Updated : 27/03/2021 02:14 IST

అతడు చూపించే శ్రద్ధ భయపెడుతోంది?

కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి నాది. ఈ మధ్య మా పై అధికారి నాతో చనువుగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు. తన కోరిక తీర్చమని వేధిస్తున్నాడు. నా మీద అతడు చూపించే అతి శ్రద్ధ ఇబ్బందికరంగా ఉంది.  ఆఫీసులో అతడికి చాలా గొప్పవాడనీ, మంచివాడనీ పేరు. ఇదంతా ఎవరికైనా చెబితే  నమ్ముతారోలేదోనని భయమేస్తోంది. పైగా ఇదంతా బయటకివస్తే నా ఉద్యోగానికి ఇబ్బంది అవుతుందేమోననిపిస్తోంది. ఒక వేళ పరిస్థితులు నాకు అనుకూలంగా లేకపోతే చట్టం ఏమైనా సాయం చేస్తుందా?

- ఓ సోదరి

మీలా బాధపడుతున్న వారి కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధక చట్టం- 2013లో తెచ్చింది. పనిచేసే చోట స్త్రీ స్వేచ్ఛా, స్వాతంత్య్రాలకు భంగం వాటిల్లితే అది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14, 15, 19, 21లను ఉల్లంఘించినట్లు భావించొచ్చని స్పష్టం చేస్తోంది. సుప్రీంకోర్టు ‘విశాఖ వర్సస్‌ రాజస్థాన్‌’ అనే కేసులో 1997లో స్త్రీలు పనిచేసే చోట ఉండాల్సిన, పాటించాల్సిన కొన్ని నియమాలను రూపొందించింది. పైన చెప్పిన చట్టం ప్రకారం ఏ స్త్రీ అయినా లైంగిక వేధింపులకు గురైతే ఆ సంస్థలో ఉండే అంతర్గత కమిటీలకు ఫిర్యాదు చేయవచ్చు. విచారించి న్యాయం చేయాల్సిన బాధ్యత వారిదే. అలానే ఆమె తిరిగి ఆ వ్యక్తి దగ్గర పనిచేయకుండా ఇంకో విభాగానికి బదిలీ చేయడం, జీతంతో కూడిన సెలవు ఇవ్వడం లాంటి సౌకర్యాలూ కల్పించాలి.నేరం నిరూపణ అయితే పోలీసులకు విషయం తెలపాలి. ఇదంతా మూడు నెలల్లో పూర్తికావాలి. ఈ చట్టం ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో పాటు ఇళ్లలో పని చేసేవారికి కూడా వర్తిస్తుంది. ఇదేకాదు క్రిమినల్‌ లా ఎమెండ్‌మెంట్‌ యాక్ట్‌-2013 ప్రకారం మహిళలపై వేధింపులను నిరోధించడానికి ఐపీసీ సెక్షన్‌లో కొన్ని సవరణలు చేశారు. ఇందులో ముఖ్యంగా సెక్షన్‌ 354-ఎ(ఐపీసీ) ప్రకారం...లైంగిక సంబంధం కోరుతూ మహిళను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వేధించినా, అసభ్యకరమైన చేష్టలు, అభ్యర్థనలు, డిమాండ్లు, వ్యాఖ్యలు చేయడాన్నీ నేరంగా పరిగణిస్తారు. అలానే సెక్షన్‌-509 ప్రకారం కూడా ఈ అంశాల్లో నేర నిరూపణ అయితే.. మూడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. మీరు పనిచేసే విభాగం ఎలాంటిదో, అక్కడ కమిటీలు ఉన్నాయో లేదో తెలుసుకుని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయండి. లేదా మహిళా కమిషన్‌, స్థానిక కమిటీల్లో దేనికైనా ధైర్యంగా ముందడుగు వేయండి. మీకు తప్పక న్యాయం జరుగుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి