Health Insurance: ఆరోగ్య బీమాపై పన్ను మినహాయింపు ప్రయోజనాలు

ఆరోగ్య బీమాపై పన్ను మినహాయింపు ప్రయోజనాలు ఎటువంటి సందర్భంలో ఎంత లభిస్తాయి అన్నది ఇక్కడ తెలుసుకోవచ్చు.

Updated : 24 Nov 2022 14:27 IST

నేడు ప్రైవేట్‌ రంగం సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆరోగ్య రంగానికి పెద్దపీట వేస్తున్నాయి. కొవిడ్‌ మహమ్మారి విజృభించడంతో ఆరోగ్య ప్రాముఖ్యత, బీమా అవసరం ప్రజలందరికి బాగా తెలిసింది. ప్రభుత్వాలు కూడా సామాజిక బాధ్యతగా ఆరోగ్య బీమా గురించి పట్టించుకోవడంతో దీనిపై అవగాహన బాగా పెరిగింది. అయితే ఈ ఆరోగ్య బీమా ప్రీమియంలపై పన్ను ప్రయోజనాలు కూడా ఉంటాయి. దేనికి పన్ను మినహాయింపు ఉంటుంది? దేనికుండదో ఇప్పుడు తెలుసుకుందాం..

ఓపీడీపై పన్ను మినహాయింపు పొందలేరు. అయితే నగదు రహిత ఓపీడీ చికిత్స కవర్‌, రైడర్‌లతో కూడిన బీమా పాలసీ ఉన్నప్పుడు క్లిష్టమైన చికిత్స పొందితే వారి వయసుని బట్టి కొన్ని పరిమితులతో పన్ను ప్రయోజనాలను పొందుతారు. కుటుంబ సభ్యులు (జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులు, సోదరులు, సోదరీమణులు) ఎవరైనా అంగవైకల్యం గలవారైతే వారి వైద్య ఖర్చులను భరించే వ్యక్తి సెక్షన్‌ 80డిడి కింద మినహాయింపును క్లెయిమ్‌ చేయవచ్చు. పన్ను చెల్లింపుదారు రూ. 75,000 వరకు మినహాయింపు కోరవచ్చు. పాలసీదారుడు లేక కుటుంబసభ్యులు 80% లేదా అంతకంటే ఎక్కువ అంగవైకల్యంతో బాధపడుతుంటే రూ. 1,25,000 పన్ను మినహాయింపు లభిస్తుంది.

ప్రివెంటివ్‌ హెల్త్‌ చెకప్‌ సహా కుటుంబలో అందరూ 60 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారైతే.. పాలసీదారుడు, జీవిత భాగస్వామి, పిల్లలకు చెల్లించే ప్రీమియంలపై రూ. 25,000 వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. 60 ఏళ్లు పైబడిన వారు రూ. 50,000 వరకు పన్ను మినహాయింపును పొందొచ్చు. తల్లిదండ్రుల పేరిట పిల్లలు ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లిస్తున్నా, ఈ క్లెయిమ్‌కు అర్హత ఉంటుంది.

ఆరోగ్య బీమా బీమా ప్రీమియంపై ఏ వయసు వారికి పన్ను మినహాయింపు ఎంత ఉంటుందో ఈ కింది పట్టికలో ఉంది..

అయితే పన్ను ప్రయోజనాలకు కొన్ని షరతులు కూడా ఉంటాయి. బీమా ప్రీమియంపై పన్ను మినహాయింపును క్లెయిమ్‌ చేసుకోవాలని అనుకునేవారు ప్రీమియంను చెక్కు లేదా ఆన్‌లైన్‌ (నెఫ్ట్‌, యూపీఐ) ద్వారా చెల్లించాలి. ప్రత్యక్షంగా నగదు రూపంలో చెల్లిస్తే పన్ను ప్రయోజనం ఉండదు. కానీ, ముందస్తు వ్యాధి నిర్ధారణ పరీక్షలకు నగదు రూపంలో చెల్లించినా క్లెయిమ్‌కు అర్హత ఉంటుంది. ఎక్కువ సంవత్సరాలకు ప్రీమియం ఒకేసారి చెల్లిస్తే.. ఎన్ని సంవత్సరాలకు ప్రీమియంను చెల్లిస్తే అన్ని భాగాలుగా విభజించి ఒక్కో భాగం చొప్పున ఒక్కొ సంవత్సరానికి క్లెయిమ్‌ చేయొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు