Published : 23/03/2021 01:11 IST

ఈ క్లీనర్లు ప్రత్యేకం...

పాత్రలు తోమి...ఇల్లు ఊడ్చి... బట్టలుతికి హమ్మయ్య పని అయిపోయిందను కుంటాం కానీ...శుభ్రతకు వాడే రసాయనాలు మీ చేతులకు ఎంత హాని చేస్తాయో ఎప్పుడైనా గమనించారా?
అయితే పండ్ల తొక్కలు, వ్యర్థాలతో చేసిన ఈ క్లీనర్స్‌ చేతులకే కాదు పర్యావరణానికీ మేలు చేస్తాయంటున్నారు మధు చంద్రిక.

వరంగల్‌ పండ్ల మార్కెట్‌లో దుకాణదారుల నుంచి పండ్ల వ్యర్థాలను సేకరిస్తోందో మహిళ. ‘ఆ చెత్తను అంత ప్రత్యేకంగా సేకరిస్తోంది... దాంతో ఏం చేస్తుంది’ అనే సందేహం అక్కడున్నవారందరిలోనూ ఉంది. వాటితో రసాయన రహిత క్లీనింగ్‌ లిక్విడ్‌లను తయారు చేస్తోంది మధు చంద్రిక. కొవిడ్‌ కాలంలో ఏర్పడిన శానిటైజర్స్‌, క్లీనింగ్‌ లిక్విడ్స్‌ కొరతోనే తనకీ ఆలోచన వచ్చిందంటోందామె. మధుచంద్రిక పుట్టిపెరిగిందంతా వరంగల్‌లోనే. తండ్రి చంద్రశేఖర్‌రావు ఓ ప్రైవేటు ఉద్యోగి. తల్లి మాధవి గృహిణి. బీటెక్‌ అయ్యాక కోల్‌కతాకు చెందిన సందీప్‌ ఛటోపాధ్యాయ్‌తో పెళ్లైంది. అక్కడకు వెళ్లాక జాదవ్‌పుర్‌ విశ్వవిద్యాలయంలో రెన్యుబుల్‌ ఎనర్జీ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో మాస్టర్స్‌ చేసింది.
ఆ సమావేశంతో... గతేడాది హైదరాబాద్‌లో వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌పై జరిగిన ‘ఇంక్‌ వాష్‌’ సమావేశానికి హాజరైంది మధు. అక్కడే వ్యర్థాల నిర్వహణతో పర్యావరణ పరిరక్షణ సాధ్యమని తెలుసుకుంది. అయితే ఆ తర్వాత లాక్‌డౌన్‌తో పరిస్థితులు మారిపోయాయి. శానిటైజర్స్‌, వాషింగ్‌ లిక్విడ్స్‌ వంటి వాటికి డిమాండ్‌తో పాటు కొరతా ఎక్కువే అని అర్థం చేసుకుంది. రసాయనాలు వాడని సహజ తయారీ పద్ధతుల కోసం అన్వేషించింది. ఇంట్లోనే పండ్లు, కూరగాయల వ్యర్థాలతో రకరకాల ప్రయోగాలు చేసింది. చివరికి సిట్రస్‌ జాతి పండ్ల వృథాను ఉపయోగించి ఐదు లీటర్ల క్లీనింగ్‌ లిక్విడ్‌ని తయారు చేయగలిగింది. దాన్ని మొదట్లో తానే వాడి చూశాక స్నేహితులు, ఇరుగుపొరుగువారికీ పంచింది. పెద్ద మొత్తంలో చేయాలనే నిర్ణయానికి వచ్చాక ల్యాబ్‌లో పరీక్షిస్తే 99 శాతం యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలున్నట్లు నివేదిక వచ్చింది. దాంతో రెట్టించిన ఉత్సాహంతో దీన్ని ‘వసుంధర క్లీనింగ్‌ లిక్విడ్‌’ పేరుతో మార్కెట్‌లోకి తీసుకొచ్చింది మధు చంద్రిక.
హాని చేయవు...సీజనల్‌గా వచ్చే సిట్రస్‌ పండ్ల చెత్త ఏడాదంతా లభ్యంకాదు. ముందుగానే వ్యాపారుల నుంచి సేకరించిన వీటిని భద్రపరచడానికి ప్రసుత్తం ఓ గోడౌన్‌ సిద్ధం చేస్తున్నా. ఈ క్లీనర్‌తో ఇంట్లో ఫ్లోర్‌, వాష్‌రూంలతో సహా కారు, ఫర్నిచర్‌, ఫ్రిజ్‌ వంటివన్నీ శుభ్రం చేసుకోవచ్చు. ఆరోగ్యానికి ఎటువంటి హానీ కలగదు, బ్యాక్టీరియానూ దరి చేరనివ్వదు అంటోంది మధుచంద్రిక.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి