Tech Shame: జనరేషన్‌ జడ్‌పై ‘టెక్‌’ ఎఫెక్ట్‌.. ఇంతకీ ఏమిటీ టెక్‌ షేమ్‌?

Tech Shame: టెక్‌ షేమింగ్‌ అనే పదం ఈ మధ్య వాడుకలోకి వచ్చింది. జనరేషన్‌ జడ్‌ యువత ఉద్యోగ జీవితంలో టెక్నాలజీ వినియోగంలో ఇబ్బంది పడడాన్ని టెక్‌ షేమింగ్‌గా పేర్కొంటున్నారు.

Published : 24 Oct 2023 09:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కంప్యూటర్లు పరిచయం అయిన కొత్తల్లో వాటి వాడకం అప్పటి తరానికి పెద్ద సవాలుగా ఉండేది. టెక్నాలజీని ఆకళింపు చేసుకుని వాటితో పనిచేయడం వారికి కత్తిమీద సాములా అనిపించేది. ఆ తర్వాత వచ్చిన వారికి మాత్రం అదేమంత పెద్ద విషయంలా అనిపించలేదు. మొదట్లో వీరెవరికీ పెద్దగా టెక్నాలజీ పరిచయం లేకపోయినప్పటికీ.. వృత్తి జీవితంలో పెద్దగా ఇబ్బందులైతే ఎదుర్కోలేదు. అదే జనరేషన్‌ జడ్‌ విషయానికొస్తే.. వీరికి టెక్నాలజీ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇతరులతో పోలిస్తే.. టెక్నాలజీ విషయంలో వీరు కాస్త ముందే. కానీ ఆఫీసుల్లో పనిచేసేటప్పుడు వీరూ ఇబ్బంది పడుతున్నారట. ఈ క్రమంలోనే టెక్‌షేమ్‌ అనే పదం కూడా పుట్టుకొచ్చింది. ఇంతకీ జనరేషన్‌ జడ్‌కు ఉన్న ఇబ్బందేంటి? టెక్‌ షేమ్‌ అంటే ఏంటి?

1995-2012 మధ్య పుట్టిన వారిని జనరేషన్‌ జడ్‌గా (Generation Z) వ్యవహరిస్తారు. వీరు ఇప్పుడిప్పుడే ఉద్యోగ జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. చిన్నతనం నుంచి మొబైల్‌ ఫోన్లు, ట్యాబ్‌, ల్యాప్‌టాప్‌లు వంటి టెక్నాలజీని వినియోగించడంలో ముందు వరుసలో ఉండేవారే. వృత్తి జీవితం వచ్చేసరికి వీరు పాత తరం కంప్యూటర్లు, ప్రింటర్లు, ఫ్యాక్స్‌ మెషీన్ల వాడకం విషయంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నారట. వృత్తిపరమైన డిజిటల్‌ సాధనాలను వినియోగించలేకపోతున్నారట. 2022లో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి వృత్తి జీవితంలోకి అడుగుపెట్టిన వాళ్లలో దాదాపు సగం మంది ఇలా సాంకేతికంగా ఇబ్బంది పడ్డారని లాసల్లే ఏజెన్సీ అనే సంస్థ తన సర్వేలో పేర్కొంది.

వీధి కుక్కల దాడిలో గాయపడి వ్యాపారవేత్త పరాగ్‌ దేశాయ్‌ కన్నుమూత!

మరి టెక్‌ షేమ్‌ అంటే?

కంప్యూటర్లు తయారుచేసే హెచ్‌పీ కంపెనీ.. తొలుత టెక్‌ షేమ్‌ అనే పదాన్ని వినియోగించింది. వృత్తి జీవితంలో సాధనాలను వినియోగించే విషయంలో యువకులు ఇబ్బందికి గురవుతున్నారని నిర్వచించడానికి ఈ పదాన్ని ప్రయోగించింది. ప్రతి ఐదుగురిలో ఒకరు టెక్నాలజీ సంబంధిత ఇబ్బందులు ఎదుర్కొంటున్న హెచ్‌పీ తెలిపింది. వృత్తి జీవితంలో ఇలా టెక్నాలజీని వాడలేకపోవడాన్ని సదరు వ్యక్తులు అసమర్థతగా భావిస్తారట. పైగా తోటి వారిని అడగడానికి మొహమాట పడతారని, ఒకవేళ వారు ఏదైనా అంటే అవమానంగా భావించడాన్ని టెక్‌షేమ్‌గా పేర్కొంటారు.

చూడ్డానికి ఈ సమస్య చిన్నగా కనిపించిన్పటికీ.. టెక్ షేమింగ్‌ను జనరేషన్‌ జడ్‌ యువత తమ ఆత్మగౌరవానికి భంగం కలిగిందని భావించొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. పైగా  వ్యక్తులు ఒంటరితనానికి లోనయ్యే ప్రమాదమూ ఉందని చెప్తున్నారు. సాధారణంగా టెక్‌షేమింగ్‌ అనేది అన్ని వయసుల వారికీ చెందిందే అయినప్పటికీ.. జనరేషన్‌ జడ్‌ ఉద్యోగులపై దీని ప్రభావం ఎక్కువ అని చెప్తున్నారు. దీన్ని నివారించాలంటే మేనేజర్‌ స్థాయి వ్యక్తులు కొత్తగా ఉద్యోగంలో చేరే వ్యక్తులపై దృష్టి సారించాలి. సర్వేలు, ఇంటర్వ్యూల ద్వారా టెక్‌షేమింగ్‌ గురించి తెలుసుకుని జనరేషన్‌ గ్యాప్‌ను పూడ్చేందుకు ప్రయత్నించాలని సూచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని