Kitchen Tips : పాత్రలపై పసుపు మరకలు వదలాలంటే..!

మనం తయారుచేసే ప్రతి కూరలోనూ పసుపు వేయడం సహజం. ఈ క్రమంలో కొన్నాళ్లకు ఆ పాత్ర లోపలి వైపు పసుపు పచ్చగా మారిపోవడం, తద్వారా అది జిడ్డుగా మారి మెరుపు కోల్పోవడం.. వంటివి గమనిస్తుంటాం. ఇక ఈ మరకలు స్టీల్‌ స్క్రబ్బర్‌తో....

Published : 06 Jun 2023 21:20 IST

మనం తయారుచేసే ప్రతి కూరలోనూ పసుపు వేయడం సహజం. ఈ క్రమంలో కొన్నాళ్లకు ఆ పాత్ర లోపలి వైపు పసుపు పచ్చగా మారిపోవడం, తద్వారా అది జిడ్డుగా మారి మెరుపు కోల్పోవడం.. వంటివి గమనిస్తుంటాం. ఇక ఈ మరకలు స్టీల్‌ స్క్రబ్బర్‌తో ఎంత రుద్దిగా ఓ పట్టాన వదలవు. మరి, ఇలాంటి మొండి మరకల్ని తొలగించాలంటే.. కొన్ని ఇంటి చిట్కాలు ఉపయోగపడతాయంటున్నారు నిపుణులు.

రెండు కప్పుల నీటికి, పావు కప్పు గ్లిజరిన్‌, మరో పావు కప్పు లిక్విడ్‌ సోప్‌ను జతచేసి మిశ్రమంగా తయారుచేసుకోవాలి. ఇందులో ఒక క్లాత్‌ ముంచి.. దాంతో పసుపు మరక ఉన్న పాత్ర లోపలి భాగంలో ఈ మిశ్రమాన్ని పూయాలి. పావుగంట తర్వాత డిష్‌వాషింగ్‌ లిక్విడ్‌తో ఒకసారి రుద్ది వేడి నీటితో శుభ్రం చేస్తే మరక వదిలిపోతుంది.

నిమ్మలోని ఆమ్ల గుణాలకు ఎలాంటి మరకనైనా తొలగించే శక్తి ఉంటుంది. అందుకే దీన్ని న్యాచురల్‌ క్లీనర్‌గా పరిగణిస్తాం. రెండు వంతుల వేడి నీటికి, ఒక వంతు నిమ్మరసం కలిపి.. ఈ మిశ్రమాన్ని పసుపు మరక ఉన్న పాత్రలో నింపాలి. రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే అన్ని గిన్నెలతో పాటు సాధారణంగా శుభ్రం చేస్తే సరిపోతుంది. ఇక్కడ నిమ్మరసానికి బదులు వెనిగర్‌ కూడా వాడచ్చు.

బేకింగ్‌ సోడాలో కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. దీన్ని పసుపు మరకలున్న పాత్రలోపలి వైపు పూయాలి. అరగంట తర్వాత స్క్రబ్బర్‌తో రుద్ది సాధారణ డిష్‌వాష్‌ లిక్విడ్‌తో శుభ్రం చేస్తే మరక వదిలిపోతుంది.

హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌తోనూ పాత్రలపై పడిన పసుపు మరకల్ని తొలగించచ్చు. ఈ క్రమంలో మరక ఉన్న చోట కొన్ని చుక్కల ఈ ద్రావణాన్ని వేసి.. పావుగంట పాటు పక్కన పెట్టేయాలి. ఆపై సాధారణంగా కడిగేస్తే ఫలితం ఉంటుంది.

పసుపు మరకలున్న పాత్రల్లో బ్లీచ్‌-నీళ్లు కలిపి తయారుచేసిన ద్రావణాన్ని నింపాలి. కొన్ని నిమిషాల తర్వాత స్క్రబ్బర్‌తో రుద్ది కడిగేస్తే సరిపోతుంది.

పాత్రపై పడిన పసుపు మరకను తొలగించడానికి టూత్‌పేస్ట్‌ని కూడా ఉపయోగించచ్చు. ఈ క్రమంలో కొద్దిగా పేస్ట్‌ను మరక ఉన్న చోట మందంగా పూయాలి. అరగంట తర్వాత పొడి క్లాత్‌తో రుద్ది.. సాధారణ డిష్‌వాషింగ్‌ లిక్విడ్‌తో శుభ్రం చేయచ్చు.

రెండు వంతుల వేడి నీటికి ఒక వంతు వెనిగర్‌ లేదా బ్లీచ్‌ని కలిపి.. ఈ మిశ్రమాన్ని పసుపు మరక ఉన్న పాత్రలో నింపాలి. రాత్రంతా అలాగే వదిలేసి ఉదయాన్నే సాధారణ సోప్‌తో కడిగేస్తే ఫలితం ఉంటుంది. ఈ చిట్కా గ్లాస్‌, సెరామిక్‌.. వంటి పాత్రలకూ వర్తిస్తుంది.

అయితే ఒక్కోసారి ఎంత శుభ్రపరిచినా పాత్రలపై పడిన పసుపు మరకలు అస్సలు వదలవు. అలాంటప్పుడు వాటిని ఎండలో ఆరబెట్టాలి. తద్వారా ఆ రంగు కొద్దిగా వెలిసిపోయే అవకాశం ఉంటుంది. ఆపై మరోసారి ఆ పాత్రను శుభ్రం చేస్తే సరిపోతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్