Cyber Frauds: సైబ‌ర్ మోసాల నుంచి బ్యాంకు ఖాతాల‌ను ఎలా కాపాడుకోవాలి?

ఏదైనా సంస్థ‌ల‌ను సంప్ర‌దించ‌డానికి అధికారిక వెబ్‌సైట్‌ల‌ను ఉప‌యోగించండి.

Updated : 02 Aug 2022 16:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంట‌ర్నెట్‌ బ్యాంకింగ్‌, ఫోన్ బ్యాంకింగ్, ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు పెరిగి ప్ర‌జ‌ల‌కు ఆర్థిక కార్య‌క‌లాపాలు సుల‌భ‌త‌రంగా మారి జ‌నాల్లోకి ఎంత చొచ్చుకుని పోయేయో.. వీటిని అడ్డం పెట్టుకుని ఆన్‌లైన్ మోసాల‌కు పాల్ప‌డే సైబ‌ర్ మోస‌గాళ్లు కూడా అంత‌లా పెరిగారు. సైబ‌ర్ నేరాలు చేసేవారు మ‌రింత అధునాత‌నంగా మారుతున్నారు. ఖాతాదారుల బ్యాంక్ ఖాతాల నుంచి డ‌బ్బును దొంగిలించ‌డానికి కొత్త మార్గాల‌ను అన్వేషిస్తున్నారు. సైబ‌ర్ నేర‌గాళ్లు చేసే కొన్ని మోస‌పూరిత విధానాల‌ నుంచి కాపాడుకోవడానికి ఖాతాదారులు కూడా త‌మ బ్యాంకు ఖాతాల ప‌ట్ల మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాలి.

సైబ‌ర్ నేర‌గాళ్లు చేసే కొన్ని ముఖ్య‌మైన మోసాలు: ఈ సైబ‌ర్ నేర‌గాళ్లు ఇత‌ర రాష్ట్రాల నుండే కాకుండా ఇత‌ర దేశాల నుంచి కూడా క‌మ్యూనికేష‌న్ నెట్‌వ‌ర్క్ న‌డుపుతారు. ఈ నేర‌స్థులు వాళ్ల నెట్‌వ‌ర్క్ ద్వారా వినియోగ‌దారుల స్మార్ట్ ఫోన్ నెట్‌వ‌ర్క్‌ని త‌మ అధీనంలోకి తెచ్చుకుంటారు. ఉదాహ‌ర‌ణ‌కు, స‌మాచారాన్ని యాక్సెస్ చేయ‌డానికి, బ్యాంకు వినియోగ‌దారుల ఫోన్‌ను నియంత్రించ‌డానికి వాళ్ల‌కు అనుకూలించే మొబైల్ యాప్‌ల‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల‌ని రిక్వెస్ట్ చేస్తారు. ఆ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకుంటే ఆ స్మార్ట్ ఫోన్‌కు వ‌చ్చే స‌మాచారం అంతా ఈ సైబ‌ర్ నేర‌గాళ్ల నెట్‌వ‌ర్క్‌కి వెళుతుంది.

బ్యాంకు వినియోగ‌దారుల ర‌హ‌స్య స‌మాచారాన్ని దొంగిలించ‌డానికి వారు మీ కేవైసీ వివ‌రాల‌ను అప్‌డేట్ చేస్తున్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తూ వినియోగ‌దారుల చేత వారి బ్యాంక్ వివ‌రాలు తెలుసుకుంటారు. వివ‌రాలు తెల‌ప‌క‌పోతే బ్యాంకు ఖాతా ర‌ద్దు అవుతుంద‌ని, ఆర్థిక కార్య‌క‌లాపాలు ఆగిపోతాయ‌ని చెప్ప‌డం లేదా ఏ మాత్రం సంబంధం లేని అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల గురించి మాట్లాడుతూ వినియోగ‌దారుల కీల‌క స‌మాచారం తెలిపేలా ఒప్పిస్తారు.

మోస‌గాళ్లు.. బ్యాంక‌ర్లు, బీమా ఏజెంట్లు, హెల్త్‌కేర్, టెలికాం ఉద్యోగులు, ఆన్‌లైన్ ఫుడ్ యాప్ ఉద్యోగులు, ప్ర‌భుత్వ అధికారులుగా ప‌రిచ‌యం చేసుకుంటూ వినియోగ‌దారుల‌కు ఫోన్ కాల్స్ చేస్తుంటారు. వారు వినియోగ‌దారుల‌కు సేవ‌లందించే నెపంతో గోప్య‌మైన ఆధారాల‌ను (ఓటీపీ, సీవీవీ నంబ‌ర్లు) తెలియ‌జేయాల‌ని కోరుతుంటారు. కొన్ని సంద‌ర్భాల్లో బ్యాంకు ఖాతా నిలుపుద‌ల‌, ఇత‌ర విష‌యాలు ఉటంకిస్తూ స‌మాచారాన్ని అత్య‌వ‌స‌రంగా పంచుకోవాల‌ని వారు వినియోగ‌దారుల‌పై ఒత్తిడి తెస్తారు.

ఈ మోసాల నుంచి ర‌క్షించుకోవ‌డానికి వినియోగ‌దారులు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

ఓటీపీ, పిన్ నంబ‌ర్లు ఇత‌రుల‌తో పంచుకోవ‌ద్దు: ఓటీపీ, పిన్‌ షేర్ చేయ‌మ‌ని ఎవ‌రైనా అభ్య‌ర్థిస్తే వెంట‌నే అప్ర‌మ‌త్తం కండి. బ్యాంకు ఖాతాదారులు పిన్‌, ఓటీపీని ఎప్పుడూ ఇత‌రుల‌తో పంచుకోవ‌ద్దు. వినియోగ‌దారులు త‌మ బ్యాంకు ఖాతాలో డ‌బ్బును స్వీక‌రించ‌డానికి పిన్‌, ఓటీపీల‌ను ఇత‌రుల ఫోన్ సంభాష‌ణ‌ల‌లో పంచుకోవ‌ల్సిన అవ‌స‌రం లేదు. 

అనుమానాస్ప‌ద లింక్‌ల‌ను క్లిక్ చేయొద్దు: ఈ-మెయిల్స్‌లో గానీ, ఫోన్‌లో గానీ తెలియ‌ని లింక్‌ల‌ను క్లిక్ చేయ‌వ‌ద్దు. కొన్ని ఆఫ‌ర్‌లు చాలా మంచివిగా, ఆశ‌లు రేకెత్తించేవిగా ఉంటాయి. అవి నిజం కాక‌పోవ‌చ్చు. మీరు మునుపెన్న‌డూ చూడ‌ని ఆఫ‌ర్‌ల‌ను వాగ్దానం చేసే తెలియ‌ని లింక్‌ల‌ను క్లిక్ చేస్తే.. మిమ్మల్ని మోసానికి గురిచేసే ఫిషింగ్ వెబ్‌సైట్‌ల‌కు మ‌ళ్లించే అవ‌కాశం ఉంది.

స‌రైన క‌స్ట‌మ‌ర్ కేర్ ఫోన్ నెంబ‌ర్ల‌నే సంప్ర‌దించండి: ఏదైనా సంస్థ‌ల‌ను సంప్ర‌దించ‌డానికి అధికారిక వెబ్‌సైట్‌ల‌ను ఉప‌యోగించండి. మోస‌గాళ్లు త‌ర‌చుగా వినియోగ‌దారుల‌ను మోసం చేయ‌డానికి అస‌లు వెబ్‌సైట్‌కు పోలి ఉండే త‌ప్పుడు క‌స్ట‌మ‌ర్ కేర్ నంబ‌ర్‌ల‌ను ఆన్‌లైన్‌లో పెడ‌తారు. ఆ నంబ‌ర్‌కు వినియోగ‌దారులు కాల్ చేయ‌గానే వారు త‌మ బ్యాంకు/బీమా కంపెనీకి చెందిన నిజ‌మైన‌ ప్ర‌తినిధితో మాట్లాడుతున్నార‌ని న‌మ్మించేలా వ్య‌వ‌హ‌రించి వినియోగ‌దారుల‌ను మోసం చేస్తారు. కాబట్టి బ్యాంకు/బీమా కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించ‌డం ద్వారా ఈ సంప్ర‌దింపు ఫోన్ నంబ‌ర్‌ల‌ను మ‌ళ్లీ ధ్రువీక‌రించుకోవాలి. బ్యాంకు ముద్రించిన బ్రోచ‌ర్స్‌లో, డెబిట్‌, క్రెడిట్ కార్డ్‌ల‌లో క‌స్ట‌మ‌ర్ కేర్ ఫోన్ నంబ‌ర్‌లుంటాయి. వాటిని సంప్ర‌దించండి.

ఆక‌ర్షించే న‌కిలీ పోర్ట‌ల్స్ ప‌ట్ల జాగ్ర‌త్త అవ‌స‌రం: తెలియ‌ని జాబ్/ఇ-కామ‌ర్స్ పోర్ట‌ల్స్‌లో ఎప్పుడూ చెల్లింపులు చేయ‌వ‌ద్దు. రిజిస్ట్రేష‌న్ స‌మ‌యంలో త‌మ బ్యాంకు ఖాతా వివ‌రాలు, డెబిట్ కార్డ్‌, క్రెడిట్ కార్డ్ మొద‌లైన వాటిని పంచుకునే వినియోగ‌దారుల‌ను మోసం చేయ‌డానికి సైబ‌ర్ నేరస్థులు న‌కిలీ పోర్ట‌ళ్లను సృష్టిస్తారు. అటువంటి పోర్ట‌ల్స్ ప‌ట్ల జాగ్ర‌త్త వ‌హించండి. ఈ ప్లాట్‌ఫామ్స్‌లో మీ సుర‌క్షిత ఆధారాల‌ను పంచుకోవ‌ద్దు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని