Telegram: ఆ ‘టెలిగ్రామ్‌’ యాప్స్‌లో డేటా చౌర్యం... ఏ వెర్షన్‌ వాడుతున్నారో చూసుకోండి!

మెసేజింగ్‌ యాప్‌ టెలిగ్రామ్‌ (Telegram)లో కొన్ని సమస్యలను గుర్తించినట్లు ఓ సైబర్‌ సెక్యూరిటీ (Cyber Security) సంస్థ వెల్లడించింది.

Published : 01 Jul 2023 18:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్:  సోషల్‌ మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ టెలిగ్రామ్‌ (Telegram) యాప్‌ వినియోగదారులకు సైబర్‌ సెక్యూరిటీ సంస్థలు కొన్ని సూచనలు చేస్తున్నాయి. ఇంటర్నెట్‌లో విస్తృత వినియోగంలో ఉన్న ఓ వెర్షన్‌ యాప్‌లో సాంకేతిక సమస్యలు ఉన్నాయనేది ఆ సూచనల సారాంశం. మార్పులు, చేర్పులు చేసిన ఆ వెర్షన్‌ యాప్‌లో యూజర్‌ డేటాను దొంగిలించే బగ్‌ కనిపించిందని నిపుణులు తెలిపారు. 

సైబర్‌ సెక్యూరిటీ సంస్థ చెక్‌ పాయింట్‌ వివరాల ప్రకారం... ఇంటర్నెట్‌ అందుబాటులో ఉన్న వెర్షన్‌లో ఉన్న మాల్‌వేర్‌ కారణంగా యూజర్లకు తెలియకుండానే కొన్ని పెయిడ్‌ సబ్‌స్క్రిప్షన్లు, ఇన్‌ యాప్‌ పర్చేజ్‌లు జరిగిపోతున్నాయట. అంతేకాదు మొబైల్‌లోని లాగిన్‌ సమాచారం కూడా తస్కరణకు గురవుతోందట. మరోవైపు ట్రోజన్‌ ట్రియాడ్‌ అనే  వైరస్‌ కలిగిన కోడ్‌ను యాప్‌లో గమనించామని హార్మొని మొబైల్‌ తెలిపింది. 

ఈ బగ్స్‌ కారణంగా యూజర్ల సమాచారం తస్కరణకు గురవడంతోపాటు, హ్యాకర్లకు, యూజర్లకు మధ్య ఓ ఛానల్‌ ఏర్పాటు అవుతోందట. దాని ద్వారా డివైజ్‌లో ఒక ఫైల్‌ను పంపిస్తున్నారట. ఆ తర్వాత దాని ఆధారంగా మొబైల్‌ నుంచి డేటా యాక్సెస్‌ చేస్తున్నారని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో నకిలీ యాప్‌లు, అదనపు ఫీచర్ల పేరుతో వచ్చే మోడిఫైడ్‌ యాప్‌ల వాడకంపై నిపుణులు మరోసారి సూచనలు చేశారు.

మార్పులు, చేర్పులు చేసిన యాప్స్‌ వాడటం వల్ల అదనపు ఫీచర్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.. అయితే ఒరిజినల్‌ వెర్షన్‌ ఇచ్చేంత డేటా ప్రైవసీ అవి ఇవ్వవు. ఈ నేపథ్యంలో మీ మొబైల్‌లో ఉన్న టెలీగ్రామ్‌ యాప్‌ వెర్షన్‌ను ఓసారి చెక్‌ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్లేస్టోర్‌ / యాప్‌ స్టోర్‌లో ఉన్న లేటెస్ట్‌ వెర్షన్‌తో అది సరిపోలితే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదని వారి సూచన. లేదంటే వెంటనే అన్‌ఇన్‌స్టాల్‌ చేసుకోని.. కొత్తగా ప్లే స్టోర్‌ / యాప్‌ స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోగలరు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని