Investments: ఈ దీపావళి వేళ మన పెట్టుబడులు వెలగాలంటే..

ఇంట్లో చీకట్లు దూరమైనట్లు.. మన ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోయి సిరులు నిండాలని అందరూ కోరుకుంటారు. ఆలోచనలు ఉన్నంత మాత్రాన సరిపోదు. వాటిని ఆచరణలో పెట్టినప్పుడే అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు వీలవుతుంది.

Updated : 24 Oct 2022 11:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వెలుగుల పండుగ దీపావళి (Diwali)ని ఆనందంగా నిర్వహించుకునేందుకు అందరూ సిద్ధమయ్యారు. జీవితంలో చీకట్లని పారదోలి.. వెలుగు నింపాలని అందరూ ఈరోజు ఆ లక్ష్మీదేవిని ప్రార్థిస్తారు. అలాగే ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోయి.. ఏడాదంతా సిరిసంపదలు కురవాలని కోరుకుంటారు. మరి అలా అనుకుంటే సరిపోతుందా? అందుకు అనుగుణంగా మన పెట్టుబడుల (Investments) ప్రణాళిక ఉండాలి. అందుకే ఇప్పటి వరకు మనం చేసిన మదుపు ఎలాంటి రాబడినిచ్చింది? వాటిలో ఏమైనా మార్పులు చేయాలా? వంటి అంశాలను సమీక్షించుకోవడానికి ఈ శుభసమయం ఓ మంచి సందర్భం. ఈ ప్రక్రియలో ఉపయోగపడే కొన్ని సూత్రాలను పరిశీలిద్దాం..

50-50 రూల్‌..

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం స్థూల ఆర్థిక పరిస్థితులు చాలా అనిశ్చితిగా ఉన్నాయి. గతకొంత కాలంగా స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకుల్లో చలిస్తున్నాయి. ఈ తరుణంలో దేంట్లో పెట్టుబడులు పెట్టాలనే విషయంలో చాలా మంది గందరగోళానికి గురవుతున్నారు. ఇలాంటి సమయాల్లో 50 శాతం నగదును ఎప్పుడూ చేతిలో ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఉన్న డబ్బంతా ఎక్కడో ఒక చోట పెట్టుబడిగా పెడితే.. తర్వాత పరిస్థితులు మరింత ప్రతికూలంగా మారితే పెద్ద ఎత్తున నష్టపోవాల్సి రావొచ్చు. అందుకే ఉన్న దాంట్లో సగం చేతిలో ఉంచుకుంటే పరిస్థితులు చక్కబడుతున్న సంకేతాలు వెలువడుతుండగానే మదుపు చేసేందుకు అవకాశం ఉంటుందన్నది ఆర్థిక నిపుణుల సలహా. అలాగే మిగిలిన సగాన్ని మ్యూచువల్‌ ఫండ్లు.. కొంచెం నష్టభయాన్ని భరించగలిగే స్తోమత ఉంటే స్టాక్‌ మార్కెట్‌లో మదుపు చేయొచ్చని సూచిస్తున్నారు. అయితే, అన్ని అంశాల్ని అంచనా వేసి మార్కెట్‌పై కాస్తోకూస్తో అవగాహన ఉంటేనే వీటిలో పెట్టుబడి పెట్టాలంటున్నారు. లేదంటే ప్రస్తుతం ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీరేట్లు పెరుగుతున్న నేపథ్యంలో అలాంటి సురక్షిత మార్గాలనూ పరిశీలించొచ్చని సూచిస్తున్నారు.

ఈక్విటీల్లో అయితే.. 80-20 రూల్‌

మార్కెట్‌పై మంచి అవగాహన ఉండి.. ఎలాగైనా అక్కడే సంపద సృష్టించుకోవాలనుకునే మదుపర్లకు ఆర్థిక నిపుణులు 80-20 రూల్‌ పాటించాలని సూచిస్తున్నారు. మొత్తం పెట్టుబడిలో 80 శాతం మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టాలని చెబుతున్నారు. అదీ ఇండెక్స్‌, లార్జ్‌-క్యాప్‌, మిడ్‌-క్యాప్‌ కేటగిరీలను ఎంచుకోవాలంటున్నారు. మిగిలిన 20 శాతం నిధుల్ని నేరుగా స్టాక్స్‌లో మదుపు చేయాలని సలహా ఇస్తున్నారు. అదీ కంపెనీల ఫండమెంటల్స్‌ క్షుణ్నంగా అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవాలని చెబుతున్నారు.

10 పర్సెంట్‌ గోల్డెన్‌ రూల్‌..

మొత్తం పెట్టుబడుల్లో దాదాపు 5-10 శాతం బంగారానికి కేటాయించడం సురక్షితమని నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఆర్థికమాంద్యం లేదా ఇతర సంక్షోభ సమయాల్లో రక్షిస్తుందని చెబుతున్నారు. మాంద్యం తప్పదన్న విశ్లేషణలు బలపడుతున్న నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్లు దిద్దుబాటుకు గురయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అలాంటప్పుడు చాలా మంది సురక్షిత పెట్టుబడి మార్గమైన బంగారంలోకి పెట్టుబడుల్ని మళ్లిస్తారు. అప్పుడు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది.

అత్యవసరానికి సిద్ధంగా..

ప్రమాదం, అత్యవసరం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. అనుకోని ఖర్చులు వచ్చినప్పుడు తట్టుకునే విధంగా అత్యవసర నిధిని అందుబాటులో ఉంచుకోవాలి. కనీసం ఆరు నెలల ఖర్చులు, ఈఎంఐలకు సరిపడా మొత్తం ఈ నిధి రూపంలో ఉంచుకోవడం మేలు. దీన్ని పక్కన పెట్టిన తర్వాతే పెట్టుబడులపై ఆలోచించాలి.

(గమనిక: స్టాక్‌ మార్కెట్ లేదా దానితో సంబంధం ఉన్న మార్గాల్లో పెట్టుబడి పెట్టడం నష్టభయంతో కూడుకొన్న అంశం. వాటిలో మదుపు చేయడం పూర్తిగా మీ వ్యక్తిగత వ్యవహారం. పై సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని