ఆ భయం పోవాలంటే..

ఫెయిల్‌ అవుతామేమో.. నవ్వుతారేమో.. తక్కువగా అంచనా వేస్తారేమో.. ప్రెజెంటేషన్‌, ఆఫీస్‌ మీటింగ్‌ ఎక్కడ మాట్లాడాలన్నా కాస్త కంగారుపడే అమ్మాయిలే ఎక్కువ.

Updated : 21 Jul 2023 04:57 IST

ఫెయిల్‌ అవుతామేమో.. నవ్వుతారేమో.. తక్కువగా అంచనా వేస్తారేమో.. ప్రెజెంటేషన్‌, ఆఫీస్‌ మీటింగ్‌ ఎక్కడ మాట్లాడాలన్నా కాస్త కంగారుపడే అమ్మాయిలే ఎక్కువ. ‘అమ్మాయివి ఇలా ఉండొద్దు.. అలా చేయొద్దు’ అన్న మాటలు ప్రభావం చూపడమూ అందుకు కారణమే! వీటన్నింటినీ దాటి ఆత్మవిశ్వాసం పెంచుకోవాలా.. మీ చేతుల్లోనే ఉందంటున్నారు నిపుణులు.

‘నువ్వు చేయలేవు’ అంటే అది కొన్నిసార్లు మనసు వరకూ వెళ్లకపోవచ్చు. కానీ ‘నావల్ల కాదు’ అని ఒక్కసారి అనుకున్నా అది ప్రభావం చూపగలదట. అందుకే కష్టమని తెలిసినా ప్రయత్నించి చూస్తా, నేర్చుకోవడంలో ఇదీ భాగమే అనుకుంటూ మొదలుపెట్టాలి. అప్పుడు ధైర్యం, మనపై మనకు నమ్మకం వాటంతట అవే వచ్చి చేరతాయి.

 పైపైన పని పూర్తిచేయడం ఎంత తప్పో.. ప్రతిదీ ఇలాగే సాగాలన్న మొండి పట్టుదలా మంచిది కాదు. దీనిలో ఏమాత్రం తేడా వచ్చినా స్వీయనింద చేసుకోవడం మొదలవుతుంది. సరిగా పూర్తి చేయలేకపోయాననుకునే ఆ భావనా ఆత్మవిశ్వాసం తగ్గేలా చేస్తుంది. వీలైనంతవరకూ బాగా చేశారా లేదా అన్నది చూసుకోండి చాలు.

 రంగు దగ్గర్నుంచి మొదలవుతుంది అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసం తగ్గడం. తర్వాత ఎత్తు, లావు, తెలివితేటలు, దుస్తులు.. ఈ పోలికకు అంతే తెగదు. ఎవరికివారే ప్రత్యేకం. మీ ప్రత్యేకతలేంటో గుర్తించండి. వాటిపై ఎక్కువ దృష్టిపెట్టండి. అవే మిమ్మల్ని భిన్నంగా నిలబెడతాయి. ఇదే అందం అన్న నిర్వచనాలనీ పట్టించుకోవద్దు. ఆత్మవిశ్వాసాన్ని మించిన అందం లేదు. మీ దారిలో మీరు దూసుకెళ్లి చూడండి.. మీతో పోటీపడేవారు ఎందరున్నారో మీకే తెలుస్తుంది.

 మీ సత్తా ఏంటో తెలియాలా? అయితే సవాళ్లను ఎంచుకోండి. మీ శక్తి ఏంటో నిరూపించే మార్గమది. ఓడిపోయారా.. ఓ పాఠమవుతుంది. గెలిచారా మీరేంటో అందరికీ తెలుస్తుంది. ఏవిధంగా తీసుకున్నా అది లాభమే.

 నేర్చుకునే క్రమంలో పొరపాట్లు సాధారణమే. అంతమాత్రాన భయపడొద్దు. ఎదుటివారి ముందు తలదించుకోవాల్సిన పనీలేదు. అదే పొరపాటు మళ్లీ జరగకుండా చూసుకుంటే చాలు. అలాగని బాధ్యతల నుంచి తప్పించుకోవద్దు. అప్పుడు ఇతరులకు భారంగా తోస్తారు. కష్టమైనా నేర్చుకుంటూ సాగండి. స్వీయశ్రద్ధపైనా దృష్టిపెడితే శారీరకంగానే కాదు మానసికంగానూ దృఢంగా మారతారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్