Home Buying: ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Home buying guide: ఇల్లు కొనుగోలు పెద్ద మొత్తంతో కూడుకున్న వ్యవహారం. ఇలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకునేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

Published : 29 Jan 2024 17:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లో రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడి ఉత్తమ పెట్టుబడి మార్గాల్లో ఒకటి. సొంత ఇల్లు ఉండడం అనేది అందరికీ ఏదో ఒక సమయంలో అవసరమే. ప్రస్తుత కాలంలో ఇంటిని కొనుగోలు చేయడం, నిర్మించడం అనేది ఎంత కష్టసాధ్యమో మనందరికీ తెలిసిందే. కాబట్టి, మన అవసరాలకు సరిపోయే ఇంటినే కొనుగోలు చేయాలి. అలాగే, ప్రాపర్టీ కొనుగోలు సమయంలో అడుగడుగునా జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం. కాబట్టి, ఇంటి కొనుగోలుకు ముందే దానికి సంబంధించిన అన్ని విషయాలను సమగ్రంగా తెలుసుకోవాలి. 

బడ్జెట్‌

ఇంటికి సంబంధించిన కీలకమైన విషయాల్లో బడ్జెట్‌ చాలా ప్రధానమైనది. చాలా మందికి ఇంటికి సంబంధించిన అవసరాలు ఎక్కువే ఉంటాయి. కానీ, వారి బడ్జెట్‌ సహకరించకపోవచ్చు. ఎందుకంటే ఇల్లు ఎవరికైనా వారి జీవితంలో అత్యంత పెద్ద ఆస్తే కాకుండా ఎక్కువ ఖర్చు పెట్టించేది కూడా. అందుచేత ఇంటి బడ్జెట్‌ విషయంలో ప్రణాళికగా వ్యవహరించాలి. దూరమైనా సరే మీ బడ్జెట్‌ పరిమితిలోపు మంచి ఇంటిని వెతుక్కోవడం మంచిది. ఇంటి కొనుగోలు నిర్ణయం తీసుకున్నప్పుడు అనవసరపు ఖర్చులను చాలావరకు తగ్గించుకోవాలి. మీ ఇంటికి ఖర్చుపెట్టే బడ్జెట్‌ను ముందుగా నిర్ణయించుకుని దానికి కట్టుబడి ఉంటే ఇల్లు ఆస్తిగా మిగులుతుంది.

సరైన ప్రదేశం

ప్రస్తుతం ఇంటిలో ఉండే మెజారిటీ సభ్యులు.. చదువు, ఉపాధి నిమిత్తం బయట ప్రాంతాలకు వెళ్లి వస్తుంటారు. కాబట్టి, ఇంటిలో నివసించేవారందరూ వేగంగా బయటకు వెళ్లి, అదే విధంగా ఇంటికి రాగలిగేలా ఉండాలి. రోడ్డు యాక్సెస్‌, అన్ని రకాల రవాణా సౌకర్యాలు, స్కూల్స్‌, మార్కెట్స్‌ ఇంటికి దగ్గర్లోనే ఉండడం అదనపు ప్రయోజనం అని చెప్పవచ్చు. దీనివల్ల ఇల్లు సౌకర్యంగా ఉండడమే కాకుండా, భవిష్యత్‌లో ఇంటి విలువ అధికంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇంటిని కొనుగోలు చేసేముందు కొన్ని సంవత్సరాల్లో అభివృద్ధి చెందే అవకాశం ఉన్న ప్రాంతాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి వృద్ధిని అంచనా వేయాలి.

వసతులు

ఏ ఇంటికైనా నీటి వసతి, విద్యుత్‌ కీలకమైంది. అవి సరిగ్గా లేన్నప్పుడు.. విశాలంగా ఉన్న ఇల్లు కూడా సౌకర్యాన్ని ఇవ్వదు. పుష్కలంగా నీటి వసతి, పవర్‌ బ్యాకప్‌ సౌకర్యాలు ఉన్న ఇంటిని మాత్రమే కొనుగోలు చేయడం మంచిది. ప్రస్తుతం ప్రతి కుటుంబం సౌలభ్యం మేరకు తగిన మోటారు వాహనాలను కలిగి ఉంటోంది. కాబట్టి, ఇంటిని ఎంచుకునే సమయంలో తగినంత పార్కింగ్‌ కూడా చూసుకోవాలి. రెసిడెన్షియల్‌ సొసైటీలో ఫ్లాట్‌ను ఎంచుకుంటే పార్కింగ్‌ సౌకర్యం డీల్‌లో భాగంగా వస్తుంది. మీ అవసరం, బడ్జెట్‌ను బట్టి అదనపు పార్కింగ్‌ స్థలాన్ని కొనుగోలు చేయొచ్చు. కొన్ని ఇండిపెండెంట్‌ ఇళ్లకు పార్కింగ్‌ సమస్యగా ఉంటుంది. కాబట్టి ఇల్లు కొనుగోలు చేసే ముందు పార్కింగ్‌ గురించి విచారణ చేయాలి.

నిర్మాణ స్థితి

ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు నిర్మాణంలో ఉన్న ఇంటిని తీసుకోవాలా? లేదా సిద్ధంగా ఉన్న ఇంటిని తీసుకోవాలా? అనేది ముందే నిర్ణయించుకోవాలి. ఈ రెండింటి విషయంలో దేని సౌలభ్యం దానికే ఉంటుంది. నిర్మాణంలో ఇంటిని కొనుగోలు చేస్తే.. మనకు అనుకూలించే కొన్ని నిర్ణయాలు తీసుకుని నిర్మాణంలో మార్పులు చేయించుకోవచ్చు. అదే పూర్తయిన ఇంటిని కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంటే.. ఇంటికి ఉండే అదనపు ఆకర్షణలు, లోటుపాట్లు వెంటనే తెలిసిపోతాయి. దీంతో ఆ ఇంటిని కొనుగోలు చేయాలా? వద్దా? అనే నిర్ణయం అప్పటికప్పుడు తీసుకోవచ్చు. పూర్తిగా నిర్మాణం అయిన ఇంటికి జీఎస్‌టీ కూడా ఉండదు. ఇది ఆర్థికంగా లాభించే విషయం.

డెవలపర్‌ విశ్వసనీయత

ఇంటి కొనుగోలు నిర్ణయం తీసుకునే ముందు, డెవలపర్‌ విశ్వసనీయతను అంచనా వేయడం చాలా ముఖ్యం. వేర్వేరు బిల్డర్ల నిర్మాణ నాణ్యత సహా గత ప్రాజెక్టులను పరిశోధించాలి. వీరి వద్ద ఇంతకు ముందు కొనుగోలు చేసిన ఇంటి యాజమానులను విచారించడం వల్ల డెవలపర్‌పై ఒక అంచనాకు రావచ్చు. సాధారణంగా బిల్డర్లు ప్రాజెక్ట్‌లను ఆలస్యం చేస్తుంటారు. అటువంటి సందర్భంలో జరిమానాలు కట్టిన చరిత్ర ఉందో లేదో తనిఖీ చేయండి. ప్రాజెక్ట్‌ల్లో వారి ట్రాక్‌ రికార్డును పరిశీలించండి. ఇంటికి కొద్ది మొత్తం ఎక్కువైనా సరే మార్కెట్‌లో ‘గుడ్‌విల్‌’ ఉన్న బిల్డర్‌నే సంప్రదించడం మంచిది.

RERA ఆమోదం

మీరు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్న ప్రాజెక్ట్‌కు RERA రిజిస్ట్రేషన్‌ ఉంటే మంచిది. వెబ్‌సైట్‌లో దాని RERA (రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ) ఆమోద స్థితిని నిర్థారించండి. నిర్మాణ ప్రకటనలలో కూడా RERA నంబర్‌ ఉండాలి. RERA తన వెబ్‌సైట్‌లో చాలా సమాచారాన్ని అందిస్తుంది. డెవలపర్‌ సమాచారం, ప్రాజెక్ట్‌ స్థితితో సహా ముఖ్యమైన వివరాలను యాక్సెస్‌ చేయొచ్చు. ఇందులో రిజిష్టర్‌ అయిన డెవలపర్లు ప్రతి త్రైమాసిక వ్యవధిలో నిర్మాణ పురోగతిని అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్‌ నివేదికలను అప్‌లోడ్‌ చేయకపోతే డెవలపర్లకు పెనాల్టీ తప్పదు. దీనివల్ల కొనుగోలుదారులకు పారదర్శకత, భద్రత లభిస్తుంది. 

అదనపు ఖర్చులు

ఆస్తి విలువ మాత్రమే కాకుండా రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు, స్టాంప్‌ డ్యూటీని కూడా చెల్లించాలి. రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు ఏరియాను బట్టి మారుతూ ఉంటాయి. మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న లొకేషన్‌ ఆధారంగా ఎంత చెల్లించాలో తెలుసుకోండి. ఆస్తి కొనుగోలు విషయంలో నిపుణుల సాయం తీసుకోవడం చాలా మంచిది. ఇది చాలా అవాంతరాలను నివారించడానికి, సమయాన్ని ఆదా చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనికి గాను రియల్‌ ఎస్టేట్‌ ఏజెన్సీకి, ల్యాండ్‌ సర్వేయర్‌, హోమ్‌ ఇన్‌స్పెక్టర్‌లకు కొద్ది మొత్తాన్ని చెల్లించాలి. అంతేకాకుండా ఆస్తి కొనుగోలులో అనేక న్యాయ సంబంధిత అంశాలు ఉంటాయి. ప్రాపర్టీ కొనుగోలుకు అవసరమైన అన్ని చట్టాల గురించి తెలుసుకోవాలి. దీనికి గానూ నోటరీలకు, లాయర్లు వంటి నిపుణులకు కూడా డబ్బు చెల్లించాలి. నిర్మాణంలో ఉన్న ఇంటికి జీఎస్‌టీని చెల్లించాలి. యూనిట్‌ ధర రూ.45 లక్షలు లోపు ఉంటే 1%, రూ.45 లక్షలు దాటితే 5 శాతాన్ని చెల్లించాలి. ఆస్తి యాజమానిగా ప్రతి ఏడాది ప్రాపర్టీ ట్యాక్స్‌ చెల్లించాలి.

సేల్‌ డీడ్‌

ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు ఇది చాలా ముఖ్యమైన పత్రం. ఇది ఆస్తి యాజమాన్యానికి సంబంధించిన బదిలీని స్పష్టంగా పేర్కొంటూ విక్రేత ద్వారా కొనుగోలుదారుడికి బదిలీ అవుతుంది. ఈ ఫార్మాలిటీ పూర్తయిన తర్వాత కొనుగోలుదారుడు ఆస్తికి చట్టపరమైన యజమాని అవుతారు. ఈ పత్రం సబ్‌-రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ వద్ద నమోదవుతుంది. హోమ్‌లోన్‌ తీసుకునేటప్పుడు, రీ-సేల్‌ సమయంలో ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి దాన్ని సురక్షితంగా భద్రపరచాలి.

చివరిగా: ఇంటి (ఆస్తి)ని కొనుగోలు చేసేటప్పుడు ఆర్థికపరమైన అంశాలే కాకుండా, అనేక చట్టపరమైన అంశాలు కూడా ఉంటాయి. కొనుగోలుకు సంబంధించి రియల్‌ ఎస్టేట్‌ రంగ నిపుణులు, ఇలాంటి ఆస్తులను కొనుగోలు చేసినవారి నుంచి సలహాలను పొందడం చాలా మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని