Credit Card: మీ క్రెడిట్ కార్డ్‌ లిమిట్‌ తగ్గిందా? ఇది కారణం కావొచ్చు..!

Credit Card Limit: క్రెడిట్ కార్డు చెల్లింపులు, క్రెడిట్ స్కోర్ ఆధారంగా బ్యాంకులు క్రెడిట్ లిమిట్‌లో మార్పులు చేస్తుంటాయి. అయితే ఎలాంటి చర్యల కారణంగా మీ క్రెడిట్‌ కార్డ్‌ లిమిట్ తగ్గుతుందో తెలుసుకోండి...

Updated : 16 Aug 2023 10:11 IST

బ్యాంకులు కొంత లిమిట్‌తో క్రెడిట్‌ కార్డులను జారీ చేస్తాయి. కార్డు తీసుకున్న వ్యక్తి ఆదాయం, సకాలంలో చెల్లింపులు చేయడం వంటివి ప‌రిగ‌ణ‌నలోకి తీసుకుని క్రెడిట్ లిమిట్‌ను బ్యాంకులు ఎప్పటికప్పుడు పెంచుతుంటాయి. అయితే కేవలం క్రెడిట్ కార్డు లిమిట్‌ను పెంచడమే కాదు.. అప్పుడప్పుడూ తగ్గిస్తుంటాయి కూడా.

గత కొన్ని రోజులుగా స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా (SBI)కు చెందిన  కస్టమర్లు క్రెడిట్‌కార్డు పరిమితులపై ఫిర్యాదులు చేస్తున్నారు. హఠాత్తుగా కార్డు లిమిట్ తగ్గిపోయిందంటూ ఆందోళన చెందుతున్నారు. ఎస్‌బీఐ ఒక్కటే కాదు.. గతంలో హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌ (RBL) వంటి బ్యాంకులు కూడా ఇలా చేశాయి. అయితే క్రెడిట్‌ కార్డు వినియోగదారుల ఖర్చులు, చెల్లింపుల ఆధారంగానే కార్డు పరిమితుల్లో పెంపు, తగ్గింపులు ఉంటాయనేది మనం గుర్తుంచుకోవాలి. ఇంతకీ కార్డు పరిమితిని బ్యాంకులు ఎందుకు తగ్గిస్తాయి.

అధిక వినియోగం

ఖాతాదారుల క్రెడిట్ కార్డు వినియోగంపై ఎప్పుడూ బ్యాంకులు కన్నేసి ఉంచుతాయి. క్రెడిట్‌ లిమిట్‌లో ఎంత మొత్తాన్ని ఖర్చు చేస్తున్నారో పరిశీలిస్తుంటాయి. ఒక క్రెడిట్ కార్డు కస్టమర్‌కు రూ.లక్ష వరకు లిమిట్ ఉందనుకుందాం. అందులో 30 నుంచి 40 శాతం వరకు ఖర్చుచేస్తే ఎటువంటి సమస్యా తలెత్తదు. లిమిట్‌లో 70 శాతానికి పైగా తరచూ వినియోగిస్తే.. రిస్క్‌ పొంచి ఉందన్న ఉద్దేశంతో సదరు బ్యాంకులు క్రెడిట్ లిమిట్‌ను తగ్గిస్తాయి.

ఓలా కొత్త విద్యుత్‌ స్కూటర్లు,బైౖకులు

ఎక్కువ రోజులు వినియోగించకపోయినా

క్రెడిట్ కార్డును అప్పుడప్పుడు వినియోగించే వారు కూడా క్రెడిట్‌ లిమిట్ సమస్యను ఎదుర్కొంటారు. ఇన్‌ యాక్టివేటెడ్‌ క్రెడిట్‌కార్డుల నుంచి బ్యాంకులకు ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. దీంతో యాక్టివ్‌గా లేని కార్డుదారుల పరిమితిని బ్యాంకులు తగ్గిస్తాయి.

బిల్లు చెల్లించకపోతే..

క్రెడిట్‌ కార్డులను వినియోగించి కొందరు చెల్లింపులు చేయరు. దీంతో ఆలస్య చెల్లింపులకు బ్యాంకులు ఛార్జీలు విధిస్తాయి.  దీనివల్ల క్రెడిట్‌ స్కోర్‌పైనా ప్రభావం పడుతుంది. ముఖ్యంగా మూడు నెలలకంటే ఎక్కువ కాలం పాటు డిఫాల్ట్‌ అయితే..  బ్యాంకులు క్రెడిట్‌ లిమిట్‌పై కోత విధిస్తాయి.

ఇవీ కారణం కావొచ్చు

తక్కువ సమయంలో ఎక్కువ క్రెడిట్‌ కార్డులు తీసుకున్నా బ్యాంకులు క్రెడిట్‌ లిమిట్‌ను తగ్గించే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఆర్థిక అస్థిరత, భౌగోళిక రాజకీయ అనిశ్చిత పరిస్థితులు వంటివి తలెత్తినప్పుడు ముందస్తు నష్ట నివారణ చర్యల్లో భాగంగా బ్యాంకులు వ్యక్తుల క్రెడిట్ లిమిట్‌ని తగ్గించేస్తాయి. కొవిడ్-19 మహమ్మారి విజృంభణ సమయంలో బ్యాంకులు చాలామంది కార్డు హోల్డర్ల క్రెడిట్ లిమిట్‌ను తగ్గించేశాయి.

చివరిగా: ఒకవేళ మీ క్రెడిట్‌ కార్డు లిమిట్‌ తగ్గినట్లు గుర్తిస్తే ముందుగా సంబంధిత బ్యాంకు కస్టమర్ సర్వీస్‌ను సంప్రదించండి. లిమిట్ తగ్గించటానికి గల కారణాన్ని తెలుసుకోండి. ఒకవేళ క్రెడిట్ నివేదికల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే వెంటనే సరిచేసుకోండి. ఎప్పుడూ క్రెడిట్ కార్డు వినియోగంపై ఓ కన్నేసి ఉంచండి. అధిక వినియోగం ఎప్పుడూ మంచిది కాదు.

-ఇంటర్నెట్‌డెస్క్‌ 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని