Cashless: ఇక అన్ని ఆస్పత్రుల్లో క్యాష్‌లెస్‌.. నేటి నుంచే అమల్లోకి

Cashless facility at all hospitals: దేశవ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో క్యాష్‌లెస్‌ సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ‘ది జనరల్‌ ఇన్సూరెన్స్‌’ కౌన్సిల్‌ వెల్లడించింది.

Updated : 25 Jan 2024 13:35 IST

Cashless | దిల్లీ: ప్రైవేటు ఆస్పత్రుల్లో ట్రీట్‌మెంట్‌కు సంబంధించి కీలక నిర్ణయం వెలువడింది. ఆరోగ్య బీమా తీసుకున్న వారు అన్ని ఆస్పత్రుల్లో ‘క్యాష్‌లెస్‌’ (Cashless facility) సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. గురువారం నుంచే అందుబాటులోకి వచ్చినట్లు ‘ది జనరల్‌ ఇన్సూరెన్స్‌ కౌన్సిల్‌’ వెల్లడించింది. జనరల్‌, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలతో సంప్రదింపుల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఇన్సూరెన్స్‌ పాలసీ నెట్‌వర్క్‌ జాబితాలో పేరు లేని హాస్పిటల్‌లోనూ క్యాష్‌లెస్‌ సదుపాయాన్ని పొందొచ్చు.

నెట్‌వర్క్‌ హాస్పిటల్‌ జాబితాలో లేని ఆస్పత్రుల్లో క్యాష్‌లెస్‌ సదుపాయం పొందేందుకు 48 గంటల ముందు ఇన్సూరెన్స్‌ కంపెనీకి తెలియజేయాలి. అత్యవసర సమయాల్లో అయితే ఆస్పత్రిలో చేరిన 48 గంటల్లోపు సమాచారాన్ని చేరవేయాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్‌ పాలసీ షరతులు, నిబంధనల ఆధారంగా క్లెయిం వర్తిస్తుందని కౌన్సిల్‌ పేర్కొంది

3 ట్రిలియన్‌ డాలర్ల క్లబ్‌లోకి మైక్రోసాఫ్ట్‌.. AIతో కంపెనీ షేర్లకు బూస్ట్‌!

ప్రస్తుతం ఏదైనా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకుంటే నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌లో మాత్రమే క్యాష్‌లెస్‌కు అనుమతి ఉంది. క్యాష్‌లెస్‌ సదుపాయం లేని చోట ట్రీట్‌మెంట్‌కు అయ్యే ఖర్చును జేబులోంచి చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ప్రక్రియ సంక్లిష్టంగా ఉండడం, రిఫండ్‌ ప్రక్రియ ఆలస్యం కావడంతో కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక నుంచి ఈ సమస్యలు తప్పనున్నాయి. ‘క్యాష్‌లెస్‌’ గురించి ఇప్పటికే ఆయా కంపెనీలు కస్టమర్లకు సందేశాలు పంపిస్తున్నాయి.

‘‘అన్నిచోట్ల క్యాష్‌లెస్‌ సదుపాయం కస్టమర్ల జీవితాలను మరింత సులభతరం చేయనుంది. ప్రస్తుతం 63 శాతం మంది క్యాష్‌లెస్‌ సదుపాయం ఎంచుకుంటుంటే.. మిగిలినవారు రీయింబర్స్‌మెంట్‌ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. రిఫండ్‌ ప్రక్రియ వల్ల కస్టమర్లు ఆర్థికంగా ఒత్తిడితో పాటు  క్లెయిం చేసుకునే విషయంలోనూ అవాంతరాలు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రక్రియను సులభతరం చేయడానికే తాజా నిర్ణయం తీసుకున్నాం. మోసాలను అరికట్టి కస్టమర్ల విశ్వాసం పొందేందుకు ఇది ఉపకరిస్తుంది’’ అని కౌన్సిల్‌ ఎండీ, బజాజ్‌ అలియాంజ్‌ జనరల్ ఇన్సూరెన్స్‌ సీఈఓ తపన్‌ సింఘేల్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని