Grand Cherokee: భారత్‌లో విడుదలైన సరికొత్త జీప్‌ గ్రాండ్‌ చెరోకీ.. ధర రూ.77 లక్షలు

జీప్‌ ఇండియా గత ఏడాదే సరికొత్త గ్రాండ్‌ చెరోకీని ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది. తాజాగా దీన్ని భారత్‌లో విడుదల చేసింది. దీని ధర రూ.77.50 లక్షలు.

Published : 17 Nov 2022 19:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జీప్‌ ఇండియా భారత్‌లో సరికొత్త గ్రాండ్‌ చెరోకీ ఎస్‌యూవీని గురువారం విడుదల చేసింది. దీని ధర రూ.77.50 లక్షలు. దీన్ని సెప్టెంబరు 2021లో ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించారు. తాజాగా భారత్‌లోకి అడుగుపెట్టింది. బయట, లోపల కారు డిజైన్‌ను గత వెర్షన్‌లతో పోలిస్తే కొత్తగా తీర్చిదిద్దారు. సాంకేతికంగా కూడా చాలా అప్‌డేట్లు ఉన్నాయి. గతంలో చెరోకీ మోడళ్లను అమెరికా నుంచి దిగుమతి చేసుకునేవారు. కానీ, ఈ కొత్త గ్రాండ్‌ చెరోకీని మాత్రం మహారాష్ట్రలోని రంజన్‌గావ్‌లో ఉన్న ప్లాంటులో తయారు చేయనున్నారు. ఇప్పటికే బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. వచ్చే నెల నుంచి వినియోగదారులకు అందించనున్నారు.

కారు డిజైన్‌ ప్రీమియం వేగనీర్‌, గ్రాండ్‌ వేగనీర్‌ను పోలి ఉండడం విశేషం. క్యాబిన్‌ క్యాప్రీ లెదర్‌లో తీర్చిదిద్దారు. యాక్టివ్‌ నాయిస్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ను అమర్చారు. పానరోమిక్‌ సన్‌రూఫ్‌, 10.1 అంగుళాల డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, వెంటిలేటెడ్‌ సీట్లు, క్లైమెట్‌ కంట్రోల్‌, ఆటో డిమ్మింగ్‌ మిర్రర్స్‌ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. అన్ని సీట్లకు త్రి-పాయింట్‌ సీట్‌బెల్ట్‌ను ప్రామాణికం చేశారు. ఈ కారు బీఎండబ్ల్యూ ఎక్స్‌5, ఆడీ క్యూ7, మెర్సిడెస్‌ బెంజ్‌ జీఎల్‌ఈ, రేంజ్‌రోవర్‌ స్పోర్ట్‌, వోల్వో ఎక్స్‌సీ90 వంటి కార్లకు పోటీ ఇవ్వనున్నట్లు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

భద్రతాపరమైన ఫీచర్ల విషయానికి వస్తే.. అడ్వాన్స్‌డ్‌ డ్రైవింగ్‌ అసిస్టెన్స్‌ ఫార్వర్డ్‌ కొలిజన్‌ వార్నింగ్‌, పెడెస్ట్రియన్‌ ఎమర్జెన్సీ బ్రేకింగ్‌, అడాప్టివ్‌ క్రూజ్‌ కంట్రోల్‌, బ్లైండ్‌ స్పాట్‌ అండ్‌ క్రాస్‌ పాత్‌ డిటెక్షన్‌, పాసివ్‌ పెడెస్ట్రియన్‌ ప్రొటెక్షన్‌, డ్రౌజీ డ్రైవర్‌ డిటెక్షన్‌, యాక్టివ్‌ లేన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌, ఇంటర్‌సెక్షన్‌ కొలిజన్‌ అసిస్ట్‌ సిస్టమ్‌ సహా మొత్తం 110కి పైగా భద్రతా ఫీచర్లను జతచేసినట్లు కంపెనీ తెలిపింది. 2 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌తో వస్తున్న ఈ కారు 270 హెచ్‌పీ శక్తిని, 400 ఎన్‌ఎం టార్క్‌ని విడుదల చేస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని