నిర్లక్ష్యం చేయొద్దు!

సునీత ప్రతి ఉదయం వ్యాయామంలో భాగంగా అరగంటసేపు పరుగు పెడుతుంది. అయితే తరచూ కీళ్లనొప్పి వస్తుండటంతో వైద్యులను సంప్రదిస్తే చికిత్స తప్పనిసరైంది.

Published : 10 May 2024 02:05 IST

సునీత ప్రతి ఉదయం వ్యాయామంలో భాగంగా అరగంటసేపు పరుగు పెడుతుంది. అయితే తరచూ కీళ్లనొప్పి వస్తుండటంతో వైద్యులను సంప్రదిస్తే చికిత్స తప్పనిసరైంది. పరుగు పెట్టేటప్పుడు మనం చేసే కొన్ని పొరపాట్లవల్ల ఆరోగ్యానికి బదులుగా మరిన్ని అనారోగ్యాలు చుట్టుముట్టే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి కొన్ని జాగ్రత్తలతో వీటి నుంచి తప్పించుకోవ్చని చెబుతున్నారు. అవేంటో చూద్దాం.

  • పరుగుపెట్టడం ఆరోగ్యానికి మంచిదే కదా, అటువంటప్పుడు అనారోగ్యాలేంటి అనుకోకూడదు. వేగంగా పరుగెట్టేటప్పుడు కొన్నిసార్లు చీలమండ బెణకడం, ఒత్తిడి పెరగడంవంటి సమస్యలకు గురవుతుంటాం. కాబట్టి జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. కొంచెం నొప్పే కదా.. పరుగు పెడుతుంటే అదే తగ్గుతుందనుకుంటే క్రమేపీ కండరాల అసమతుల్యత మొదలవుతుంది. ఇది దీర్ఘకాల సమస్యగా మారి, వెన్నునొప్పికి దారి తీస్తుంది.  
  • చాలామంది రన్నర్లు ‘ఓవర్‌ స్ట్రైట్‌ రన్నింగ్‌’గా అడుగులు దూరంగా వేస్తూ పరుగుపెడుతుంటారు. దీనివల్ల మోకాలిపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది మోకాళ్లతోపాటు చీలమండపైనా చెడు ప్రభావం పడేలా చేస్తుంది. కాలక్రమేణా ఇది ఆర్ధ్రరైటిస్‌, కీళ్ల క్షీణత సమస్యలను పెంచుతుంది. ఈ సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే వేగంగా నడిచినా లేదా పరుగుపెట్టినప్పుడైనా అడుగుల మధ్య సహజమైన దూరాన్ని పాటించడం మంచిది.
  •  అధికబరువు తగ్గాలనీ, లేదా నిత్యం వ్యాయామం ఆరోగ్యకరమనే నియమాన్నీ పాటించడానికి పరుగుపెడుతుంటాం. అటువంటి సమయంలో కొన్నిసార్లు అసౌకర్యంగా అనిపిస్తుంటుంది. పాదాలవద్ద బెణికినట్లు లేదా కీళ్ల వద్ద చిన్నగా నొప్పి మొదలవుతుంది. ఇటువంటివాటిని నిర్లక్ష్యం చేయకూడదు. నొప్పిని విస్మరించడానికి ప్రయత్నిస్తూ పరుగును కొనసాగించకూడదు. ఈ తీవ్రత పెరిగి కీళ్లకు సంబంధించిన అనారోగ్యాలు మొదలవుతాయి. మన శరీరం చెప్పేదాన్ని వినడం, వైద్యసలహా తీసుకోవడం మంచిది.
  •  వ్యాయామానికే కాదు, పరుగు పెట్టే ముందు కూడా వార్మ్‌-అప్‌ తప్పనిసరి. లేదంటే కీళ్లగాయాలు మొదలవుతాయి. పరుగుపెట్టేటప్పుడు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా సౌకర్యంగా ఉండాలంటే ముందుగా ఓ పది నిమిషాలపాటు వార్మ్‌-అప్‌ చేయాలి. దీనివల్ల కీళ్లు, పాదాలపై ఒత్తిడి కలగనివ్వకుండా, అలాగే పరుగుపెట్టడానికి కండరాలు కీళ్లను సిద్ధం చేస్తాయి.  
  • పరుగెత్తేటప్పుడు సౌకర్యంగా ఉండటానికి మనం ధరించే బూట్లు కూడా సహకరించాలి. బిగుతైన పాదరక్షలు  కీళ్లపై ఒత్తిడి పెంచుతాయి. ఫ్లాట్‌గా ఉండేవాటిని ఎంచుకోవాలి. నిపుణుల సూచనలు తీసుకుంటే పరుగు మన ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్