Used Cars: సెకండ్‌ హ్యాండ్‌ కారుకు మంచి ధర రావాలంటే..

Used Cars: వాడిన కారును ఎప్పుడు విక్రయించాలో తెలియకపోతే మంచి ధర పొందడం సాధ్యం కాదు. అందుకే మంచి ధర పలకాలంటే సెకండ్‌ హ్యాండ్‌ కారును ఎప్పుడు అమ్మకానికి ఉంచాలో చూద్దాం..

Updated : 08 Apr 2023 12:18 IST

Used Car Sale | ఇంటర్నెట్‌ డెస్క్‌: కారు కొనేటప్పుడు కొంతమంది దీర్ఘకాల లక్ష్యంతో తీసుకుంటారు. కొంత మంది కొన్నాళ్లు వాడి.. మార్కెట్‌లోకి కొత్త మోడల్‌ రాగానే మార్చాలనే ఉద్దేశంతో ఉంటారు. ఏదేమైనా.. వాడిన కారును ఎప్పుడు విక్రయించాలో తెలియకపోతే మంచి ధర పొందడం సాధ్యం కాదు. అందుకే మంచి ధర పలకాలంటే సెకండ్‌ హ్యాండ్‌ కారును ఎప్పుడు అమ్మకానికి ఉంచాలో చూద్దాం..

నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉన్నప్పుడు..

కారు కొన్న తర్వాత 4-5 ఏళ్ల లోపు విక్రయిస్తే మంచి ధర వస్తుందని నిపుణులు చెబుతుంటారు. లేదా లక్ష కి.మీల కన్నా తక్కువ తిరిగిన వాహనాన్ని విక్రయానికి ఉంచడం మేలని వారు సూచిస్తుంటారు. లోన్‌పై కారు తీసుకున్నవాళ్లైతే.. అది తీరిన తర్వాత విక్రయించడం మేలు.

ఇంకా సులభంగా చెప్పాలంటే.. ఒకసారి కారుకి ప్రస్తుతం మార్కెట్‌లో ఎంత ధర పలుకుతుందో కనుక్కోండి. వచ్చే ఆరు నెలల్లో రాబోయే ఖర్చులు, నిర్వహణ వ్యయాలకు ఎంతవుతుందో అంచనా వేయండి. ఈ రెండు కలిపితే వచ్చే మొత్తం మీరు కారు కొన్న ధర కంటే ఎక్కువైతే ఇక దాన్ని వదిలించుకోవడమే ఉత్తమం.

రీసేల్‌ విలువ ఎక్కువున్నప్పుడే..

సాధారణంగా కారు కొన్న 4-5 ఏళ్ల తర్వాత దాని విలువ 50 శాతానికి పడిపోతుంది. ఆ తర్వాత పెద్దగా ధర రావడానికి అవకాశం ఉండదు. సెకండ్‌ హ్యాండ్‌ కారు కొనాలనుకునేవారు 50- 60 వేల కి.మీల కంటే ఎక్కువ తిరిగినవాటిని అంతగా ఇష్టపడరు. అలాగే 4-5 ఏళ్లు గడిచిన కార్లనూ తీసుకోరు. ఎందుకంటే నిర్వహణ ఖర్చులు భారంగా మారతాయి.

వినియోగం తగ్గితే..

కొవిడ్‌ తర్వాత చాలా మంది ఇంటి నుంచే పని చేస్తున్నారు. దీంతో వాహనాల వినియోగం తగ్గిపోయింది. లేదా ఇతర కారణాల వల్లైనా కార్లను ఉపయోగించడం తగ్గించి ఉండొచ్చు. అలాంటప్పుడు కారు ఊరికే ఇంట్లో ఉన్నా.. సమయం గడుస్తున్న కొద్దీ దాని విలువ పడిపోతూనే ఉంటుంది. అలాంటి సమయంలో కారును విక్రయించడమే మేలు.

మీ స్తోమత తగ్గిపోతే..

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగిపోయాయి. దీంతో ఇతర నిత్యావసరాల ఖర్చులూ ఎగబాకాయి. మరి అందుకనుగుణంగా మీ వేతనం పెరిగిందా? లేదంటే కారు నిర్వహణ మీకు ఆర్థికంగా భారం కావొచ్చు. అలాంటప్పుడు మరింత మెరుగైన మైలేజ్ ఇచ్చే కారును కొనడానికి ప్రయత్నించాలి. లేదా సీఎన్‌జీ, విద్యుత్‌ కార్లనైనా కొనొచ్చు. వీటిపై రాయితీ, ప్రోత్సాహకాలూ లభించే అవకాశం ఉంది.

తుక్కుకు పంపేయండి..

స్వచ్ఛంద వాహన తుక్కు విధానం గత ఏడాది ఏప్రిల్‌ నుంచి అమల్లోకి వచ్చింది. 20 ఏళ్ల తర్వాత వ్యక్తిగత వాహనాలు; 15 ఏళ్ల తర్వాత వాణిజ్య వాహనాలకు సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తారు. దీంట్లో విఫలమైతే వాటిని తుక్కుగా మార్చాలని ప్రభుత్వం పేర్కొంది. ఒకవేళ మీ కారు ఆ గడువు దాటి ఉంటే.. దాన్ని తుక్కు కేంద్రాల్లో అప్పగించి సర్టిఫికెట్‌ తీసుకోవాలి. కొత్త వాహనం కొనుగోలు సమయంలో దీన్ని సమర్పిస్తే ఐదు శాతం రాయితీ లభిస్తుంది.

ఎలా విక్రయిస్తే మేలు..

డీలర్లు, తయారీదార్లకే నేరుగా కార్లను విక్రయించే వెసులుబాటు ఉంటుంది. తెలిసిన మెకానిక్‌లు, సోషల్‌ మీడియా ద్వారా కూడా అమ్మకానికి పెట్టొచ్చు. ఆన్‌లైన్‌ వేదికగా కార్లను విక్రయించి పెట్టే వేదికలు చాలా ఉన్నాయి. వాళ్లకి చాలా మంది డీలర్లు అనుసంధానమై ఉంటారు. వాళ్లే మీ కారుని క్షుణ్నంగా తనిఖీ చేసి విలువ కడతారు. చట్టపరమైన డాక్యుమెంటేషన్‌ కూడా పూర్తి చేస్తారు. పైగా ఆన్‌లైన్‌లో వివిధ కంపెనీలు ఎంత ధర ఆఫర్‌ చేస్తాయో ముందే తెలుసుకొని పోల్చుకోవచ్చు.

ప్రయోజనాలనూ బదిలీ చేయాలి..

కారు విక్రయించిన తర్వాత దానిపై ఉండే అన్ని ప్రయోజనాలను కొనుగోలు చేసిన వారికి బదిలీ చేయాలి. రిజిస్ట్రేషన్‌ సైతం వారి పేరు మీదకు మార్చాలి. ఇన్సూరెన్స్‌ సదుపాయాన్ని కూడా బదిలీ చేయాలి. లేదంటే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా అది మీ మీదకు వచ్చే ప్రమాదం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని