Tesla: పెద్ద ఎత్తున కార్లను రీకాల్‌ చేసిన టెస్లా.. సమస్య ఇదే

విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా.. చైనాలోని బీజింగ్, షాంఘైలో విక్రయించిన 16 లక్షల కార్లను రీకాల్ చేసింది. 

Updated : 05 Jan 2024 17:00 IST

బీజింగ్‌: అమెరికాకు చెందిన ప్రముఖ విద్యుత్తు కార్ల (EV) తయారీ సంస్థ టెస్లా (Tesla).. చైనా (China)లో పెద్ద ఎత్తున కార్లను రీకాల్ చేసింది. స్టీరింగ్‌ ఆటోమేటిక్‌ అసిస్టెంట్‌, డోర్‌ లాకింగ్ వ్యవస్థ పనితీరులో లోపాలు తలెత్తిన కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై చైనాలోని మార్కెట్‌ నియంత్రణ సంస్థ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. బీజింగ్‌, షాంఘైలో విక్రయించిన 16 లక్షల టెస్లా కార్లలో తలెత్తిన లోపాలను రిమోట్‌ అప్‌గ్రేడ్‌ సాయంతో ఆ సంస్థే సరి చేస్తుందని తెలిపింది. కార్ల యజమానులు సర్వీస్‌ సెంటర్లకు వెళ్లాల్సిన అవసరం లేదని వెల్లడించింది. 

ఈ సమస్యను మొత్తం నాలుగు రకాల కార్లలో గుర్తించారు. ఆగస్టు 26, 2014 నుంచి డిసెంబరు 20, 2023 వరకు విక్రయించిన మోడల్‌ ఎస్‌, మోడల్‌ ఎక్స్‌, మోడల్‌ 3, మోడల్‌ వై కార్లను రీకాల్‌ చేసినట్లు మార్కెట్‌ నియంత్రణ సంస్థ తెలిపింది. మోడల్‌ ఎస్‌, మోడల్‌ ఎక్స్‌లో 7,538 కార్లలో డోర్‌ లాక్‌ లాజిక్‌ కంట్రోల్‌ వ్యవస్థలో లోపాలున్నాయని, కారు ప్రమాదానికి గురైనప్పుడు డోర్ తెరుచుకోవడంలో సమస్య తలెత్తున్నట్లు గుర్తించారు. మిగిలిన వాటిలో స్టీరింగ్‌ ఆటోమేటిక్‌ అసిస్టెంట్‌ వ్యవస్థలో తలెత్తే సమస్య కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. గత రెండు నెలల వ్యవధిలో అమెరికాలో రెండు లక్షల కార్లను టెస్లా రీకాల్ చేసి డ్రైవర్‌ మానిటరింగ్ వ్యవస్థలోని లోపాలను సరిచేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని