ఐదేళ్ల మా పాప అతిగా తింటోంది!

మా పాపకు తిండి విషయంలో నియంత్రణ ఉండటం లేదు. కడుపు నిండిందన్న విషయాన్ని గ్రహించలేకపోతోంది. ఐదేళ్లకే బరువూ పెరిగిపోతోంది.

Published : 08 Jun 2023 00:11 IST

మా పాపకు తిండి విషయంలో నియంత్రణ ఉండటం లేదు. కడుపు నిండిందన్న విషయాన్ని గ్రహించలేకపోతోంది. ఐదేళ్లకే బరువూ పెరిగిపోతోంది. ఈ అలవాటుని ఎలా మాన్పించాలి? తనకు ఎలాంటి ఆరోగ్యకరమైన ఆహారం అందించాలి.

- సాహిత్య

మీ చిన్నారి ఈటింగ్‌ బిహేవియరల్‌ సమస్యతో ఇబ్బంది పడుతోంది. ఈ మధ్య చాలామంది తల్లిదండ్రులు ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఓ ప్రణాళిక ప్రకారం ఆహారం పెడుతున్నారు. ఇలాంటప్పుడు పోషకాలు అందుతున్నాయో లేదో అన్న విషయానికి బదులు తామనుకున్న పరిమాణంలో తింటున్నారో లేదో మాత్రమే చూసుకోవడమే ఈ సమస్యకు ప్రధాన కారణం. దీనికి తోడు సులువుగా అయిపోతుందని ఫోన్లూ, టీవీలూ చూపిస్తూ తినిపించడం కూడా చిన్నారులు తమ ఆకలిని తెలుసుకోలేక పోవడానికి ఓ కారణం. ఇవన్నీ పిల్లలు ఆకలి వేయకుండానే ఏదో ఒకటి తినడానికి అలవాటు పడిపోయేలా చేస్తున్నాయి. సాధారణంగా ఏ పదార్థమైనా నమిలి మింగితేనే పొట్టకు ఎంత ఆకలి ఉందో మెదడు చెప్పగలదు. అలాకాకుండా సులువుగా నోట్లోకి వెళ్లిపోయే వాటిపై ఎక్కువ ఆధారపడటంతో బ్రెయిన్‌ కడుపు నిండిందనే సిగ్నల్‌ ఇచ్చేలోగానే ఆయా పదార్థాలు గొంతులోకి వెళ్లిపోతున్నాయి. ఫలితంగా ఆకలిని గుర్తించే సామర్థ్యాన్ని పిల్లలు కోల్పోతున్నారు. అంతేకాదు ఎదిగే వయసులో పిల్లల స్నేహితులు ఆయా ఆహార పదార్థాల గురించి ఆకర్షణీయంగా చెప్పే మాటలూ, టీవీలూ, సినిమాలు పీర్‌ ప్రెజర్‌ని పెంచుతున్నాయి. ఫలానాది తింటే శక్తి వస్తుంది. ఇది సంతోషంగా ఉంచుతుంది అన్న మాటలతో... కొత్త రకాల పదార్థాలపై మక్కువను పెంచుకుంటున్నారు. సంస్థలు వీరిని ఆకర్షించడానికి రంగులూ, స్వీటెనర్‌లను వాడి వంటకాలను సిద్ధం చేస్తున్నాయి. అలాంటి వాటిల్లో కేకులూ, చిప్స్‌, మఫిన్స్‌, జ్యూసుల వంటివెన్నో. ఇవి నోటికీ, పళ్లకీ ఎక్కువ శ్రమ కలిగించకుండానే అపరిమితంగా తినేలా చేస్తాయి. మీ పాపని వైద్యులకు చూపించండి. హార్మోన్ల హెచ్చుతగ్గులున్నాయేమో తెలుసుకోండి. అలానే మీ ఇంటి ఆహారపు అలవాట్లనూ, పద్ధతులనూ సరిచూసుకోండి. పాపకు ఏం తినాలి? ఎంత తినాలి వంటివి అర్థమయ్యేలా చెబుతూ ఉండండి. షుగర్‌ కోటెడ్‌, జంక్‌, సులువుగా తినేసే పదార్థాలకు బదులుగా ఉడకబెట్టిన క్యారెట్‌, అలసందలు, సెనగలు, దానిమ్మ, ఆపిల్‌, పాప్‌కార్న్‌ వంటివి స్నాక్స్‌గా ఇవ్వడం ప్రారంభించండి. పండ్లూ, కూరగాయ ముక్కలతో సలాడ్స్‌ పెట్టండి.  దోశలు, సేమ్యా వంటివీ తగ్గించండి. అన్నంలో కూర కలిపి ఇవ్వొద్దు. వారంతట వారుగానే ఆ పని చేసేలా చేయండి. అప్పుడు నెమ్మదిగా నమిలి మింగడం అలవాటు అవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్