Microsoft Designer: ఏఐతో మైక్రోసాఫ్ట్ డిజైనర్‌ టూల్‌.. పూర్తిగా ఉచితం!

బర్త్‌డే పోస్టర్స్‌, ప్రజెంటేషన్స్‌, డిజిటల్‌ పోస్ట్‌కార్డ్స్, ఇన్విటేషన్లు, సోషల్‌ మీడియా పోస్టర్లు, గ్రాఫిక్‌ డిజైన్స్‌, ఇమేజ్‌ క్రియేషన్‌ వంటి వాటిని సులువుగా డిజైన్‌ చేసేందుకు మైక్రోసాఫ్ట్‌ డిజైనర్‌ (Microsoft Designer) పేరుతో కొత్త టూల్‌ అందుబాటులోకి వచ్చింది.

Published : 30 Apr 2023 22:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫ్రెండ్‌ పుట్టినరోజు అనే విషయం సడెన్‌గా గుర్తొచ్చింది. మంచి ఫొటో డిజైన్‌తో శుభాకాంక్షలు చెబుదామంటే.. డిజైన్‌ చేసేంత సమయం లేదు. ఏం చేయాలా అని ఆలోచిస్తే.. ఆన్‌లైన్‌ డిజైనింగ్ టూల్స్‌ గుర్తొచ్చాయి. కానీ, వాటిలో మనకి నచ్చినట్లుగా డిజైన్‌ టెంప్లెట్‌లో మార్పులు చేసుకునే అవకాశం ఉండదు. ఏవో చిన్న చిన్న మార్పులు మినహా మొత్తంగా అందులో మార్పులు చేయడం సాధ్యంకాదు. ఈ సమస్యకు పరిష్కారంగానే మైక్రోసాఫ్ట్ (Microsoft) సంస్థ కొత్త డిజైనర్‌ టూల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మైక్రోసాఫ్ట్ డిజైనర్‌ (Microsoft Designer) పేరుతో వెబ్‌ టూల్‌ను పరిచయం చేసింది. ఇది కృత్రిమ మేధ ఆధారంగా పనిచేస్తుంది. యూజర్లు ఇది పూర్తిగా ఉచితం. 

  • గతేడాది అక్టోబరులోనే ఈ టూల్‌ గురించి మైక్రోసాఫ్ట్ ప్రకటన చేసింది. తాజాగా యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో పోస్టర్స్‌, ప్రజెంటేషన్స్‌, డిజిటల్‌ పోస్ట్‌కార్డ్స్, ఇన్విటేషన్లు, సోషల్‌ మీడియా పోస్టర్లు, గ్రాఫిక్‌ డిజైన్స్‌, ఇమేజ్‌ క్రియేషన్‌ వంటివి సులువుగా చేయొచ్చు.
  • ఇందులో ఓపెన్‌ఏఐ (OpenAI) టెక్స్ట్‌-టు-ఇమేజ్‌ యాప్‌ డాల్‌-ఈ2 (DALL-E2) ఫీచర్స్‌ ఉన్నాయి. టెక్స్ట్‌ రూపంలో ఇచ్చిన సూచనల ఆధారంగా ఇమేజ్‌ను రూపొందించడం డాల్‌-ఈ2 యాప్‌ ప్రత్యేకత. 
  • ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ డిజైనర్‌ టూల్‌ వెబ్‌ వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. బ్రౌజర్‌లో మైక్రోసాఫ్ట్ డిజైనర్‌ అని టైప్‌ చేస్తే టూల్‌ వెబ్‌పేజ్‌ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్‌ చేస్తే కుడివైపు పైభాగంలో ఉచిత వెర్షన్ ప్రయత్నించాలని కోరుతుంది. 
  • మైక్రోసాఫ్ట్ ఖాతా వివరాలు నమోదుచేసి లాగిన్ చేయాలి. తర్వాత మీరు దేని కోసం డిజిటల్‌ కార్డు క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ అంశానికి సంబంధించిన టెక్స్ట్‌ను డిజైనర్‌ పేజీ సెర్చ్‌ బార్‌లో టైప్‌ చేయాలి. 
  • ఉదాహరణకు మీరు స్నేహితుడికి శుభాకాంక్షలు చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టర్‌ డిజైన్‌ చేయాలనుకున్నారు. హ్యాపి బర్త్‌డే పోస్ట్‌ ఫర్‌ ఫ్రెండ్‌ అని టైప్‌ చేయాలి. తర్వాత సెర్చ్‌ బార్‌ కింద ఏఐ ఆధారంగా డిజైన్‌ చేసిన కొన్ని ఇమేజ్‌లను చూపిస్తుంది. 
  • వాటిలో నచ్చిన డిజైన్‌ను ఎంపిక చేసుకుని బ్యాక్‌గ్రౌండ్ కలర్‌, ఫొటో, టెక్ట్స్‌లో మార్పులు చేయొచ్చు. వాటిని ఇమేజ్‌పై ఎక్కడికైనా మార్చుకోవచ్చు. ఒకవేళ ఎలాంటి టెక్స్ట్‌, కలర్స్‌ ఎంచుకోవాలనే దానిపై అవగాహన లేకపోతే.. పక్కనే ఐడియాస్‌ పేరుతో డిజైనర్‌ కొన్ని సూచనలు చేస్తుంది.
  • అలానే వాటి సాయంతో ఇమేజ్‌ డిజైన్‌ పూర్తి చేసి.. దాన్ని నేరుగా ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, లింక్డ్‌ఇన్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేయొచ్చు. త్వరలో ఇందులో మరిన్ని ఫీచర్స్‌ అందుబాటులోకి తీసుకొస్తామని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని