Remote work: రిమోట్‌ వర్క్‌తో కెరీర్‌కు నష్టమే..!

Remote work culture: రిమోట్ వర్క్‌ వల్ల కెరీర్‌లో ఎంతో కోల్పోతారని, అలాంటి వారు ఎప్పటికీ సీఈఓ స్థాయికి చేరుకోలేరని న్యూయార్క్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ పేర్కొన్నారు.

Published : 06 Nov 2023 13:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒకప్పటిలా ఆఫీసుకెళ్లి పనిచేసే రోజులు కావివి. కొవిడ్‌ పుణ్యమా అని రిమోట్‌ వర్క్‌ కల్చర్‌ (Remote work) అందుబాటులోకి వచ్చింది. నచ్చిన చోటు నుంచి పనిచేసే వెసులుబాటు లభిస్తోంది. న్యూ ఏజ్‌ కంపెనీలూ ఈ తరహా పని విధానాన్ని ప్రోత్సహిస్తున్నాయి. దీంతో ఇప్పుడిప్పుడే చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగ జీవితంలోకి అడుగుపెడుతున్న యువతరం (Gen Z) రిమోట్ వర్క్‌ కల్చర్‌నే కోరుకుంటోంది. దీనివల్ల కెరీర్‌కు నష్టం వాటిల్లుతుందని హెచ్చరిస్తున్నారు న్యూయార్క్‌ యూనివర్సిటీ బిజినెస్‌  ప్రొఫెసర్‌ సుజీ వెల్చ్‌. దీనివల్ల ఎప్పటికీ కార్పొరేట్‌ సీఈఓ స్థాయికి చేరుకోవడం అసాధ్యమని చెప్పారు. ఇతరుల మాదిరిగా ఆర్థిక ప్రతిఫలమూ పొందడం కష్టమేనంటూ జనరేషన్‌ జడ్‌ను హెచ్చరించారు.

రిమోట్‌ వర్క్‌ వల్ల అటు ఉద్యోగ జీవితాన్ని, ఇటు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్‌ చేయొచ్చని యువత భావిస్తోందని వెల్చ్‌ అన్నారు. దాన్నే వారు విజయంగా భావిస్తున్నారని, అది ఉత్తి అపోహ మాత్రమేనని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘‘వారంలో కొన్ని రోజుల్లో.. పూర్తిగా ఇంటి నుంచే పనిచేయడాన్ని చాలా మంది గొప్పగా భావిస్తుంటారు. వాస్తవానికి.. విజయానికి వారు ఇచ్చుకునే నిర్వచనంపై అది ఆధారపడి ఉంటుంది. కానీ, రిమోట్ వర్క్‌ కల్చర్‌ వల్ల సీఈఓ అవుదామనుకుంటే అది ఎప్పటికీ సాధ్యపడదు’’ అని వెల్చ్‌ అన్నారు.

అధిక పింఛనుపై ఈపీఎఫ్‌వో నిర్లక్ష్యం

కరోనా మహమ్మారికి ముందు దాదాపు అందరూ కార్యాలయాల్లోనే పనిచేశారని వెల్చ్‌ గుర్తు చేశారు. అలా ఎవరైతే కార్యాలయాల్లో పనిచేస్తారో వారికే పనిలో లోటుపాట్లు, ఎత్తుపల్లాలు తెలుస్తాయన్నారు. తోటి ఉద్యోగులతో కలిసి పనిచేయడంలో ఉండే ఆ ఆనందం వేరని చెప్పారు. రిమోట్ వర్క్‌ కల్చర్‌లో ఎంత కష్టపడి పనిచేసినా కార్యాలయాల్లో పనిచేసే వారితో పోలిస్తే ఆర్థిక ప్రతిఫలం కూడా తక్కువేనన్నారు. కార్యాలయాల్లో పని తర్వాత వ్యక్తిగత జీవితాన్ని ఎలా బ్యాలెన్స్‌ చేయగలరన్న దానిపై వారి విజయం ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.

జనరేషన్‌ జడ్‌, మిలీనియల్స్‌ ఎక్కువగా వర్క్‌ లైఫ్‌ బ్యాలెన్స్‌ను కోరుకుంటున్నారని డెలాయిట్‌ ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. అందుకే రిమోట్‌ వర్క్‌ కల్చర్‌కు మొగ్గు చూపుతున్నారని తెలిసింది. ఈ క్రమంలోనే కొత్త పని సంస్కృతి గురించి వెల్చ్‌ తన అభిప్రాయం వెలిబుచ్చారు. న్యూయార్క్‌ యూనివర్సిటీకే చెందిన మరో ప్రొఫెసర్‌ స్కాట్‌ సైతం గతంలో ఇదే తరహా అభిప్రాయం వ్యక్తంచేశారు. యువత ఇంట్లో ఉండడం ఎంతమాత్రం మంచిది కాదని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని