5G roll out: 5జీ దేశవ్యాప్తంగా ఎప్పుడు..?రేట్లు ఎంత ఉండబోతున్నాయ్‌?

5G roll out in India: 5జీ.. ఈ పదం వినగానే వచ్చే ప్రశ్న.. ‘వస్తున్నాయ్‌ సరే.. మాకెప్పుడు?’

Updated : 17 Sep 2022 14:18 IST

5G roll out in India:  5జీ.. ఈ పదం వినగానే వచ్చే ప్రశ్న.. ‘వస్తున్నాయ్‌ సరే.. మాకెప్పుడు?’ అని.  పెద్ద పెద్ద నగరాల్లో ఉండే వారి సంగతి పక్కన పెడితే.. పల్లెలు, పట్టణాల్లో ఉన్న వారు మాత్రం దీని గురించి ఆశగా ఎదురుచూస్తుంటారు. కారణం.. గతంలో 3జీ, 4జీ వచ్చినప్పుడు కూడా తొలుత నగరాల్లో అందుబాటులోకి వచ్చాయి. తర్వాత దేశవ్యాప్తంగా అందుబాటులోకి రావడానికి చాలా కాలమే పట్టింది. ఇప్పటికీ 4జీ సేవలు పూర్తిగా అందుబాటులోకి రాని గ్రామాలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో 5జీ స్పెక్ట్రమ్‌ వేలం ప్రక్రియ (జులై 26) జరగబోతోంది. ఏడాది చివరికల్లా కొన్ని నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. మరి దేశవ్యాప్తంగా సేవలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి?  ఏయే దేశాల్లో  5జీ సేవలు అందుబాటులో ఉన్నాయి?  వస్తే రేట్లు ఎంతుండొచ్చు? 5జీ ఫోన్లు కొనుగోలు చేయాలా? వద్దా? వంటి  ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం పదండి..

ఆ దేశాల్లో 6జీకి సన్నాహాలు

మనం ఇప్పుడింకా 5జీ గురించి చర్చించుకుంటుండగా.. కొన్ని దేశాలు మాత్రం ఇప్పటికే 6జీకి సంబంధించిన ప్రయోగాల్లో నిమగ్నమై ఉన్నాయి. ఈ విషయంలో మన పొరుగుదేశం చైనా ముందంజలో ఉంది. ఇప్పటికే ఆ దేశంలో 6జీకి సంబంధించిన ప్రయోగాలు ప్రారంభించింది. జపాన్‌ సైతం 6జీకి సన్నద్ధమవుతోంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా 72 దేశాల్లో 5జీ టెలికాం సేవలు అందుబాటులో ఉన్నాయి. 5జీ నగరాల పరంగా చూసినప్పుడు చైనా తొలి స్థానంలో ఉండగా.. అమెరికా రెండో స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి రెండు రోజులకు ఓ నగరంలో 5జీ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. అర్జెంటీనా, భూటాన్‌, కెన్యా, కజకిస్థాన్‌, మలేసియాలో 5జీ సేవలు ఈ ఏడాదే ప్రారంభమయ్యాయి. ఈ జాబితాలో భారత్‌ సైతం త్వరలో చేరబోతోంది.

Also Read: EXPLAINED: 2G, 3G, 4G, 5G.. ఏమిటివి? స్పెక్ట్రమ్‌కి వేలం ఎందుకు?

తొలుత ఎక్కడ..?

జులై నెలాఖరు కల్లా 5జీ వేలం ప్రక్రియ పూర్తయ్యాక.. ఆగస్టు లేదా సెప్టెంబర్‌ నెలలో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని టెలికాం మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ తెలిపారు. వేలం పూర్తయిన 6 నెలల్లోగా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని గతంలో టెలికాం కంపెనీలు సైతం తెలిపాయి.  ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఏడాది చివరి కల్లా 20-25 నగరాల్లో సేవలు అందుబాటులోకి రానున్నాయి.  తొలుత మాత్రం 13 నగరాల ప్రజలు ఈ సేవలను ఆనందించనున్నారు. ఈ జాబితాలో హైదరాబాద్‌ సహా అహ్మదాబాద్‌, బెంగళూరు, చండీగఢ్‌, చెన్నై, దిల్లీ, గాంధీనగర్‌, గురుగ్రామ్‌,  జామ్‌నగర్‌, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబయి, పుణె నగరాలు ఉన్నాయి.  ఇప్పటికే 5జీ సేవలకు సంబంధించి జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా ఆయా నగరాల్లో ట్రయల్స్‌  పూర్తి చేశాయి. నోకియా, ఎరిక్‌సన్‌, శాంసంగ్‌తో కలిసి 6 నెలల పాటు పరీక్షలు నిర్వహించాయి.

Also Read: 2G Spectrum Case: అసలు 2G స్పెక్ట్రమ్‌ రగడ ఏంటి? ఆరోజు కాగ్‌ ఏం చెప్పింది?

దేశవ్యాప్తంగా  ఎప్పుడు..?

దేశంలో టెలికాం రంగంలో కొత్త సాంకేతికత అందుబాటులోకి వచ్చినప్పటికీ.. అది దేశవ్యాప్తం కావడానికి కొన్నేళ్లు పడుతుంది. గతంలో 2జీ, 3జీ, 4జీ అనుభవాలు ఇవే చెబుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇంత వరకు 4జీ సేవలనే పూర్తి స్థాయిలో ప్రారంభించలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ లెక్కన 5జీ రావడానికి సైతం కొన్నేళ్లు పడుతుంది. అయితే, 5జీ విషయంలో మునుపటిలా జాప్యం జరగకపోవచ్చన్నది నిపుణుల మాట. ఇప్పటికే ఉన్న సరిపడా టవర్లు, మానవ వనరులు అందుబాటులో ఉండడం వల్ల తీవ్ర జాప్యం జరగబోదని టెలికాం గేర్లు విక్రయించే సంస్థకు చెందిన ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. తొలి దశలో నగరాల్లో ఈ సేవలు తేవాలంటేనే ఒక్కో నగరంలో సగటున వెయ్యి టవర్లకు 5జీ గేర్లు అమర్చాల్సి ఉంటుంది. ఈ లెక్కన దేశవ్యాప్తంగా 5జీ సేవలు రావాలంటే 2 నుంచి 2.5 లక్షల టవర్లకు 5జీ పరికరాలను అమర్చాలి. మారుమూల గ్రామాలకు సైతం ఈ సేవలు అందుబాటులోకి రావాలంటే ఐదేళ్లు పట్టొచ్చని చెబుతున్నారు. 2027 నాటికి 39 శాతం మంది 5జీ వినియోగదారులు ఉంటారని ఎరిక్‌సన్‌ అంచనా వేసింది. దేశవ్యాప్త సేవల కోసం టెలికాం కంపెనీలు కనీసం లక్షన్నర నుంచి 2 లక్షల కోట్లపైనే వెచ్చించాల్సి ఉంటుందని ప్రముఖ సంస్థ ‘మోతీలాల్‌ ఓస్వాల్‌’ అంచనా వేసింది.

Also Read: 6G Network: 6జీ సాంకేతికతతో మొబైల్‌ఫోన్లు ఉనికిని కోల్పోతాయా?

రేట్లు ఎలా ఉండబోతున్నాయి?

5జీ సేవలు అందుబాటులోకి వస్తే డేటా ప్లాన్లు ఎలా ఉండబోతున్నాయనేది చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనిపై కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్ మాట్లాడుతూ.. ఇతర దేశాలతో పోలిస్తే చౌకగానే ఉంటాయని సమాధానం ఇచ్చారు. అయితే, టెలికాం కంపెనీల నుంచి దీనిపై ఎలాంటి స్పష్టతా లేదు. 4జీతో సమానంగానే ఉండొచ్చని ఓ టెలికాం కంపెనీ ప్రతినిధి మాత్రం తెలిపారు. అయితే, దేశంలో 4జీ సేవలు అందుబాటులోకి వచ్చిన తొలి నాళ్లలో 3జీ ప్లాన్లతో పోలిస్తే 4జీ ప్లాన్లు కాస్త అధికంగా ఉండేవి. తర్వాత 3జీ, 4జీ అన్న తేడా లేకుండా టెలికాం కంపెనీలు ప్లాన్లు సవరించాయి. 5జీ వచ్చాక సైతం ఈ ధరల్లో వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది. 10-20 శాతం అధిక ధరతో ప్లాన్లు లభించే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.

5జీ ఫోన్‌ కొనాలా వద్దా..?

మార్కెట్లో ఇప్పటికే 5జీ ఫోన్ల సందడి మొదలైంది. మొబైల్‌ తయారీ కంపెనీలు ఇటీవల కాలంలో 5జీ ఫోన్లను లాంచ్‌ చేయడంపై దృష్టి పెట్టాయి. ఈ ఏడాది చివరి నాటికి దేశంలోకి షిప్‌ అయ్యే స్మార్ట్‌ఫోన్లలో 40 శాతం 5జీ ఫోన్లే ఉంటాయన్నది ఒక అంచనా. ఈ క్రమంలో కొత్తగా ఫోన్‌ కొనాలనుకునేవారిని 5జీ ఫోన్‌ కొనాలా? వద్దా? అనే ప్రశ్న వేధిస్తుంటుంది.  ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న 4జీ స్మార్ట్‌ఫోన్లతో పోలిస్తే 5జీ స్మార్ట్‌ఫోన్ల ధర కాస్త ఎక్కువగా ఉందనే చెప్పాలి. 5జీ ఫోన్‌ కొనాలంటే కనీసం ₹15వేలు వెచ్చించాల్సిందే. పైగా కొన్ని కంపెనీలు పరిమిత బ్యాండ్లు సపోర్ట్‌ చేసే 5జీ ఫోన్లనే తీసుకొస్తున్నాయి. ఒకవేళ మీరు గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారు అయితే 5జీ ఫోన్లు కొనుగోలును వాయిదా వేసుకోవడం మంచిది. అదే నగరాల్లో నివసించే వారైతే 5జీ ఫోన్లపై ఓ లుక్కేయొచ్చు. అయితే, ఎక్కువ బ్యాండ్లు సపోర్ట్‌చేసే ఫోన్లు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కొద్ది రోజులు కొనుగోలును వాయిదా వేసుకోగలిగితే తక్కువ ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు.

Also Read: SmartPhone: కొత్త ఫోన్ కొంటున్నారా..? అయితే ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని