TV on mobile: సెల్‌ఫోన్‌లోనే టీవీ.. ఈ సంస్థలెందుకు వ్యతిరేకిస్తున్నాయ్‌?

Live TV on mobile: మొబైల్‌లోనే టీవీ ప్రసారాలు అందించేందుకు ఉద్దేశించిన టెక్నాలజీపై పరిశ్రమ వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇందుకు ఆయా కంపెనీలు వివిధ కారణాలు చూపుతున్నాయి.

Published : 15 Nov 2023 14:14 IST

Live TV on mobile | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎఫ్‌ఎం రేడియో తరహాలో మొబైల్‌లోనే నేరుగా లైవ్‌ టీవీ ప్రసారాలను అందించే ఆలోచనకు ఆదిలోనే హంసపాదు ఎదురవుతోంది. డేటాతో పనిలేకుండా డీటీహెచ్‌ తరహాలో లైవ్‌ టీవీని నేరుగా మొబైల్‌లో అందించే విషయంలో పరిశ్రమ వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొత్త టెక్నాలజీ వల్ల మొబైల్‌ తయారీ ధర పెరుగుతుందని, తయారీలో ఆటంకాలు ఎదురవుతాయని మొబైల్‌ తయారీ సంస్థలు, చిప్‌ సెట్‌ సంస్థలు పేర్కొంటున్నాయి. టెలికాం సంస్థలూ ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాయి.

దేశంలో ఇప్పటికే టీవీ ఛానెళ్లను మొబైల్‌ ద్వారా వీక్షిస్తున్నారు. ఇందుకోసం కొన్ని యాప్‌లు, మొబైల్‌ డేటా లేదా బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్‌ అవసరం అవుతోంది. అలా కాకుండా అన్నిరకాల టీవీ కార్యక్రమాలనూ నేరుగా సెల్‌ఫోన్‌కే ప్రసారం చేసేలా కొత్త విధానం తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇది దాదాపు ఎఫ్‌ఎం రేడియోలాగే పనిచేస్తుంది. మొబైల్‌లో రేడియో ఫ్రీక్వెన్సీని అందుకునేందుకు ఒక రిసీవర్‌ ఉంటుంది. బ్రాడ్‌బ్యాండ్‌, బ్రాడ్‌కాస్ట్‌ సాంకేతికతలను కలిపి మొబైల్‌ ఫోన్లలో డిజిటల్‌ టీవీ కార్యక్రమాలు అందుకునేలా చేస్తారు. తద్వారా స్మార్ట్‌ఫోన్లకు మల్టీమీడియా కంటెంట్‌ నేరుగా వస్తుంది. ఇప్పటికే ఐఐటీ కాన్పుర్‌, శాంఖ్య ల్యాబ్స్‌ కలిసి కాన్సెప్ట్‌ను సిద్ధం చేశాయి. 

‘WFH అనుమతిస్తున్న కంపెనీల ఆదాయాలే వేగంగా పెరుగుతున్నాయ్‌

దేశంలో టీవీతో పోలిస్తే మొబైల్‌ను వినియోగించే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దేశంలో ప్రస్తుతం 21 కోట్ల టీవీలు ఉంటే.. 80 కోట్ల వరకు స్మార్ట్‌ ఫోన్లు ఉన్నాయి. ఈ సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. టీవీని మొబైల్‌లో ఇవ్వడం ద్వారా టీవీ ప్రసారాలను ప్రజలకు మరింత చేరువ చేయొచ్చన్నది ప్రభుత్వ ఆలోచన. పైగా విద్య అవసరాలు, ఇతర ఎమర్జెన్సీ సమయాల్లో దీన్ని వినియోగించుకోవాలన్నది ప్రభుత్వం యోచిస్తోంది. ఇది ఇంకా కాన్సెప్ట్‌ దశలోనే ఉంది. అమెరికా, దక్షిణ కొరియా వంటి దేశాల్లో సపోర్ట్ చేసే డివైజ్‌ల లేకపోవడం వల్ల పరిమితంగానే ఈ ప్రసారాలు జరుగుతున్నాయి.

దీనిపై టెలికాం విభాగానికి చెందిన టెలీ కమ్యూనికేషన్స్‌ ఇంజినీరింగ్‌ సెంటర్‌.. భాగస్వామ్య పక్షాల నుంచి అభిప్రాయాలు సేకరిస్తోంది. ఈ క్రమంలోనే శాంసంగ్‌, నోకియా, ఎరిక్సన్‌, టెలికాం కంపెనీలతో కూడిన సెల్యులర్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌, మొబైల్స్‌ తయారుచేసే సెల్యులర్‌, ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌ వంటివి తమ అభిప్రాయాలను తెలియజేశాయి. టీవీ సిగ్నల్స్‌ అందుకొనేలా చేయాలంటే స్మార్ట్‌ఫోన్లలో ప్రత్యేక హార్డ్‌వేర్‌ అవసరం అవుతుందని, ఇందుకోసం ATSC 3.0 టెక్నాలజీ అవసరం అని శాంసంగ్‌, క్వాల్‌కామ్‌, నోకియా, ఎరిక్సన్‌ ఇటీవల ఓ లేఖలో పేర్కొన్నాయి. ప్రస్తుతం భారత్‌లోఉన్న స్మార్ట్‌ఫోన్లలో ఈ టెక్నాలజీ లేదని, దీన్ని డివైజుల్లో అమర్చాలంటే వాటి ధర పెరుగుతుందని చెబుతున్నాయి.

‘అలాంటి వలలో పడొద్దు.. ‘పిగ్‌ బుచరింగ్ స్కామ్స్‌’పై నితిన్‌ కామత్‌ టిప్స్‌..!

ATSC 3.0 విధానం ప్రపంచవ్యాప్తంగా పెద్దగా ఆదరణకు నోచుకోలేదని టెలికాం సంస్థలు పేర్కొంటున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లో ఇప్పటికే పెద్ద మొత్తంలో వీడియో కంటెంట్‌ లభిస్తోందని, ఈ సమయంలో టీవీ కంటెంట్‌ను మొబైల్‌లో ప్రసారం చేయడం వల్ల వినియోగదారుల నుంచి ఆశించిన స్థాయిలో డిమాండ్‌ లభించకపోవచ్చని పేర్కొన్నాయి. ATSC 3.0 వల్ల మొబైల్‌ తయారీపై ప్రభావం పడుతుందని తయారీదారుల అసోసియేషన్‌ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా పెద్దగా అమలుకు నోచుకుని టెక్నాలజీని అందిపుచ్చుకోవడం వల్ల మొబైల్‌ ఖరీదు అమాంతం పెరుగుతుందని అభిప్రాయపడింది. ప్రస్తుతం ఈ తరహా టెక్నాలజీ కలిగిన మొబైల్స్‌ ఏవీ భారత్‌లో అందుబాటులో లేవని పేర్కొంది. అయితే, టీవీని డేటాతో సంబంధం లేకుండా ప్రసారం చేయడం వల్ల టెలికాం కంపెనీల డేటా రెవెన్యూపై ప్రభావం పడుతుందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని