Loan against FD: ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌పై లోన్‌.. ఇవన్నీ తెలుసుకున్నాకే!

Loan against FD: ఎఫ్‌డీలపై రుణం తీసుకునే ముందు గుర్తుంచుకోవాల్సిన కొన్ని ప్రాథమిక అంశాలేంటో చూద్దాం..!

Updated : 17 Jan 2024 12:36 IST

Loan against FD | ఇంటర్నెట్‌ డెస్క్‌: డబ్బు అత్యవసరమైనప్పుడు ఒక్కోసారి ఎక్కడి నుంచి సమకూర్చుకోవాలో అర్థం కాదు. పెట్టిన పెట్టుబడులు వెంటనే చేతికి అందే పరిస్థితి ఉండదు. అలాంటి సమయాల్లో మనం చేసిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లే (Fixed Deposit- FD) మనల్ని ఆదుకుంటాయి. వాటిని మధ్యలో ఉపసంహరించుకొని అప్పటి వరకు జమైన వడ్డీ ఆదాయాన్ని పొగొట్టుకోవాల్సిన అవసరమూ లేదు. బ్యాంకులు ఎఫ్‌డీలపై ఇచ్చే రుణాల ద్వారా మన అవసరాలను తీర్చుకోవచ్చు. ఇటీవలి బ్యాంక్‌బజార్‌ అధ్యయనం ప్రకారం.. దేశంలో ఎఫ్‌డీలపై ఇచ్చే లోన్‌ (Loan against FD) మొత్తం పెరిగింది. 2022లో రూ.97.5 కోట్ల విలువ చేసే ఎఫ్‌డీ రుణాలు మంజూరు కాగా.. 2023లో ఆ మొత్తం రూ.113.9 కోట్లకు పెరిగింది.

ఎఫ్‌డీలపై రుణం తీసుకునే ముందు గుర్తుంచుకోవాల్సిన కొన్ని ప్రాథమిక అంశాలేంటో చూద్దాం..

వడ్డీరేటు..

ఎఫ్‌డీ వడ్డీరేటుతో పోలిస్తే దానిపై ఇచ్చే రుణరేటు 0.75 శాతం నుంచి రెండు శాతం వరకు అధికంగా ఉంటుంది. ఇక్కడ ఎఫ్‌డీ తనఖాగా పనిచేస్తున్న నేపథ్యంలో అధిక రుణరేటు వల్ల బ్యాంకులకు ఎగవేత ముప్పు తగ్గుతుంది. పర్సనల్‌ లోన్‌ వంటి ఇతర అన్‌సెక్యూర్డ్‌ రుణాలతో పోలిస్తే మాత్రం తక్కువగానే ఉంటుంది.

ఎంత మొత్తం ఇస్తారు?

ఈ రకమైన లోన్ (Loan against FD) కింద సాధారణంగా లభించే లోన్ మొత్తం డిపాజిట్ మొత్తంలో 85 శాతం నుంచి ప్రారంభమవుతుంది. అయితే, కొన్ని సంస్థలు నిర్దిష్ట మొత్తాన్ని ఎఫ్‌డీ చేస్తేనే రుణాన్ని మంజూరు చేస్తామనే నిబంధన విధించే అవకాశం ఉంది.

ప్రాసెసింగ్‌, డాక్యుమెంటేషన్‌..

ఎఫ్‌డీ తరహాలోనే.. దానిపై ఇచ్చే రుణ మంజూరు ప్రక్రియ సైతం వేగంగానే పూర్తవుతుంది. ఎందుకంటే ఎఫ్‌డీయే తనఖాగా ఉన్న నేపథ్యంలో విస్తృత తనిఖీలు లేకుండానే రుణాన్ని ఇచ్చే వెసులుబాటు ఉంటుంది. పెద్దగా పత్రాలు, పూచీకత్తూ అవసరం ఉండదు. రుణం తీసుకున్న తర్వాత కూడా ఎఫ్‌డీపై వడ్డీ వస్తూనే ఉంటుంది.

చెల్లింపుల ప్రక్రియ ఇలా..

రుణగ్రహీతలకు ఈఎంఐ సదుపాయం ఉంటుంది. అయితే, ఎఫ్‌డీ కాలపరిమితి ముగిసే నాటికే రుణం మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇతర రుణాల తరహాలో ముందస్తు చెల్లింపులపై చాలా వరకు బ్యాంకులు ఎలాంటి ప్రత్యేక రుసుములు వసూలు చేయడం లేదు.

ఎఫ్‌డీ ఖాతా ఉన్న భారత పౌరులు, ట్రస్టులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (HUFs), సొసైటీలు, సమాఖ్యలు, భాగస్వామ్య సంస్థలు ఈ తరహా రుణం తీసుకోవడానికి అర్హులు. ఇతర రుణాల్లోలాగే ఎలాంటి ఎగవేతలు లేకుండా సకాలంలో చెల్లిస్తే ఎఫ్‌డీపై లోన్‌ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అవసరం మేరకే తీసుకొని గడువులోగా తీర్చేస్తే సరిపోతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని