March 31 Deadline: ఈరోజే లాస్ట్ డేట్.. ఈ 7 పనులు పూర్తి చేశారా?

March 31 Deadline: ఈరోజుతో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. కొన్ని కీలక పనులకు గడువు తీరనుంది. మరి అవి పూర్తి చేశారో లేదో ఒకసారి చూసుకోండి.

Updated : 31 Mar 2023 11:51 IST

March 31 Deadline | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈరోజు మార్చి 31. తేదీ గుర్తుచేస్తున్నారేంటి అనుకుంటున్నారా? ఈరోజుతో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. రేపటి నుంచి కొత్త లెక్కలు.. కొత్త పద్దులు.. కొత్త ప్రణాళికలు. ఇది అటుంచితే.. ఈరోజుతో కొన్ని కీలక పనులకు గడువు ముగియనుంది. మరి అవి పూర్తి చేశారో లేదో ఒకసారి చూసుకోండి. ఇంతకీ ఆ పనులేంటో చూద్దాం..

పీఎం వయ వందన యోజన..

వృద్ధాప్యంలో సామాజిక, ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి వయ వందన యోజన’ (PMVVY) అనే పింఛను పథకాన్ని ప్రారంభించింది. 60 ఏళ్ల తర్వాత ఆదాయం కోల్పోయే వారికి అండగా ఉండటమే లక్ష్యంగా దీన్ని తీసుకొచ్చారు. ఎల్‌ఐసీ ద్వారా ఈ పథకాన్ని అందిస్తున్నారు. దీంట్లో చేరడానికి 2023 మార్చి 31ని (March 31 Deadline) తుది గడువుగా నిర్ణయించారు. గరిష్ఠంగా రూ.15 లక్షల వరకు చెల్లించి పాలసీని కొనుగోలు చేసే అవకాశం ఉంది. తర్వాతి నెల నుంచే పింఛను అందడం మొదలవుతుంది. నెల, మూడు నెలలకోసారి, ఆరు నెలలకోసారి, ఏడాదికోసారి పెన్షన్‌ పొందొచ్చు. ప్రస్తుతం ఈ పథకానికి 7.4 శాతం వడ్డీ లభిస్తోంది. 10 ఏళ్ల పాటూ ఇదే వడ్డీ అమల్లో ఉంటుంది.

ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు..

మదుపర్లను ఆకర్షించేందుకు బ్యాంకులు పలు ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాలను ప్రవేశ పెట్టాయి. ఈ ప్రత్యేక పథకాల గడువు నేటితో (March 31 Deadline) ముగియనుంది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ‘అమృత్‌ కలశ్‌ ప్లాన్‌’ పేరుతో 400 రోజుల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (ఎఫ్‌డీ)ను తీసుకొచ్చింది. ఈ పథకంలో సాధారణ డిపాజిటర్లకు 7.10 శాతం వడ్డీని చెల్లిస్తుంది. సీనియర్‌ సిటిజన్లకు 7.60 శాతం చొప్పున వడ్డీనందిస్తోంది. ‘ఎస్‌బీఐ వుయ్‌ కేర్‌’లో డిపాజిట్‌ చేసిన సీనియర్‌ సిటిజన్లకు అదనంగా 30 బేసిస్‌ పాయింట్ల మేరకు వడ్డీని చెల్లిస్తోంది. అయిదేళ్లు, అంతకు మించి వ్యవధికి ఇది వర్తిస్తుంది. ప్రస్తుతం ఈ పథకంలో 7.50శాతం వడ్డీ లభిస్తోంది. దీంతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ‘సీనియర్‌ సిటిజన్‌ కేర్‌ ఎఫ్‌డీ’; ఐడీబీఐ బ్యాంక్‌ ‘నమాన్‌ సీనియర్‌ సిటిజన్‌ డిపాజిట్‌’; ఇండియన్‌ బ్యాంక్‌ ‘ఇండ్‌ శక్తి 555 డేస్‌’; పంజాబ్‌ అండ్‌ సింద్‌ బ్యాంక్‌ పీఎస్‌బీ ఫ్యాబ్యులస్‌ 300 డేస్‌’, ‘పీఎస్‌బీ ఫ్యాబ్యులస్‌ 601 డేస్‌’ వంటి పేర్లతో కొన్ని పథకాలు తీసుకొచ్చాయి.
(Also Read: ఈ పథకాల పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..)

పన్ను ఆదా పెట్టుబడులు..

2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ పాత ఆదాయపు పన్ను విధానం ఎంచుకునే వారు మార్చి 31లోపు (March 31 Deadline) పన్ను ఆదా పథకాల్లో మదుపు చేయాల్సి ఉంటుంది. అప్పుడే వివిధ సెక్షన్ల కింద పన్ను మినహాయింపులు పొందే అవకాశం ఉంటుంది. జీవిత బీమా పాలసీలు, పీపీఎఫ్‌, ఈఎల్‌ఎస్‌ఎస్‌, ఎన్‌పీఎస్‌ వంటి పథకాలను పరిశీలించొచ్చు. కొత్త పన్ను విధానం ఎంచుకునే వారికి ఎలాంటి మినహాయింపులూ వర్తించవు.
(Also Read: ఆదాయపు పన్ను భారం కాకుండా...)

2019-20 అప్‌డేటెడ్‌ ఐటీఆర్‌..

2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎవరైనా ఇంకా తమ ఆదాయ పన్ను రిటర్నులను అప్‌డేట్‌ చేయాలనుకుంటే.. దానికి ఈరోజే (March 31 Deadline) తుది గడువు. సమీక్షా సంవత్సరం ముగిసిన తర్వాత రెండేళ్లలోపు అప్‌డేటెడ్‌ ఐటీఆర్‌ సమర్పించేందుకు అవకాశం ఉంటుంది.

డెట్‌ ఫండ్ల ప్రయోజనం కోసం..

డెట్‌ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేసే వారికి 2023 ఏప్రిల్‌ 1 నుంచి దీర్ఘకాలిక పన్ను ప్రయోజనాలు దూరం కానున్నాయి. ఈ ఫండ్లు తమ నిర్వహణలో ఉన్న ఆస్తుల్లో (ఏయూఎం) 35 శాతం కన్నా తక్కువగా ఈక్విటీల్లో మదుపు చేస్తే.. వచ్చిన లాభాలకు వర్తించే శ్లాబును బట్టి, పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎవరైనా దీర్ఘకాల పన్ను ప్రయోజనాలను పొందాలనుకుంటే.. డెట్‌ ఫండ్లలో మదుపు చేయడానికి ఈ ఒక్కరోజే ఛాన్స్‌.

అధిక ప్రీమియం బీమా పాలసీలు..

అధిక మొత్తం ప్రీమియంతో ఎవరైనా బీమా పథకాలు కొనుగోలు చేయాలనుకుంటే.. ఈరోజు వరకే మంచి అవకాశం. రేపటి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. వార్షిక ప్రీమియంల మొత్తం రూ.5 లక్షలు మించి ఉన్న జీవిత బీమా పాలసీల మెచ్యూరిటీ మొత్తంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

ఫారం 12బీ సమర్పించారా..

ఒకవేళ ఉద్యోగులు ఎవరైనా ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మారి ఉంటే.. కొత్త సంస్థలో ఫారం 12బీని సమర్పించాల్సి ఉంటుంది. ఆర్థిక సంవత్సరం ముగియడానికి ముందే దీన్ని పూర్తి చేస్తే మేలు. అప్పుడు మీ పన్ను వివరాలను మదించడం కంపెనీకి సులువవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని