Published : 04/05/2021 00:36 IST

వయసు 29... వ్యాపారం ఏడువేల కోట్లు!

ఎనిమిది దేశాల్లో విస్తరించిన వ్యాపార సామ్రాజ్యం... ఐదొందలమంది ఉద్యోగులు... ఏడువేలకోట్ల రూపాయలకు పైగా లావాదేవీలు... ఇవన్నీ సాధించింది ఏ తలపండిన వ్యాపారవేత్తో అనుకుంటే పొరపాటు! చిన్న వయసులోనే ఆసియా నుంచి తొలిసారిగా యూనికార్న్‌ క్లబ్‌లో అడుగుపెట్టిన అంకితిబోస్‌ ఈ అద్భుత విజయాలని సృష్టిస్తోంది...

ప్పటికి అంకితి వయసు 23. ముంబయిలో సెయింట్‌ జేవియర్‌ కాలేజీ నుంచి డిగ్రీ చేసి బెంగళూరులోని మెక్‌కిన్సే సంస్థలో మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌గా పనిచేస్తుండేది. ఆటవిడుపుగా ఉంటుందని వారాంతంలో ఫ్రెండ్స్‌తో కలిసి బ్యాంకాక్‌ వెళ్లింది. ఆమె వెళ్లిన చతూచక్‌ మార్కెట్‌కి ప్రపంచంలోనే అతిపెద్ద వారాంతపు మార్కెట్‌గా పేరుంది. ఒకటా రెండా... సుమారు 15 వేల దుకాణాలున్నాయక్కడ. ఎన్ని ఫ్యాషన్‌ వస్తువులు కొన్నా తనివి తీరడం లేదు. అక్కడే ఉండిపోవాలనిపించేంత బాగుందా మార్కెట్‌. బ్యాంకాక్‌లో ఆ మార్కెట్‌ మిగిల్చిన అనుభూతులని మరిచిపోలేకపోయింది అంకితి. అలాగే వాళ్లలో ఎవరికీ ఆన్‌లైన్‌ దుకాణాలుకానీ, డిజిటల్‌ పరిజ్ఞానం కానీ లేకపోవడం కూడా గమనించింది. ‘ఉంటే బాగుండును’ అనుకుంది మనసులో. మనదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఓ స్నేహితురాలు పిలిచిన పార్టీకి హాజరయ్యింది. అక్కడే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ధృవ్‌కపూర్‌ ఆమెను కలిశాడు. వాళ్లు ముచ్చటించుకోవడం మొదలుపెట్టిన కాసేపటికే ఓ విషయం వాళ్లకు స్పష్టంగా అర్థమైంది. వాళ్లిద్దరూ ఆలోచిస్తోంది ఒక్కటే.. ఓ స్టార్టప్‌ని పెడితే ఎలా ఉంటుందని. అనుకున్నదే తడవుగా దాచుకున్న సొమ్ముతో వ్యాపారాన్ని మొదలుపెట్టారిద్దరూ. ఇంతకీ ఆ వ్యాపారం ఏంటో తెలుసా? ఫ్యాషన్‌ ఉత్పత్తులని అమ్మే చిరువ్యాపారస్తులకు ఆన్‌లైన్‌ వేదికని ఏర్పాటు చేయడం. అలా 2015లో ‘జిలింగో’ ప్రారంభమైంది. దానికి సీఈవోగా బాధ్యతలు తీసుకుంది అంకితి. అయితే ఈ సంస్థ మనదేశంలో ప్రారంభం కాలేదు. సింగపూర్‌ ప్రధాన కేంద్రంగా ఇండోనేషియాలో ప్రారంభమైంది. ‘అక్కడి భాష తెలియదు. అక్కడి సంస్కృతి తెలియదు.. ఆహారపు అలవాట్లు కొత్త. అయినా అక్కడే వ్యాపారాన్ని ప్రారంభించడం ఒకరకంగా సవాలే. కానీ... మనదేశంతో పోలిస్తే అక్కడి మార్కెట్‌ పెద్దది. స్త్రీల కొనుగోలు శక్తి ఎక్కువ. అందుకే కాస్త రిస్క్‌ తీసుకోవాల్సి వచ్చింది. సంస్థని ముందుకు నడిపించడానికి రోజుకి పద్దెనిమిది గంటలు కష్టపడ్డా నాకు అలుపు అనిపించేది కాదు. పని చేయడం అంత ఇష్టంగా ఉండేది’ అని సంతోషంగా చెబుతోంది అంకితి. అక్కడ నుంచి సరిగ్గా నాలుగేళ్లకు సంస్థని ఏడువేలకోట్ల రూపాయల వ్యాపారాన్ని చేసే యూనికార్న్‌ క్లబ్‌లో చేర్చింది.

ఇంత చిన్న వయసులోనే వ్యాపారాన్ని అంతగా విస్తరించిందంటే ఆమె రక్తంలోనే వ్యాపార దక్షత ఉంది కాబోలు అనుకుంటే పొరపాటు. అంకితి నాన్న ప్రభుత్వ రంగ  సంస్థలో ఇంజినీర్‌. అమ్మ లెక్చరర్‌. తండ్రి ఉద్యోగరీత్యా ఒకచోట స్థిరంగా ఉండటానికి వీలుగా ఉండేది కాదు ఆమెకు. ‘పెద్ద నగరాల నుంచి పల్లెటూర్ల వరకూ చాలా చోట్లకు తిరిగా. అలా తిరగడం నాకు మేలే చేసింది. దేశంలోని వివిధ సంస్కృతులు, పద్ధతులు తెలుసుకునే అవకాశం వచ్చింది. స్టార్టప్‌ని విస్తరించే క్రమంలో వివిధ ప్రాంతాల వారి అలవాట్లని తేలిగ్గా ఆకలింపు చేసుకోవడానికి ఈ అనుభవం పనికొచ్చింది. సంస్థని ప్రారంభించేముందు ఇదో యూనికార్న్‌ సంస్థ అవుతుందనే ఉద్దేశంతో మొదలుపెట్టలేదు. కేవలం ఫ్యాషన్‌ పై ఉన్న పిచ్చి అభిమానంతో మాత్రమే ప్రారంభించాను. అయితే మామూలు ఫ్యాషన్‌ ఉత్పత్తులు బ్రాండెడ్‌ వాటిని తట్టుకుని నిలబడటం అంత తేలికైన విషయం కాదని నాకు తొలినాళ్లలోనే అర్థమైంది. అందుకే అమ్మకందార్లని, వాళ్లకు ముడిసరకుని అందించే డీలర్లని, ఫ్యాక్టరీ యజమానులని, వాళ్లందరికీ అవసరం అయిన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఈ వేదికపైకే తీసుకురావాలని అనుకున్నా. అలా జిలింగోని 2017లోని బీ2బీ సంస్థగా మార్చాం’ అని తన ప్రయాణాన్ని వివరించింది అంకితి. అలా ఆమె అమెరికా, ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్స్‌, హాంకాంగ్‌, సింగపూర్‌, ఇండోనేషియాలతోపాటు మనదేశంలోనూ సంస్థను విస్తరించారు. ఇలా గ్లోబల్‌ స్టారప్‌లని నిర్వహిస్తున్న మహిళలు ప్రపంచవ్యాప్తంగా 23 మంది మాత్రమే ఉంటే అందులో అంకితి కూడా ఒకరు.
‘ఆడవాళ్లలోని సామర్థ్యాలని ఆడవాళ్లు కాకపోతే ఇంకెవరు నమ్ముతారు? అందుకే నా సంస్థలో సగం ఉద్యోగాలు మహిళలకే కేటాయించాను. అందులో సగం మంది కీలకమైన నాయకత్వ హోదాల్లో ఉన్నారు. 28 నుంచి 38 ఏళ్ల వయసులో ఉద్యోగం చేసే ఆడవాళ్ల పరిస్థితి కత్తిమీద సాములా ఉంటుంది. ఇంకా పెళ్లికాలేదా? పిల్లలు లేరా? వంటి ప్రశ్నలు తరచూ ఎదురవుతూనే ఉంటాయి. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ మన దృష్టి దీర్ఘకాలిక లక్ష్యాలపైనే ఉండాలి. మనల్ని వెనక్కిలాగాలని చూసే వారి కామెంట్లపైన కాదు. అసంఘటిత రంగంలో ఎంతో మంది మహిళలు తక్కువ జీతాలకు పనిచేస్తున్నారు. అలాంటి వారికోసం ప్రత్యేకించి ఉమెన్‌ నెట్‌ వర్క్‌లని ఏర్పాటు చేసి వారికి అండగా ఉండాలని అనుకుంటున్నా’ అని చెబుతున్న అంకితి ఇంత పెద్ద సంస్థని నడిపే క్రమంలో తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌ వంటి సమస్యలని కూడా ఎదుర్కొందట. కానీ వాటిని దాచుకోకుండా పైకి చెప్పి తగిన వైద్య సాయం తీసుకుంటానంటోంది.

ఈ రోజు నా విజయం మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ. చూస్తూ ఉండండి... నాలాంటి అమ్మాయిలే వ్యాపారా సామ్రాజ్యాల్ని ఏలుతారు.


తోటివాళ్లెవరూ చేయలేని పనిని చేపట్టినపుడే స్త్రీ శక్తిమంతురాలవుతుంది.

- మార్జి పియర్సీ, అమెరికన్‌ రచయిత్రి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి