Fixed Deposits: ఈ స్పెషల్‌ ఎఫ్‌డీల గడువు నెలాఖరు వరకే..!

కొన్ని ప్రముఖ బ్యాంకులు ఎఫ్‌డీలపై అత్యధిక వడ్డీను అందిస్తున్నాయి. ఈ బ్యాంకుల్లో ఎఫ్‌డీ వేయడానికి ఈ నెలాఖరువరకే గడువుంది.

Updated : 14 Jun 2023 18:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాధారణ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (fixed deposit) కంటే అధిక వడ్డీ ఇచ్చేలా కొన్ని బ్యాంకులు ఆ మధ్య స్పెషల్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాలను తీసుకొచ్చాయి. స్వల్పకాలానికి గానూ ఈ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ప్రవేశపెట్టాయి. అలా ఎస్‌బీఐ, ఇండియన్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ వంటి బ్యాంకులు తీసుకొచ్చిన కొన్ని స్పెషల్‌ ఎఫ్‌డీల గడువు త్వరలో ముగియనుంది. జూన్‌ నెలాఖరు వరకే ఈ ఎఫ్‌డీలు అందుబాటులో ఉండనున్నాయి. ఒకవేళ మీరు ఎఫ్‌డీ చేయాలని చూస్తుంటే త్వరలో ముగియనున్న ఆ పథకాలపై లుక్కేయండి..

ఎస్‌బీఐ-400 రోజుల అమృత్‌ కలశ్‌

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) 7.10% వడ్డీ రేటుతో ‘400 రోజుల’ (అమృత్‌ కలశ్‌) ప్రత్యేక కాలవ్యవధి ఎఫ్‌డీని గతంలో ప్రవేశపెట్టింది. ఈ ఎఫ్‌డీపై సీనియర్‌ సిటిజన్లు గరిష్ఠంగా 7.60% వడ్డీని పొందుతారు. ఈ పథకం 2023 జూన్‌ 30న ముగుస్తుంది.

ఎస్‌బీఐ ‘వి కేర్‌’

ఎస్‌బీఐ ‘వి కేర్‌’ ప్రత్యేక ఎఫ్‌డీ పథకం ప్రత్యేకంగా సీనియర్ల సిటిజన్ల కోసం రూపొందించారు. దీని కాలవ్యవధి 5-10 సంవత్సరాలు. ఈ పథకం కింద సీనియర్‌ సిటిజన్లు 7.50% వడ్డీ రేటు పొందొచ్చు. ఈ పథకం కూడా 2023 జూన్‌ 30 వరకు అందుబాటులో ఉంటుంది.

ఇండియన్‌ బ్యాంక్‌ స్పెషల్‌ ఎఫ్‌డీ

IND SHAKTI.. 555 రోజుల ఎఫ్‌డీ పథకం కింద ఇండియన్‌ బ్యాంక్.. సాధారణ డిపాజిటర్లకు 7.25% వడ్డీని అందిస్తోంది. అదే సీనియర్‌ సిటిజన్లకు 7.75% వడ్డీ ఇస్తోంది. సీనియర్‌ సిటిజన్లు 400 రోజుల కాలవ్యవధి ఎఫ్‌డీపై 8% వడ్డీని పొందొచ్చు. ఈ ప్లాన్‌లో కనీస పెట్టుబడి రూ.10,000. ఈ పథకం 2023 జూన్‌ 30న ముగుస్తుంది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ‘సీనియర్‌ సిటిజన్‌ కేర్‌’ ఎఫ్‌డీ

2020లో సీనియర్‌ సిటిజన్‌ కేర్‌ ఎఫ్‌డీని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ప్రారంభించింది. ఈ పథకం కింద రూ.5 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై సీనియర్‌ సిటిజన్లకు ఇచ్చే అదనపు వడ్డీ 0.50% గాక, అదనంగా మరో 0.25% వడ్డీని బ్యాంకు అందిస్తోంది. 5-10 సంవత్సరాల కాలానికి 7.75% వడ్డీ రేటును ఇస్తోంది. ఈ పథకం 2023 జులై 7న ముగుస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని