Q-A: షేర్ మార్కెట్‌లో నష్టాలు ఉన్నా ఐటీఆర్ ఫైల్ చేయాలా?

సంప్రదాయ పాలసీల్లో బీమా హామీ, రాబడి రెండు తక్కువగానే ఉంటాయి. కాబట్టి ఇటువంటి పాలసీలను ఎంచుకోకపోవడమే మంచిది. 

Published : 28 Dec 2022 13:57 IST


సర్, నా పేరు లక్ష్మి. నేను షేర్ మార్కెట్‌లో రూ.2.50 లక్షలు మదుపు చేసి ఉన్నాను. మార్చ్31 లోపు పెట్టుబడి నష్టాల్లో ఉన్నట్లయితే, దీనికి కచ్చితంగా ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయాలా?

- లక్ష్మి

ఆదాయ పన్ను పరంగా షేర్స్ అమ్మినప్పుడు మాత్రమే దాన్ని నష్టంగా భావిస్తారు. అమ్మిన ఏడాది వచ్చిన నష్టాలను ఐటీఆర్ ఫైలింగ్ ద్వారా తెలుపవచ్చు. ఇలా తెలుపడం వల్ల మీరు వీటిని 'క్యారీ ఫార్వర్డ్' చేసుకోవచ్చు. రాబోయే 8 ఏళ్ళల్లో మీకు మూలధన లాభాలు చేకూరితే ఈ నష్టాల ద్వారా మీరు 'సెట్ ఆఫ్'(లాభాలను నష్టాలతో సరిచేయడం) చేసుకునే వీలుంటుంది. కాబట్టి, మీరు ఆర్థిక సంవత్సరం ముగిశాక ఈ వివరాలతో ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయడం మంచిది.


నేను, మా అబ్బాయి పేరు మీద ఎల్ఐసి జీవన్ ఉమంగ్ పాలసీ తీసుకున్నాను, 20 ఏళ్ళ కాలపరిమితి, రూ. 20 లక్షల బీమా హామీ, రూ.90 వేల వార్షిక ప్రీమియం. దీంతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ టాప్ 50 ఫండ్‌లో 2 ఏళ్లుగా నెలకి రూ.3500 మదుపు చేస్తున్నాను. మరో రూ.5000 మదుపు చేయడానికి సలహా ఇవ్వండి. 

- కృష్ణ

మీరు పేర్కొన్న జీవన్ ఉమంగ్ పాలసీ ఒక ఎండోమెంట్ పధకం. ఇందులో బీమా హామీ, పెట్టుబడి కలిపి ఉంటాయి. అయితే, బీమా హామీ తక్కువ, రాబడి కూడా తక్కువ. ఇలాంటి పధకాల నుంచి దూరంగా ఉండడం మంచిది. వీలయితే ఎల్ఐసిని సంప్రదించి పాలసీ సరెండర్ చేయండి. జీవిత బీమా అనేది కుటుంబ పెద్ద(అధికంగా సంపాదించే వ్యక్తి) పేరు మీద తీసుకోవడం మంచిది, వారికి ఏదైనా జరిగితే కుటుంబానికి ఆదాయాన్ని భర్తీ చేస్తుంది. జీవిత బీమా కావాలంటే ఆన్‌లైన్‌లో టర్మ్ ప్లాన్ పరిశీలించండి.

మీరు తెలిపిన హెచ్‌డీఎఫ్‌సీ ఫండ్ నిఫ్టీ 50 ఇండెక్స్‌లో మదుపు చేస్తుంది. ఇందులో మీరు సిప్ కొనసాగించవచ్చు, అదనపు సిప్ మొత్తానికి కూడా ఇందులో మదుపు చేయవచ్చు. అయితే, నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/పేటీఎం మొబైల్ యాప్ లాంటివి) ద్వారా  డైరెక్టు ప్లాన్‌లో మదుపు చేయడం మంచిది. ఇందులో మీరు కమీషన్ చెల్లించనవసరం లేదు, కాబట్టి వీటిలో రాబడి రెగ్యులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.   


నేను ఒక ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాను. ఒక పర్సనల్ లోన్ @11.75%, క్రెడిట్ కార్డు ఉన్నాయి. పీఎఫ్ రూ.4 లక్షల వరకు ఉంటుంది. పీఎఫ్ తీసుకుని రుణం తీర్చవచ్చా?

- రవీంద్రనాథ్

పీఎఫ్ పధకం పదవీ విరమణ నిధిగా ఉపయోగపడుతుంది. ప్రత్యేక పరిస్థితుల కోసం ఇందులో కొంత మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. అయితే, వ్యక్తిగత రుణం తీర్చడం కోసం తీసుకోవడం సరైన పధ్ధతి కాదు. వీలయితే మీరు రుణం ఈఎంఐ కడుతూ ఉండండి. మీ జీతంలో కొంత మొత్తాన్ని పొదుపు చేయండి, ఏడాదిలో పొదుపు చేసినంత మొత్తాన్ని రుణం తీర్చడానికి వాడండి. రుణ కాల పరిమితి తగ్గుతుంది, మిగతా ఈఎంఐలు చెల్లించవచ్చు. అయితే, వ్యక్తిగత రుణాల ముందస్తు చెల్లింపులపై కొంత ఛార్జీలు ఉంటాయని గమనించండి. చెల్లించే వడ్డీ ఎక్కువగా ఉన్నప్పుడు కొంత ఛార్జీలు ఉన్నప్పటికి ముందస్తు చెల్లింపులు చేయడం మేలు. ఈ రెండు పోల్చి చూసాకే నిర్ణయం తీసుకోవడం మేలు. వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డు రుణాల లాంటి అధిక వడ్డీ రేటు గల రుణాల నుంచి దూరంగా ఉండండి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని