Post Office: పోస్టాఫీసు పథకాల్లో ఖాతా ముందస్తు మూసివేత నియమాలు ఇవే

పోస్టాఫీసు, వేర్వేరు కాలవ్యవధులకు అనేక చిన్న మొత్తాల పొదుపు పథకాలను అందిస్తోంది. అయితే, వీటిని కాలవ్యవధి కన్నా ముందే కొన్ని ప్రత్యేక కారణాలతో ఖాతాను ఉపసంహరించి మూసివేయొచ్చు. ఉపసంహరణ నియమాలు, వర్తించే వడ్డీ రేట్లు ఇక్కడ ఉన్నాయి.

Published : 26 Apr 2023 18:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారతీయ పోస్టాఫీసు అనేక చిన్న పొదుపు పథకాలను అందిస్తోంది. ఈ పథకాలు దేశంలోని అన్ని రకాల వ్యక్తులకు సంబంధించినవి. వ్యక్తుల విభిన్న అవసరాలు, వారి పెట్టుబడి లక్ష్యాలను తీర్చడానికి 10 ముఖ్యమైన పొదుపు పథకాలను ఇండియా పోస్ట్‌ అందిస్తోంది. అయితే, ఇండియా పోస్ట్‌ వెబ్‌సైట్‌ ప్రకారం ప్రతి పథకానికి సంబంధించి వాటి వడ్డీ రేట్లు, కాలవ్యవధి, అకాల ఉపసంహరణ నియమాలు ఒకొక్క పథకానికి ఒక్కోలా విధంగా ఉంటాయి.

పోస్టాఫీసు సేవింగ్స్‌ ఖాతా (POSA)

ఈ ఖాతాను ఎప్పుడైనా మూసి వేయొచ్చు. మిగులు మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. పోస్టాఫీసు ఈ ఖాతాపై సంవత్సరానికి 4% వడ్డీ చెల్లిస్తుంది.

రికరింగ్‌ డిపాజిట్‌ ఖాతా (RD)

సంబంధిత పోస్టాఫీసుకు తగిన దరఖాస్తు ఫారంను సమర్పించడం ద్వారా ఖాతా తెరిచిన తేదీ నుంచి 3 సంవత్సరాల తర్వాత రికరింగ్‌ డిపాజిట్‌ ఖాతా (RD) ఖాతాను గడువుకు ముందే మూసివేయవచ్చు. అయితే, గడువుకు ముందే ఉపసంహరించుకున్న ఖాతాపై సేవింగ్స్‌ ఖాతా వడ్డీ మాత్రమే వర్తిస్తుంది.

నేషనల్‌ సేవింగ్స్‌ టైమ్‌ డిపాజిట్‌ ఖాతా (TD)

డిపాజిట్‌ చేసిన తేదీ నుంచి 6 నెలల ముందు ఖాతా మూసివేయలేరు. TD ఖాతా తెరిచిన 6 నెలల తర్వాత గానీ, ఒక సంవత్సరం ముందు గానీ రద్దు చేస్తే.. పోస్టల్‌ సేవింగ్స్‌ ఖాతా వడ్డీ రేటు వర్తిస్తుంది. ఒక సంవత్సరం తర్వాత.. 2/3/5 సంవత్సరాల TD ఖాతాను ముందుగానే రద్దు చేసినట్లయితే, పూర్తయిన సంవత్సరాలకు TD వడ్డీ రేటు (అంటే 1/2/3 సంవత్సరాలు) కంటే 2% వడ్డీ తక్కువగా లెక్కించి ఇస్తారు.

నెలవారీ ఆదాయ ఖాతా (MIS)

డిపాజిట్‌ చేసిన తేదీ నుంచి ఒక సంవత్సరం లోపు డిపాజిట్‌ను ఉపసంహరించలేరు. ఒక సంవత్సరం తర్వాత ఖాతా మూసివేస్తే, లభించే వడ్డీ నుంచి 2% మినహాయిస్తారు. ఖాతాను 3 సంవత్సరాల తర్వాత గానీ, 5 సంవత్సరాల ముందు గానీ మూసివేస్తే లభించే వడ్డీ నుంచి 1% మినహాయిస్తారు.

సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ ఖాతా (SCSS)

ఖాతాను తెరిచిన తేదీ తర్వాత ఎప్పుడైనా (ముందుగానే) మూసివేయొచ్చు. ఒక సంవత్సరానికి ముందే ఖాతా మూసివేస్తే వడ్డీ చెల్లించరు. ఒకవేళ అప్పటికే వడ్డీ చెల్లించినట్లయితే, అసలు మొత్తం నుంచి మినహాయించుకుంటారు. ఖాతాను ఒక సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల లోపు మూసివేస్తే.. ప్రధాన మొత్తం నుంచి 1.50%ను మినహాయించుకుంటారు. ఖాతా ప్రారంభించిన తేదీ నుంచి 2 సంవత్సరాల తర్వాత, 5 సంవత్సరాల లోపు మూసివేస్తే.. ప్రధాన మొత్తం నుంచి 1%ను మినహాయించుకుంటారు.

పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (PPF)

5వ సంవత్సరం పూర్తయిన త‌ర్వాత.. ఖాతాదారే కాకుండా జీవిత భాగ‌స్వామి, పిల్లలు, త‌ల్లిదండ్రులకు ఏదైనా ప్రాణాంత‌క వ్యాధి ఉన్నట్టు నిర్ధార‌ణ అయినా (లేక‌) ఖాతాదారు ఉన్నత విద్య ఖ‌ర్చుల‌కు ఫారం-సితో పాటు, అత్యవసర సంఘ‌ట‌న రుజువు ప‌త్రాలు స‌మ‌ర్పించి మెచ్యూరిటీకి ముందే పీపీఎఫ్‌లో ఉన్న న‌గ‌దు మొత్తం ఉప‌సంహ‌రించుకుని ఖాతా మూసేయొచ్చు. అకాల ఉపసంహరణ సమయంలో ఖాతా తెరిచిన సమయం నుంచి 1% వడ్డీని మినహాయించుకుంటారు.

సుకన్య సమృద్ధి ఖాతా (SSA)

ఈ కింది షరతులతో ఖాతాను ముందుగానే మూసివేయొచ్చు..
మరణం: ఖాతాదారైన అమ్మాయి దురదృష్టవశాత్తు చనిపోతే, ఖాతాకు సంబంధించిన హక్కు ఖాతా ప్రారంభించిన వ్యక్తికి లభిస్తుంది. మరణ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించిన తర్వాత డిపాజిట్‌ నిల్వ మొత్తాన్ని వడ్డీతో సహా ఉపసంహరించుకోవచ్చు. అయితే, సేవింగ్స్‌ ఖాతా వడ్డీ మాత్రమే లభిస్తుంది.
సంరక్షుకుల మరణం: ఖాతాను ప్రారంభించిన తల్లిదండ్రులు, సంరక్షకుడు మరణించిన సందర్భంలో ఖాతాదారైన అమ్మాయికి ఆర్థిక సమస్యలు, ఇతర సమస్యలు ఏర్పడినప్పుడు ఖాతా ప్రారంభించిన 5 సంవత్సరాల తర్వాత ఖాతాను మూసేయొచ్చు.

నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్స్‌(NSC)

ఈ కారణాలతో 5 సంవత్సరాలు ముందుగా ఖాతాను మూసివేయొచ్చు. ఖాతా గల వ్యక్తి/ ఉమ్మడి ఖాతాదారుడు మరణిస్తే ఖాతాను అకాలంగా మూసివేయొచ్చు. కోర్టు ఆదేశానుసారం ఖాతాను ఎప్పుడైనా మూసివేయొచ్చు.

కిసాన్‌ వికాస్‌ పత్ర (KVP)

ఈ కారణాలతో మెచ్యూరిటీకి ముందు ఎప్పుడైనా కేవీపీ ఖాతాను మూసివేయొచ్చు. ఖాతా గల వ్యక్తి/ఉమ్మడి ఖాతాదారుడు మరణిస్తే ఖాతాను అకాలంగా మూసివేయొచ్చు. కోర్టు ఆదేశానుసారం ఖాతాను ఎప్పుడైనా మూసివేయొచ్చు. డిపాజిట్‌ తేదీ నుంచి 2 సంవత్సరాల 6 నెలల తర్వాత ఎప్పుడైనా ఖాతాను మూసివేయొచ్చు.

మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌

ఈ కారణాలతో మెచ్యూరిటీకి ముందు ఎప్పుడైనా కేవీపీ ఖాతాను మూసివేయొచ్చు. ఖాతాదారు మరణించినా, ఖాతాదారునికి ఏదైనా ప్రాణాంతక వ్యాధి కలిగినా ఖాతాను మూసివేయొచ్చు. సంరక్షకుడు మరణించినా, సంబంధిత పత్రాలను సమర్పించి ఖాతాను మూసివేయొచ్చు. పథకంలో పేర్కొన్న వడ్డీ, అసలు కలిపి చెల్లిస్తారు. ఏ కారణం చెప్పకుండా కూడా ఖాతా తెరిచిన 6 నెలల తర్వాత మూసివేయడానికి అనుమతి ఉంటుంది. అయితే, వడ్డీని 2% వరకు మినహాయిస్తారు. అంటే, 5.50% వడ్డీ చెల్లిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని