5G Auction: 5జీ వేలంతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయమెంత?

5G Auction: 5జీ వేలం ద్వారా ప్రభుత్వానికి ఎంత ఆదాయం రానుంది? వేలం ప్రక్రియ అసలు ఎలా జరుగుతంది? వంటి వివరాలు చూద్దాం...

Updated : 25 Jul 2022 12:34 IST

5G Auction: 4జీ కంటే పదిరెట్లు వేగవంతమైన 5జీ సేవల కోసం స్పెక్ట్రమ్‌ వేలం (5G Auction) ప్రక్రియ రేపే ప్రారంభం కానుంది. ప్రజలకు సేవలందించే టెలికాం సంస్థలతో పాటు దిగ్గజ టెక్‌ సంస్థలు కూడా సొంత 5జీ నెట్‌వర్క్‌లు నిర్వహించేందుకు వీలుగా వాటికీ స్పెక్ట్రమ్‌ కేటాయించనున్నారు. ఈ నేపథ్యంలో వేలం (5G Auction) ప్రక్రియ ఎలా జరగనుంది? ప్రభుత్వానికి దీని ద్వారా ఎంత ఆదాయం రానుంది? వంటి వివరాలపై ఓ లుక్కేద్దాం..!

వేలంలో ఏయే ఫ్రీక్వెన్సీలు?

మొత్తంగా 72 గిగాహెర్ట్జ్‌ స్పెక్ట్రమ్‌ను 20 ఏళ్లపాటు వినియోగించుకునేందుకు వేలం (5G Auction) నిర్వహించనున్నారు. 600, 700, 800, 900, 1800, 2100, 2300, 3300 మెగాహెర్ట్జ్‌ వంటి తక్కువ ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లు, మధ్యశ్రేణి ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌ 3300 మెగాహెర్ట్జ్‌తో పాటు అధిక ఫ్రీక్వెన్సీ 26 గిగాహెర్ట్జ్‌లను వేలానికి ఉంచారు. మధ్యశ్రేణి, అధిక ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లను టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్లు 4జీ కంటే పదిరెట్లు వేగవంతమైన 5జీ సేవల కోసం వినియోగించుకోనున్నాయి.

ఇదీ చదవండి: 2G, 3G, 4G, 5G.. ఏమిటివి? స్పెక్ట్రమ్‌కి వేలం ఎందుకు?

ఏయే సంస్థలు పాల్గొంటున్నాయి?

టెలికాం సంస్థలైన భారతీ ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ జియో, వొడాఫోన్‌ ఐడియాతో పాటు అదానీ డేటాకు కూడా 5జీ స్పెక్ట్రమ్‌ కేటాయించనున్నారు. ఒకవేళ విదేశీ కంపెనీలు పాల్గొనాలనుకుంటే.. భారత్‌లోని తమ అనుబంధ సంస్థలు లేదా తమకు వాటాలున్న కంపెనీల ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. టెక్‌ సంస్థలు తమ సొంత అవసరాల (క్యాప్టివ్‌) నెట్‌వర్క్‌ కోసం ఈ స్పెక్ట్రమ్‌ను వినియోగించాలి. ధరలు, విధివిధానాలపై ట్రాయ్‌ సిఫారసులు, డిమాండ్‌పై అధ్యయనం అనంతరం ఈ కంపెనీలకు నేరుగా కేటాయింపు ఉంటుంది. యంత్రాల మధ్య సమాచారం, ఐఓటీ, కృత్రిమమేధ అప్లికేషన్ల కోసం ఈ సంస్థలు స్పెక్ట్రమ్‌ను వినియోగించుకుంటాయి. దీనిపై టెలికాం సంస్థలు గతంలోనే తమ వ్యతిరేకత తెలిపినా.. మంత్రివర్గం ముందుకే వెళ్లింది.

సేవలు ఎప్పుడు ప్రారంభం?

స్పెక్ట్రమ్‌ వేలం (5G Auction) పూర్తయితే.. 5జీ సేవలు ఆగస్టు-సెప్టెంబరులో ప్రారంభమయ్యే అవకాశం ఉందని కేంద్ర టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ గతంలో ఓ సందర్భంలో తెలిపారు. దశలవారీగా దేశవ్యాప్తంగా ఈ సేవలు విస్తరిస్తాయన్నారు. ఇందుకు అవసరమైన మౌలిక వసతులను టెలికాం సంస్థలు సిద్ధం చేస్తున్నాయని మంత్రి వెల్లడించారు.

ఇదీ చదవండి: 5జీ దేశవ్యాప్తంగా ఎప్పుడు..?రేట్లు ఎంత ఉండబోతున్నాయ్‌?

వేలం ఎలా నిర్వహిస్తారు?

స్పెక్ట్రమ్‌కు సంబంధించిన ఈ-వేలం పలు రౌండ్లలో జరుగుతుంది. దీనికి ముందే బిడ్డర్లు ‘ఎర్నెస్ట్‌ మనీ డిపాజిట్‌ (EMD)’ చేయాల్సి ఉంటుంది. దీని ఆధారంగా వారికి కొన్ని అర్హత పాయింట్లను కేటాయిస్తారు. వీటి ఆధారంగానే కంపెనీలు వేలం సమయంలో బిడ్లను దాఖలు చేస్తాయి. జియో రూ.14000 కోట్ల ఎర్నెస్ట్ మనీ డిపాజిట్‌ చేసింది. ఎయిర్‌టెల్‌ రూ.5,500 కోట్లు, వొడాఫోన్‌ ఐడియా రూ.2,200 కోట్లు, అదానీ గ్రూప్‌ రూ.100 కోట్ల ఈఎండీ చేశాయి. ఫలితంగా జియోకు 1,59,830 పాయింట్లు, ఎయిర్‌టెల్‌కు 66,330, వొడాఫోన్‌ ఐడియా 29,370, అదానీ డేటాకు 1,650 పాయింట్లు దక్కాయి. ఈ పాయింట్లతో పాటు ఆయా కంపెనీల నికర విలును కూడా స్పెక్ట్రమ్‌ కేటాయింపుల్లో పరిగణనలోకి తీసుకుంటారు. ఈఎండీ కంటే 7-8 రెట్ల విలువైన స్పెక్ట్రమ్‌కు కంపెనీలు పోటీపడే అవకాశం ఉంటుందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

చెల్లింపుల ప్రక్రియ ఇదీ..

వేలంలో విజయవంతమైన బిడ్డర్‌లుగా నిలిచిన వారికి చెల్లింపుల విధానాన్ని మరింత సులభతరం చేశారు. వీరు ముందస్తు చెల్లింపులు చేయడం తప్పనిసరేమీ కాదు. 20 సమ వార్షిక వాయిదాల్లో స్పెక్ట్రమ్‌ చెల్లింపులు జరపొచ్చు. ఏడాది ప్రారంభంలోనే వీటిని చెల్లించాల్సి ఉంటుంది. దీని వల్ల కంపెనీలకు నిధుల అవసరం తగ్గుతుంది. పదేళ్ల తర్వాత స్పెక్ట్రమ్‌ను సరెండర్‌ చేయొచ్చు. అయితే, మిగిలిన వాయిదాలకు సంబంధించి ఎటువంటి బకాయిలు ఉండకూడదు. ఈసారి స్పెక్ట్రమ్‌ వినియోగ ఛార్జీలు (ఎస్‌యూసీ) ఉండవు.

ఇదీ చదవండి: 5Gపై అపోహలు.. అనుమానాలు.. వీటిలో వాస్తవమెంత?

ఎంత ఆదాయం రావొచ్చంటే..

టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ నిర్ణయించిన ధరల ప్రకారం వేలంలో ఉంచుతున్న స్పెక్ట్రమ్‌ కనీస విలువ రూ.4.31 లక్షల కోట్లుగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి. రూ.1- 1.1 లక్షల కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను టెలికాం సంస్థలు కొనుగోలు చేసే అవకాశం ఉందని రేటింగ్‌ సంస్థ ఇక్రా అంచనా వేసింది. ఈ రంగంలో నిపుణులైన ఓ అధికారి మాట్లాడుతూ.. జియో రూ.1.27 లక్షల కోట్లు, ఎయిర్‌టెల్‌ రూ.48,000 కోట్లు, వొడాఫోన్‌ ఐడియా రూ.20,000 కోట్లు, అదానీ డేటా రూ.700 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉంది.

అదానీ ప్రకంపనలు..

5జీ స్పెక్ట్రమ్‌ వేలంలో పాల్గొంటున్నట్లు గౌతమ్‌ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్‌ స్పష్టం చేయడం తొలుత టెలికాం రంగంలో ప్రకంపనలు సృష్టించింది. కేంద్రప్రభుత్వం నిర్ణయించిన నూతన విధానానికి అనుగుణంగా, సొంత అవసరాల నిమిత్తమే స్పెక్ట్రమ్‌ కొనుగోలు చేస్తామని, టెలికాం వినియోగదారు సేవల్లోకి ప్రవేశించడం లేదని అదానీ గ్రూప్‌ ప్రకటించింది. అయినప్పటికీ.. భవిష్యత్తు వ్యాపార అవకాశాలు అపారంగా ఉన్న టెలికాం సేవల్లోకీ అదానీ ప్రవేశిస్తారనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త సంస్థను నెలకొల్పుతారా లేక ప్రస్తుతం అందుబాటులో ఉన్న కంపెనీల్లో దేనినైనా కొనుగోలు చేస్తారా అనే విశ్లేషణలూ సాగుతున్నాయి.

సొంత అవసరాలకే అయితే..

ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ సేవల కోసం మాత్రమే 5జీ స్పెక్ట్రమ్‌ వేలంలో పాల్గొంటున్నామని, తమ విమానాశ్రయాలు, పోర్టులు, విద్యుదుత్పత్తి, డేటా కేంద్రాల అవసరాల కోసమే దీనిని వినియోగించుకుంటామని అదానీ గ్రూప్‌ చెబుతోంది. అయితే, వొడాఫోన్‌ ఐడియాతో ఇంటర్‌ కంపెనీ రోమింగ్‌ (ఐసీఆర్‌) ఒప్పందం కుదుర్చుకుంటే.. పూర్తి స్థాయిలో టెలికాం రంగంలోకీ అదానీలు అడుగుపెట్టే అవకాశం ఉంటుందని దేశీయ బ్రోకరేజీ సంస్థ మోతీలాల్‌ ఓస్వాల్‌ అభిప్రాయపడింది. స్పెక్ట్రమ్‌ వేలంలో పాల్గొననున్న అదానీ గ్రూప్‌, భవిష్యత్తులో వినియోగదారు సేవల్లోకి అడుగుపెట్టవచ్చని ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ గోల్డ్‌మన్‌ శాక్స్‌ కూడా అంచనా వేస్తోంది. అదానీగ్రూప్‌ తమ సంస్థల అవసరాలకు కావాల్సిన స్పెక్ట్రమ్‌ కోసం, వేలంలో పాల్గొనడం, ఆర్థికంగా ఆ సంస్థకు లాభం చేకూర్చదని తెలిపింది. అందువల్ల వినియోగదారు నెట్‌వర్క్‌ల్లోకి వచ్చేందుకే అదానీ గ్రూప్‌ ముందడుగు వేస్తుందని విశ్వసిస్తున్నామని గోల్డ్‌మన్‌ శాక్స్‌ చెబుతోంది. అదానీ ప్రవేశిస్తే.. టెలికాం సేవల్లో మళ్లీ పోటీ తీవ్రమయ్యే అవకాశం ఉందని ఆర్థిక సేవల సంస్థ బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా అభిప్రాయపడింది. నేరుగా స్పెక్ట్రమ్‌ పొందకుండా అదానీలు వేలంలో ఎందుకు పాల్గొంటున్నారో తెలియడం లేదని సీఎల్‌ఎస్‌ఏ తెలిపింది.

రిలయన్స్‌ కూడా అప్పట్లో ఇంతే..

2016లో టెలికాం వాణిజ్య సేవలను ప్రారంభించేందుకు చాలా ముందుగా 2010లోనే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 2300 మెగాహెర్ట్జ్‌ స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసిందని పరిశోధనా సంస్థ జెఫ్రీస్‌ ప్రస్తావిస్తోంది. అప్పట్లో ఈ స్పెక్ట్రమ్‌ వాయిస్‌ సేవలకు పనికిరాదు. ఈ నిబంధనను 2013లో ప్రభుత్వం సవరించి, వాయిస్‌ సేవలకు ఈ స్పెక్ట్రమ్‌ను అనుమతించడం జియో ఆవిర్భావానికి కారణమైందని గుర్తు చేస్తోంది. తదుపరి యూనిఫైడ్‌ సేవల లైసెన్సు పొంది, టెలికాం సేవల్లోకి ప్రవేశించడం ద్వారా, అగ్రస్థానానికి జియో చేరిందని వివరించింది. అందువల్ల భవిష్యత్తులో అదానీ గ్రూప్‌ కూడా టెలికాం సేవల్లోకి ప్రవేశించవచ్చనే అంచనా వేస్తోంది.

ఇదీ చదవండి: అసలు 2G స్పెక్ట్రమ్‌ రగడ ఏంటి? ఆరోజు కాగ్‌ ఏం చెప్పింది?

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts