Credit Card portability: వీసా, మాస్టర్‌, రూపే.. ఏ కార్డు కావాలో ఇక మీ ఇష్టం!

Credit Card portability: నచ్చిన కార్డ్ నెట్‌వర్క్‌కు మారే వెసులుబాటును రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అందించనుంది. అక్టోబర్‌ 1 నుంచి కస్టమర్లకు ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది.

Updated : 06 Jul 2023 14:30 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మనకు ఒక మొబైల్‌ నెట్‌వర్క్‌ నచ్చకపోతే మొబైల్‌ నంబర్‌ పోర్టబిలిటీ సదుపాయం ద్వారా వేరే నెట్‌వర్క్‌కు మారుతున్నాం. ఇకపై డెబిట్‌/క్రెడిట్‌/ ప్రీపెయిడ్‌ కార్డుల విషయంలోనూ ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. వినియోగదారుడు తనకు నచ్చిన పేమెంట్‌ నెట్‌వర్క్‌ను ఎంచుకోవచ్చు. మాస్టర్‌ నుంచి రూపేకు, వీసా నుంచి మాస్టర్‌కు.. ఇలా మీకు నచ్చిన కార్డు నెట్‌వర్క్‌కు మారేందుకు ఆర్‌బీఐ వెసులుబాటు కల్పిస్తోంది. క్రెడిట్‌/డెబిట్‌/ప్రీపెయిడ్‌ కార్డ్‌ కస్టమర్లకు ఈ సౌకర్యం అక్టోబర్‌ 1 నుంచి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) సన్నాహాలు చేస్తోంది.
Also Read: PAN- Aadhaar: డెడ్‌లైన్‌ మిస్ అయ్యారా? ఇలా చేస్తే పాన్‌ యాక్టివేట్‌

ప్రస్తుతం మన దేశంలో వీసా (Visa), మాస్టర్‌ కార్డ్‌ (MasterCard), రూపే (RuPay), అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ (American Express), డైనర్స్‌ క్లబ్‌ (Diners Club) సంస్థ కార్డు నెట్‌వర్క్‌ సేవలు అందిస్తున్నాయి. ఈ సంస్థలు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలతో కలిసి ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. దీని ప్రకారం.. వినియోగదారుడికి ఏ కార్డు జారీ చేయాలన్నది సదరు కార్డు జారీ సంస్థదే నిర్ణయం. ఇకపై ఈ విషయంలో వినియోగదారుడిదే అంతిమ నిర్ణయం కానుంది. అంటే.. వీసా కార్డ్‌ ఉన్న వారు మాస్టర్‌ కార్డ్‌, రూపే లేదా మరేదైనా నెట్‌వర్క్‌కు మారాలనుకుంటే ఇకపై మారొచ్చు. దీనికి సంబంధించి ఆర్‌బీఐ తన తాజా ముసాయిదా సర్క్యులర్‌ జారీ చేసింది. దీనిపై ప్రస్తుతం అభిప్రాయాలు కోరుతోంది. అక్టోబర్‌ 1 నుంచి ఈ సదుపాయాన్ని తీసుకొచ్చేందుకు సన్నద్ధం అవుతోంది. ముసాయిదా ప్రకారం..

  •  కార్డ్‌ జారీచేసే వారు ఆయా సంస్థలతో ముందస్తు ఒప్పందాలు చేసుకొని.. వినియోగదారులు ఇతర నెట్‌వర్క్‌ల సేవలను పొందకుడా నిరోధించకూడదు.  
  •  కార్డ్ జారీచేసే సంస్థ ఒకటి కంటే ఎక్కువ ఫైనాన్షియల్‌ నెట్‌వర్క్‌లతో సంబంధాలు పెట్టుకోవాలి. వాటికి సంబంధించిన కార్డులు జారీ చేయాలి.
  •  అర్హులైన కస్టమర్లకు కార్డ్‌ను ఎంచుకొనే వెసులుబాటును కల్పించాలి. ఎప్పుడైనా పోర్ట్‌ చేసుకొనే అవకాశం ఉండాలి.

ఇది వరకే క్రెడిట్ కార్డ్‌/ డెబిట్‌ కార్డు తీసుకున్న వారు కొత్త కార్డు నెట్‌వర్క్‌కు మారొచ్చు. రెన్యువల్‌ సమయంలో కార్డు నెట్‌వర్క్‌ను మార్చమని బ్యాంకులను లేదా ఆర్థిక సంస్థలను కోరొచ్చు. కొత్తగా కార్డు తీసుకునే వారు సైతం ఫలానా నెట్‌వర్క్‌ కార్డు కావాలని అడగొచ్చు. తాజా ప్రతిపాదనతో కస్టమర్లు తమకు నచ్చిన కార్డు నెట్‌వర్క్‌ను ఎంచుకొనే వెసులుబాటు లభించనుంది. రూపే క్రెడిట్‌ కార్డును యూపీఐతో లింక్‌ చేసుకొనే సదుపాయం అందుబాటులోకి వచ్చిన వేళ ఈ నిర్ణయంతో చాలా మందికి ఊరట లభించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని