Credit Card: గడువులోపు క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లిస్తున్నారా?

గడువులోపు క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లించడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి, అవేంటో ఇక్కడ చూద్దాం.

Published : 30 Oct 2023 17:47 IST

దిల్లీ: బ్యాంకులు క్రెడిట్‌ కార్డులను విరివిగా అందిస్తున్నాయి. చాలా వరకు బ్యాంకులు వినియోగదారులకు వేరే బ్యాంకులో ఖాతా ఉన్నా సరే.. వారికి తమ బ్యాంకు క్రెడిట్‌ కార్డులను జారీ చేస్తున్నాయి. సాధారణ షాపింగ్‌ నుంచి యుటిలిటీ బిల్లులు చెల్లించడం వరకు.. ఇంకా అత్యవసర పరిస్థితుల్లో నగదు ఉపసంహరించుకోవడానికి కూడా క్రెడిట్‌ కార్డును ఉపయోగించొచ్చు. గడువులోపు నిర్దేశిత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. అలా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇక్కడ చూద్దాం..

బాధ్యతాయుత ప్రవర్తన

మీరు గడువు తేదీకి ముందే మీ క్రెడిట్‌ కార్డు బిల్లులను చెల్లించినప్పుడు బాధ్యతాయుతమైన ఆర్థిక ప్రవర్తన, బలమైన చెల్లింపు చరిత్రను ప్రదర్శించొచ్చు. మెరుగైన క్రెడిట్‌ స్కోరుతో పాటు మీ ఆర్థిక ఆరోగ్యంపై అనేక సానుకూల ప్రభావాలుంటాయి. అలాగే, ఈ ఆర్థిక క్రమశిక్షణ భవిష్యత్‌ ఆర్థిక శ్రేయస్సును సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. మీరు లోన్‌/మరొక క్రెడిట్‌ కార్డు కోసం దరఖాస్తు చేసినప్పుడు బ్యాంకు మీ బాధ్యతాయుతమైన ప్రవర్తను పరిగణనలోకి తీసుకుంటుంది. మీ లోన్‌ను వేగంగా మంజూరు చేస్తుంది. లేదా ఎక్కువ మొత్తాన్ని ఆమోదించొచ్చు.

సీయూఆర్‌

క్రెడిట్‌ వినియోగం అనేది క్రెడిట్‌ కార్డ్‌ బ్యాలెన్స్‌ల నిష్పత్తిని, క్రెడిట్‌ పరిమితులను సూచిస్తుంది. కన్స్యూమర్‌ ఫైనాన్షియల్‌ ప్రొటెక్షక్‌ బ్యూరో (CFPB) ప్రకారం.. నిపుణులు క్రెడిట్‌ వినియోగాన్ని మీకు అందుబాటులో ఉన్న క్రెడిట్‌లో 30% కంటే తక్కువగా ఉంచాలని సిఫార్సు చేస్తున్నారు. కాబట్టి మీ నెలవారీ క్రెడిట్ కార్డు బిల్లు ఈ నిష్పత్తిని దాటుతున్నట్లైతే.. మీ క్రెడిట్‌ కార్డు బిల్లులను ముందుగానే చెల్లించి మీ బాకీ ఉన్న బ్యాలెన్స్‌ తగ్గించుకోవచ్చు. అప్పుడు క్రెడిట్‌ వినియోగం తక్కువగా నమోదవుతుంది. తక్కువ క్రెడిట్‌ వినియోగ నిష్పత్తి మీ క్రెడిట్‌ స్కోరుకు అనుకూలంగా ఉంటుంది. మీరు క్రెడిట్‌పై ఎక్కువగా ఆధారపడడం లేదని, ఆర్థిక నిర్వహణ సమర్థంగా అమలు చేస్తున్నారని సూచిస్తుంది.

పెనాల్టీ

గడువు తేదీకి ముందే క్రెడిట్‌ కార్డు బిల్లులను చెల్లించడం వల్ల ఆలస్య చెల్లింపు జరిమానాలు, రుసుములను నివారించొచ్చు. గడువు తేదీ దాటిన చెల్లింపులపై కనీస పెనాల్టీ కింద రూ.500+జీఎస్‌టీ ఉంటుంది. చెల్లింపులు ఆలస్యమయ్యే కొలదీ కాలవ్యవధిని బట్టి జరిమానా పెరిగిపోతుంది. మీ కార్డు పేమెంట్‌లను పదేపదే మిస్‌ చేయడం వల్ల పెద్ద మొత్తంలో బకాయిలు పెరగడమే కాకుండా.. వడ్డీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో క్రెడిట్‌ కార్డు ఖాతాను మూసివేయాల్సి రావచ్చు. అలా చేయడం వల్ల కూడా సిబిల్‌ స్కోరు తగ్గుతుంది. చెల్లింపుల తేదీని మర్చిపోకుండా ఉండడానికి అవసరమైతే మీ క్రెడిట్‌ కార్డు చెల్లింపులను ముందుగానే షెడ్యూల్‌ చేసుకోవాలి. ఆటోమేటిక్‌ చెల్లింపులు సెటప్‌ చేయవచ్చు. లేదా మీ ఫోన్‌లో రిమైండర్‌ను సెట్‌ చేసుకోవచ్చు.

క్రెడిట్‌ స్కోరు

గడువుతేదీలోపు చెల్లింపులు మీ క్రెడిట్‌ స్కోరును ప్రభావితం చేసే అత్యంత ముఖ్యమైన కారకాల్లో ఒకటి. కాబట్టి ముందుగానే కార్డు బిల్లులు చెల్లించడం వల్ల వేగంగా క్రెడిట్‌ స్కోరు మెరుగుపడుతుంది. కాలక్రమేణా మీ సానుకూల చెల్లింపు ప్రవర్తన మీ క్రెడిట్‌ స్కోరుపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. మీ క్రెడిట్‌ స్కోరు దీర్ఘకాలిక క్రెడిట్‌ ప్రవర్తనను ప్రతిబింబిస్తుంది. రుణాలు, యుటిలిటీ బిల్లులతో సహా అన్ని బిల్లులు సకాలంలో చెల్లిస్తే..మీ క్రెడిట్‌ స్కోరు త్వరగా మెరుగుపడుతుంది. బ్యాంకులు, రుణ సంస్థలు మిమ్మల్ని నమ్మకమైన రుణగ్రహీతగా చూసే అవకాశం ఉంది. తద్వారా మీరు రుణాలపై తక్కువ వడ్డీ రేట్లకు అర్హత సాధిస్తారు.

క్రెడిట్‌ పరిమితి

స్థిరమైన ముందస్తు చెల్లింపుల కారణంగా మీ క్రెడిట్‌ స్కోరు మెరుగుపడినప్పుడు.. కార్డు జారీ సంస్థ మీ క్రెడిట్‌ పరిమితిని పెంచొచ్చు. ఇది మీకు ఎక్కువ ఆర్థిక సౌలభ్యాన్ని అందిస్తుంది. కార్డును గతం కంటే ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు. క్యాష్‌ లిమిట్‌ కూడా పెరుగుతుంది. ప్రీ-అప్రూవ్‌ రుణాలు వేగంగా లభిస్తాయి. 

చివరిగా: క్రెడిట్‌ కార్డు రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. కాబట్టి, క్రెడిట్‌ కార్డు ఉపయోగించేవారు గడువులోపు బకాయిలు చెల్లించి ఆర్థిక క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని