ఈ సీజన్లో ఈ జాగ్రత్తలు తప్పవు..!
విపరీతమైన ఎండలు, వానలు లేకపోయినా సరే- వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా వివిధ సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఎడతెగని ఉక్కబోత, స్నానం చేసినా సరే ఏమాత్రం ఫ్రెష్‌గా అనిపించకపోవడం, ఒళ్లంతా....
విపరీతమైన ఎండలు, వానలు లేకపోయినా సరే- వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా వివిధ సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఎడతెగని ఉక్కబోత, స్నానం చేసినా సరే ఏమాత్రం ఫ్రెష్‌గా అనిపించకపోవడం, ఒళ్లంతా బంకబంకగా ఉండడం.. ఇలా ఎన్నో సమస్యలు. మరి వీటి నుంచి బయటపడాలంటే- కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదు..
పూర్తిగా ఆరిన తర్వాతే..
ప్రస్తుత జీవనశైలి ఏ పని చేయడానికీ తగిన సమయం దొరకనంత బిజీగా మారిపోయింది. ఈ క్రమంలోనే తలస్నానం చేసిన వెంటనే చకచకా రడీ అయిపోయి బయటకు వచ్చేస్తారు చాలామంది.. మీరూ అంతేనా? అయితే వాతావరణంలో తేమ అధికంగా ఉన్నప్పుడు మాత్రం ఇలా చేయకండి. ఎందుకంటే కుదుళ్ల వద్ద ఉన్న తడికి గాల్లోని తేమ కూడా తోడైతే జుట్టు అట్టకట్టినట్లు మారిపోతుంది. బాగా పొడిబారినట్లు కనిపిస్తూ చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది. అందుకే తలస్నానం చేసిన తర్వాత మెత్తని టవల్‌తో కురులను మృదువుగా తుడుచుకోవాలి. ఆ తర్వాత పూర్తిగా ఆరనిచ్చి అప్పుడు బయట అడుగుపెట్టడం ఉత్తమం.
మాయిశ్చరైజర్ అవసరమే..
'ఎటూ గాల్లో తేమ ఎక్కువగా ఉంది కదా.. ఈ సమయంలో మాయిశ్చరైజర్ రాసుకుంటే చర్మం ఇంకా జిడ్డుగా అయిపోతుంది..' అనే భావనతో చాలామంది మాయిశ్చరైజర్ రాసుకోవడం ఆపేస్తారు. కానీ ఇది సరికాదు.. వాతావరణంలో తేమ ఏ స్థాయిలో ఉన్నా సరే.. చర్మానికి మాయిశ్చరైజర్ ద్వారా తగినంత తేమ అందించడం తప్పనిసరి. లేదంటే చెమట కారణంగా డీహైడ్రేషన్‌కి గురై చర్మం మరింత పొడిబారిపోవడమే కాకుండా ఎగ్జిమా వంటి చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.
క్లే ఫేస్ ప్యాక్స్‌తో..
ఈ వాతావరణంలో మనం ఉపయోగించే ఫేస్ మాస్క్‌లు ఓవైపు మలినాలను తొలగిస్తూనే మరోవైపు చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చాల్సి ఉంటుంది. అలాగే చర్మానికి తగినంత తేమను సైతం అందించాలి. అందుకే సహజసిద్ధమైన పదార్థాలతో తయారుచేసిన ఫేస్‌మాస్క్‌లే తప్పనిసరిగా ఉపయోగించడం మంచిది. ముఖ్యంగా క్లే ఫేస్‌మాస్క్, మడ్ ప్యాక్స్ వంటివి ఇందుకు బాగా ఉపయోగపడతాయి. ఇవి చర్మం పైపొరల్లో పేర్కొన్న మృతకణాలు, దుమ్ము, ధూళి.. వంటి వాటితో పాటు చర్మరంధ్రాల వద్ద ఉన్న అధిక నూనెలను సైతం తొలగిస్తాయి. ఫలితంగా చర్మం లోపలి నుంచి బాగా శుభ్రపడి ప్రకాశవంతంగా మారుతుంది. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు చొప్పున క్రమం తప్పకుండా ఫేస్‌మాస్క్‌లు వేసుకుంటూ క్లెన్సింగ్- మాయిశ్చరైజింగ్- టోనింగ్ ప్రక్రియ ద్వారా చర్మాన్ని జాగ్రత్తగా సంరక్షించుకుంటే ఇలాంటి వాతావరణంలోనూ చక్కని చుక్కలా మెరవచ్చు.
ఈ జాగ్రత్తలూ ముఖ్యమే..!
⚛ వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు అందంగా మెరిసిపోవాలంటే కేవలం బయట నుంచి చర్మానికి పోషణ అందిస్తే సరిపోదు. నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా శరీరంలోని నీటి స్థాయులను కూడా క్రమబద్ధీకరించుకోవాలి.
⚛ ఎండ అంతగా లేదని సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవడం మానేయకూడదు. బయటకు వెళ్లే ముందు చర్మానికి సన్‌స్క్రీన్ అప్త్లె చేసుకోవడం తప్పనిసరి.
⚛ వాతావరణంలోని అధిక తేమ కారణంగా చెమట ఎక్కువగా పడుతోందా? అయితే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కాస్త పౌడర్ అప్త్లె చేసుకుంటూ ఉండండి. ఇది తిరిగి చెమట పట్టకుండా కాసేపటి వరకు నియంత్రించగలదు.
⚛ వేసవికాలం పూర్త్తెపోయింది కదా అని కాటన్ దుస్తులు పక్కన పెట్టేసి సిల్క్ ఫ్యాబ్రిక్స్ వేసుకుంటున్నారా? కాస్త ఆగండి.. గాల్లో తేమ అధికంగా ఉండే ఈ కొద్ది రోజులపాటు చెమట పీల్చే ఫ్యాబ్రిక్స్‌నే ఎంపిక చేసుకోవడం ఉత్తమం. అప్పుడే చర్మం అధిక సమయం పొడిగా ఉండే వీలు ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.