ఫరా.. నడకకి అందం తెచ్చారు

వ్యాపార కుటుంబం ఆమెది. కానీ దానిపై ఆసక్తి లేదు. నాన్న కోసం తప్పక రావాల్సిన పరిస్థితి. ‘సర్లే కొన్ని నెలలు చేసి నా వల్ల కాదు’ అని చెప్పేద్దాం అనుకున్నారు. అలాంటి ఆమె పాదరక్షల సంస్థ‘మెట్రో’ని దేశవ్యాప్తం ఎలా చేశారు? సంస్థను లాభాల బాటలో నడిపిస్తూ దేశంలోనే సంపన్న ముస్లిం మహిళగా ఎలా ఎదిగారో తెలియాలంటే ఫరా మాలిక్‌ భాంజీ ప్రయాణాన్ని చదివేయాల్సిందే!

Updated : 29 Apr 2024 06:57 IST

వ్యాపార కుటుంబం ఆమెది. కానీ దానిపై ఆసక్తి లేదు. నాన్న కోసం తప్పక రావాల్సిన పరిస్థితి. ‘సర్లే కొన్ని నెలలు చేసి నా వల్ల కాదు’ అని చెప్పేద్దాం అనుకున్నారు. అలాంటి ఆమె పాదరక్షల సంస్థ‘మెట్రో’ని దేశవ్యాప్తం ఎలా చేశారు? సంస్థను లాభాల బాటలో నడిపిస్తూ దేశంలోనే సంపన్న ముస్లిం మహిళగా ఎలా ఎదిగారో తెలియాలంటే ఫరా మాలిక్‌ భాంజీ ప్రయాణాన్ని చదివేయాల్సిందే!

 చిన్నప్పుడు సెలవులొస్తే చాలు... వాళ్ల ‘మెట్రో షూస్‌’కి వెళ్లేవారట ఫరా. నాన్న, తాత కస్టమర్లకు పాదరక్షలు అందిస్తూ బిజీగా ఉంటే ఈమె గల్లాపెట్టె దగ్గర కూర్చొనేవారు. వాటిలో చిల్లర డబ్బులన్నీ లెక్కపెట్టడం ఆమెకో ఇష్టమైన వ్యాపకం. ఈమెది ముంబయి. యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు. సొంతంగా ఏదైనా చేయాలనుకుంటున్న తనను తండ్రి కుటుంబ వ్యాపారంలోకి ఆహ్వానించారు. ‘‘మెట్రో బ్రాండ్స్‌’... తాతగారి హయాంలో మెట్రోషూస్‌గా ముంబయిలో ప్రారంభమైంది. పేరున్న రిటైల్‌ సంస్థగా ఎదిగింది. సినిమా తారలు, ప్రముఖులు, ఏర్‌హోస్టెస్‌... అంతెందుకు, ముంబయికి కొత్తగా ఎవరొచ్చినా తప్పక చూసే వాటిల్లో మా మెట్రో కూడా ఉండేది. అంత ఫేమస్‌ అయినా నాకు దానిపై ఆసక్తి ఉండేది కాదు. లెక్కలంటే ప్రాణం. దానికి సంబంధించి ఏదైనా చేయాలనుకున్నా. అదే నాన్నతో చెబితే ‘వ్యాపారం కూడా లెక్కలకు సంబంధించిందే. ఓ ఏడాది పనిచెయ్యి. ఆ అనుభవం తరవాత నీకేది చేయాలనిపిస్తే అదే కొనసాగించు’ అన్నారు. ఆ ఆలోచన నాకు కూడా బాగానే అనిపించింది. అందుకే సరేనన్నా’నంటారు ఫరా.

బార్‌కోడ్‌ ప్రవేశపెట్టి...

ఏడాది... ఎలాగోలా కళ్లు మూసుకుంటే సరిపోతుంది అనుకోలేదు ఫరా. కొన్నాళ్లు చేసినా తనదైన ముద్ర వేయాలనుకున్నారు. అది 2000వ సంవత్సరం. మార్కెటింగ్‌ విభాగంలో చేరారు ఆమె. అప్పటికి వాళ్ల దగ్గర కస్టమర్లకు కాగితపు రసీదులు ఇచ్చే విధానమే ఉండేది. దాన్ని డిజిటల్‌ బాట పట్టించాలి అనుకున్నారామె. ఉత్పత్తులకు బార్‌కోడ్‌ విధానం ప్రవేశపెట్టారు. దీంతో ధర కనుక్కొని, లెక్కలేసి రసీదులిచ్చే విధానానికి స్వస్తి పలికినట్టయ్యింది. సమయం ఆదా అవడమే కాదు, వ్యాపారమూ పెరిగింది. అది చూసి ఆమెను ఈ రంగంలోనే కొనసాగేలా ఒప్పించాలి అనుకున్నారు వాళ్ల నాన్న. ఆశ్చర్యంగా... ఫరాకీ దీనిపై ఆసక్తి కలిగింది. దీంతో ఒక్కో విభాగం గురించి తెలుసుకున్నారు. బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌పై భిన్న కోర్సులూ చేశారు. ఒక్కో మెట్టూ ఎక్కుతూ డైరెక్టర్‌ స్థాయికి ఎదిగారు. వారసురాలైనా ఈక్రమంలో ఎన్నో ఇబ్బందులు. సప్లయర్లు తనతో మాట్లాడటం కాదు... కనీసం ముఖం చూడటానికీ ఇష్టపడేవారు కాదు. పెద్దవాళ్లతో మాట్లాడతామనో, మగవాళ్లెవరూ లేరా అనో అడిగేవారట. ‘మీ సందేహాలేంటో చెప్పండి. నేనవి తీర్చలేను అనిపించినప్పుడు వాళ్లనే పిలుస్తా’ అనేవారట. ఎంత ఓపిగ్గా అన్నీ వివరించేవారో... అంతే కచ్చితంగానూ వ్యవహరిస్తారట. అలా తన పనితనంతోనే అడ్డంకులను దాటుకుంటూ వచ్చారు ఫరా.

దేశవ్యాప్తంగా స్టోర్లు...

ఆన్‌లైన్‌ అమ్మకాలు ఇప్పుడు సర్వసాధారణం. కానీ... దాదాపు 15 ఏళ్ల క్రితమే దానికి శ్రీకారం చుట్టారు ఫరా. 2010లో వెబ్‌సైట్‌ ఏర్పాటు చేసి, ఆన్‌లైన్‌ అమ్మకాలు ప్రారంభించారు. అంతేకాదు... అప్పటివరకూ సొంత తయారీ, దేశీ సంస్థల ఉత్పత్తులను రిటైలింగ్‌ చేసేది మెట్రో. దానికి విదేశీ పాదరక్షలను జోడించి ‘మెట్రో బ్రాండ్స్‌’గా మార్చారు. 800కుపైగా శాఖలతో సంస్థను దేశమంతా విస్తరించారు. ‘సాంకేతికత సాయంతో ఏ పనైనా సులువవుతుందని నమ్ముతాన్నేను. దాన్నే అనుసరించి విజయవంతమయ్యా. ఇక ఇంటర్నెట్‌ అందుబాటులోకి వచ్చాక ప్రపంచమంతా అరచేతిలోకి వచ్చింది. అలాంటప్పుడు విదేశీ ఉత్పత్తులను అందుబాటులోకి ఎందుకు తీసుకురాకూడదు అనుకున్నా’ననే ఫరా స్కెచర్స్‌, క్రాక్స్‌, క్లార్క్స్‌ వంటి అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందం చేసుకొని పాదరక్షల రంగంలో మెట్రోని లీడర్‌గా నిలిపారు. ఫ్యాషన్‌, ఆధునిక ధోరణులను అందిపుచ్చుకోవడంలో ఫరా ఎప్పుడూ ముందే అంటారంతా. ఆమె మాత్రం ‘పొరపాట్లు చేస్తే నాన్న కోప్పడకపోగా వెన్నుతట్టేవారు. తప్పులు చేయందే నేర్చుకోవడం ఎలా సాధ్యమనేవారు. అలా నాకు ప్రయోగాలు చేసే అవకాశం దక్కింది’ అని నవ్వేస్తారామె. 2021లో మెట్రోని ఐపీఓగానూ తీసుకొచ్చారు. నాయకురాలిగా ఫోర్బ్స్‌ జాబితాకెక్కారు. అన్నట్టూ దేశంలోనే అత్యంత సంపన్న ముస్లిం మహిళ ఫరానే! ఆమె రూ.28 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్