Credit card dues: క్రెడిట్‌ కార్డ్‌ బకాయిలు సరికొత్త రికార్డు..!

Credit card dues in April: దేశంలో క్రెడిట్‌ కార్డు వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. బకాయిలు సైతం అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఏప్రిల్‌లో గరిష్ఠంగా ఈ మొత్తం రూ.2లక్షల కోట్లకు చేరింది.

Published : 26 Jun 2023 13:21 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఒకప్పుడు సంపన్న వర్గాలకే పరిమితమైన క్రెడిట్‌ కార్డులు (Credit card) .. ఇప్పుడు అన్ని ఆదాయ వర్గాల వారికీ చేరాయి. ఒకప్పటితో పోలిస్తే వీటి వినియోగం గణనీయంగా పెరిగింది. దీంతో  బకాయిలు సైతం అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ మొత్తం కొత్త రికార్డును నెలకొల్పింది. బ్యాంకులకు వినియోగదారులు చేయాల్సిన చెల్లింపుల (Credit card due) మొత్తం తొలిసారి రూ.2లక్షల కోట్లు దాటింది. గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే ఏకంగా 30 శాతం మేర వృద్ధి చెందింది.

ఓ వైపు అన్‌ సెక్యూర్డ్‌ లోన్స్‌ (ఎలాంటి హామీ లేకుండా ఇచ్చే రుణాలు) పెరుగుతుండడంపై ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తంచేస్తోంది. ఈ నేపథ్యంలో క్రెడిట్‌ కార్డు బకాయిలు ఈ స్థాయిలో పెరగడం గమనార్హం. అయితే, బ్యాంకులు మాత్రం అదేమంత పెద్ద విషయం కాదని చెప్తున్నాయి. క్రెడిట్‌ కార్డు జారీ చేసేటప్పుడు వినియోగదారుడి క్రెడిట్‌ హిస్టరీతో పాటు, ఆ వ్యక్తి ఫైనాన్షియల్‌ హెల్త్‌ను చూసే కార్డును జారీ చేస్తామని బ్యాంకులు చెప్తున్నాయి. దీనికి తోడు క్రెడిట్‌ కార్డు వినియోగం పెరగడం కొంతైతే.. బకాయిలు పెరగడానికి ద్రవ్యోల్బణం మరో కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.

దేశంలో క్రెడిట్‌ కార్డు వినియోగం పెరిగిన మాట వాస్తవమే అయినప్పటికీ.. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఈ సంఖ్య తక్కువేనని నిపుణులు చెప్తున్నారు. దేశంలో కేవలం 5 శాతం మంది దగ్గరే క్రెడిట్‌ కార్డులు ఉన్నాయని పేర్కొంటున్నారు. ఇక బ్యాంకులు ఇచ్చిన మొత్తం రుణాల్లో క్రెడిట్‌ కార్డు రుణాల వాటా కేవలం 1.4 శాతం మాత్రమేనని ఆర్‌బీఐ గణాంకాలు చెప్తున్నాయి. సింహభాగం హౌసింగ్‌ రుణాలు (14.1 శాతం) ఆక్రమించగా.. 3.7 శాతం వాటాతో తర్వాతి స్థానంలో వాహన రుణాలు ఉన్నాయి. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో క్రెడిట్‌ కార్డులను ఉపయోగించి రూ.1.3 లక్షల కోట్ల విలువైన చెల్లింపులు జరిగినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని