస్తే ఎక్కువ మొత్తంలో డబ్బు కేటాయించాల్సి వస్తుంది. ఇది ఆర్థికంగా భారమే అవుతుంది. 

ద్రవ్యోల్బణం: పదవీ  విరమణ కోసం పెట్టుబడులు ప్రారంభించేటప్పుడు చాలా మందికి ఎంత నిధి ఏర్పాటు చేసుకోవాలి  అనేదానిపై స్పష్టత ఉండదు. ప్రస్తుత నెలవారీ ఖర్చుల ఆధారంగా అంచనా వేస్తుంటారు. కానీ, ఈ మొత్తం ఆ సమయానికి ఏ మాత్రం సరిపోకపోవచ్చు. జీవన శైలి ప్రమాణాలు మెరుగుపడడం, ద్రవోల్బణం ఇందుకు కారణాలు కావచ్చు. అందువల్ల భవిష్యత్తు అవసరాలకు కావాల్సిన మొత్తాన్ని అంచనా వేసేటప్పుడు ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి  తీసుకోవాలి. ఇందుకోసం గత సంవత్సరాల్లో నమోదయిన రేటును ఉపయోగించవచ్చు. భారత్‌లో ఈ సంవత్సరం ద్రవ్యోల్బణం రేటు దాదాపు 7 శాతం వరకు ఉంది. పెట్టుబడులు పెట్టేటప్పుడు దీన్ని పరిగణనలోకి తీసుకుని.. పదవీ విరమణ సమయం దగ్గరపడేకొద్దీ కావాల్సిన నిధిపై స్పష్టత వస్తుంది కాబట్టి దానికి తగినట్లుగా సవరణలు చేసుకోవచ్చు. 

రాబడి: మీరు ఎంచుకున్న పెట్టుబడి సాధనాలు ద్రవ్యోల్బణంతో సమానంగా లేదా అంతకంటే ఎక్కువ రాబడి ఇచ్చేలా ఉండాలి. లేదంటే పెట్టుబడుల వల్ల ప్రయోజనం ఉండదు. ద్రవ్యోల్బణాన్ని మించి కనీసం 1-2 శాతం రాబడి ఉండేలా చూసుకోవడం మంచిది. 

విత్‌డ్రా ప్రణాళిక .. 

పెట్టుబడుల అంతిమ లక్ష్యం పదవీ విరమణ తర్వాత సాధారణ జీవితం గడిపేలా నిధులను సమకూర్చుకోవడం. అందువల్ల ఏ రేటు వద్ద నిధులను విత్‌డ్రా చేసుకోవాలో నిర్ణయించుకోవం కూడా సవాలే. ముందుగా పదవీ విరమణ సమయానికి ఉన్న జీవన శైలిని అనుసరించి ఖర్చులు, పదవీ విరమణ జీవిత కాలాన్ని అంచనా వేసి విత్‌డ్రా ప్రణాళిక రూపొందించుకోవాలి. 

నేరుగా ఆదాయ అవసరాలకు ఉపసంహరించుకునేవారు 4% నియమాన్ని అనుసరించవచ్చు. పదవీ విరమణ పొందిన వారు ప్రతి సంవత్సరం తమ పదవీ విరమణ నిధుల నుంచి 4% మొత్తాన్ని ఉపసంహరించుకోవడం ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్ సంవత్సరాల్లో తగిన ఖాతా బ్యాలెన్స్‌ను కొనసాగిస్తూ స్థిరమైన ఆదాయ ప్రవాహాన్ని కొనసాగించడం ఈ నియమం ఉద్దేశం. రిటైర్మెంట్ కార్పస్ నుంచి సమర్థంగా నిధులు విత్‌డ్రా చేసుకునేందుకు క్రమానుగత ఉపసంహరణ విధానాన్ని (SWP) కూడా ఎంచుకోవచ్చు. దీని ద్వారా ఆదాయాన్ని పొందడం మాత్రమే కాకుండా.. మిగిలిన ఫండ్ ను పెట్టుబడిగా ఉంచి, వృద్ధిని కొనసాగిస్తూ రాబడిని పొందవచ్చు. 

చివరిగా: రిటైర్మెంట్ తర్వాత కూడా గౌరవప్రదమైన జీవితమే గడపాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇందుకోసం ఉద్యోగం చేరిన కొత్తలోనే పదవీ విరమణను ఒక దీర్ఘకాలిక లక్ష్యంగా తమ ఆర్థిక ప్రణాళికలో చేర్చి, క్రమశిక్షణతో మదుపు చేయాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని