Credit Card Rewards: క్రెడిట్‌ కార్డుతో రివార్డు పాయింట్లు, ప్రయోజనాలు ఇవే..

క్రెడిట్‌ కార్డు వినియోగంతో రివార్డ్‌ పాయింట్లు పొందే అవకాశముంది. ఏ కార్డుతో ఎలాంటి రివార్డ్స్‌ పాయింట్లు పొందొచ్చు, వాటి ప్రయోజనం గురించి ఇక్కడ తెలుసుకుందాం.

Published : 22 Dec 2023 18:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో క్రెడిట్‌ కార్డుల కొనుగోళ్లు,  ఇతర ఆర్థిక కార్యకలాపాలు బాగా పెరిగాయి. క్రెడిట్‌ కార్డులతో లావాదేవీ జరిపినట్లయితే కొద్ది కాలం వరకు బిల్లు చెల్లించడానికి గడువుండడమే కాకుండా రివార్డు పాయింట్లు కూడా లభిస్తాయి. ఎన్ని పాయింట్లు వస్తాయనేది మనం చేసే లావాదేవీ విలువపై ఆధారపడి ఉంటుంది. కొన్ని కార్డుల్లో ప్రతి రూ.100 కొనుగోలుపై ఒక రివార్డు పాయింట్ వస్తే, మరికొన్నింటిలో రూ.150, రూ.200 కొనుగోలును బట్టి పాయింట్లు వచ్చే విధానం ఉంటుంది. ఎలా ఖర్చు చేస్తున్నాం? దేనిపై ఖర్చు చేస్తున్నాం? కార్డు రకాన్ని బట్టి కూడా రివార్డ్‌ పాయింట్లు వస్తాయి. ప్రాసెసింగ్‌ రుసుము లేకుండా లభించే కార్డు కన్నా, ప్రీమియం కార్డుల్లో రివార్డు పాయింట్ల ప్రయోజనాలు అధికంగా ఉంటాయి.

క్రెడిట్‌ కార్డులు-రివార్డ్‌ పాయింట్లు

రివార్డు పాయింట్లు కార్డు రకాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. కార్డు తీసుకునే సమయంలోనే అన్ని వివరాలు తెలుసుకోవాలి. కొన్ని కార్డుల్లో పాయింట్లకు బదులు క్యాష్‌బ్యాక్‌లు లభిస్తాయి. కొన్నింటిలో డిస్కౌంట్లు లభిస్తాయి. అన్ని కార్డులపై ఏదో రకమైన రివార్డు పాయింట్లు పొందే సదుపాయం ఉంటుంది. ఈ రివార్డు పాయింట్లతో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో వస్తువులు కొనుగోలు చేయొచ్చు. షాపింగ్‌, రెస్టారెంట్లు, ఎయిర్‌పోర్ట్‌ వద్ద డిస్కౌంట్స్‌ పొందొచ్చు. భారత్‌లో రివార్డ్స్‌, డిస్కౌంట్స్‌ పొందడానికి అనేక రకాల క్రెడిట్‌ కార్డులున్నాయి. ఈ కార్డులు ప్రత్యేకమైన ప్రయోజనాలు, ప్రోత్సాహకాలను అందిస్తాయి.

ట్రావెల్ రివార్డ్ క్రెడిట్‌ కార్డ్స్‌

ప్రయాణికుల కోసం రూపొందించిన ఈ కార్డులు ఎయిర్‌ మైల్స్‌, హోటల్‌లో బస, ఇతర ప్రయాణ సంబంధిత పెర్క్‌ల రూపంలో రివార్డ్స్‌ను అందిస్తాయి. ప్రయాణ ఖర్చులను తగ్గించుకోవడానికి లేదా ప్రయాణ సౌకర్యాల స్థాయి పెంచుకోవడానికి వినియోగదారులు ఈ కార్డుల ద్వారా పాయింట్లను సేకరించవచ్చు.

పాయింట్స్ రివార్డ్‌ క్రెడిట్‌ కార్డ్స్‌

క్రెడిట్‌ కార్డు వినియోగంతో ప్రతి కొనుగోలుకు పాయింట్లను పొందుతారు. ఈ పాయింట్లను సరకులు, గిఫ్ట్‌ కార్డులు లేదా క్యాష్‌బ్యాక్‌తో సహా అనేక రకాల రివార్డ్‌ల కోసం రిడీమ్‌ చేయొచ్చు. క్రెడిట్‌ కార్డు వినియోగదారుడికి లభించిన రివార్డు పాయింట్లను రిడీమ్‌ చేసుకునేటప్పుడు వాటి విలువను దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. పాయింట్ల విలువ కంపెనీ, మనం చేసే లావాదేవీని బట్టి మారుతుంటుంది.

ఫ్యూయల్‌ రివార్డ్ క్రెడిట్‌ కార్డ్స్‌

తరచుగా డ్రైవ్‌ చేసే వారి కోసం రూపొందించిన ఈ కార్డ్‌లు క్యాష్‌ బ్యాక్‌, డిస్కౌంట్‌లు లేదా రివార్డ్‌ పాయింట్స్‌ను ప్రత్యేకంగా ఇంధనం కొనుగోలు చేసేటప్పుడు అందిస్తాయి. వినియోగదారులు ఈ రివార్డ్‌ పాయింట్లతో తమ ఇంధన ఖర్చులను ఆదా చేసుకోవచ్చు.

డైనింగ్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ క్రెడిట్‌ కార్డ్స్‌

ఈ కార్డులతో డైనింగ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ ఖర్చులపై డిస్కౌంట్‌లు/క్యాష్‌ బ్యాక్‌లను పొందొచ్చు. వినియోగదారులు.. ఎంపిక చేసిన రెస్టారెంట్లలో భోజనం చేసేటప్పుడు, ఆర్డర్‌ చేసినప్పుడు లేదా ఈవెంట్లకు హాజరైనప్పుడు పొదుపు చేయొచ్చు.

ప్రీమియం అండ్‌ లైఫ్‌స్టైల్‌ క్రెడిట్‌ కార్డ్స్‌

అధిక ఆదాయ వర్గాల కోసం ఉద్దేశించిన ఈ ప్రీమియం కార్డులు ప్రత్యేకమైన ఈవెంట్లకు, అక్కడ లభించే సేవలతో సహా అనేక రకాల లగ్జరీ ప్రయోజనాలను అందిస్తాయి.

ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ షాపింగ్‌ రివార్డ్ క్రెడిట్‌ కార్డ్స్‌

తరచుగా షాపింగ్‌ చేసేవారికి ఈ కార్డులు అనువైనవి. ఈ కార్డులతో రివార్డ్‌లు, డిస్కౌంట్‌లు, రిటైల్‌ కొనుగోళ్లపై క్యాష్‌ బ్యాక్‌ పొందొచ్చు. భాగస్వామ్య స్టోర్‌లలో ప్రత్యేకమైన డీల్స్‌, డిస్కౌంట్స్‌ లభిస్తాయి. ఆన్‌లైన్‌ షాపింగ్‌ రివార్డ్‌ క్రెడిట్‌ కార్డు.. డిజిటల్‌ కొనుగోళ్లకు అనుగుణంగా ప్రత్యేకమైన పెర్క్‌లు, ప్రయోజనాలను అందిస్తుంది.

కార్డు హోల్డర్‌ పరిశీలించాల్సినవి

ఈ రివార్డ్‌ క్రెడిట్‌ కార్డులు అనేక ఆకర్షణీయమైన ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ, ప్రతి క్రెడిట్‌ కార్డుపై అన్ని ప్రయోజనాలు లభించవు. ప్రతి క్రెడిట్‌ కార్డు దేనికదే వైవిధ్యంగా ఉంటుంది. ప్రతి కార్డును నిర్దిష్ట వినియోగదారుల అవసరాలు, ప్రాధాన్యతలకు అనుగుణంగా రూపొందించారు. కొన్ని క్రెడిట్‌ కార్డ్‌లు ప్రయాణ, భోజన ఖర్చులపై దృష్టి పెడతాయి. మరికొన్ని క్యాష్‌ బ్యాక్‌ లేదా నిర్దేశిత ప్రత్యేక వర్గాలకు ప్రాధాన్యం ఇస్తాయి. వివిధ కార్డుల్లో వార్షిక రుసుములు, భద్రతా ఫీచర్లు మారుతుంటాయి. అందువల్ల క్రెడిట్‌ కార్డు కోరుకునే వ్యక్తులు వారి జీవనశైలి, ప్రాధాన్యతల ఆధారంగా గరిష్ఠ ప్రయోజనాలను పొందేలా చూసుకుంటూ, వారి ప్రత్యేక ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఉండే కార్డును ఎంచుకోవాలి.

ఎలాంటి లావాదేవీపై రివార్డులు?

మీ క్రెడిట్‌ కార్డుతో చేసే చాలా లావాదేవీలపై రివార్డు పాయింట్లను సంపాదించొచ్చు. బంగారం, నగదు అడ్వాన్స్‌లు, ఫీజులు, ఛార్జీలు వంటి కొన్ని లావాదేవీలపై రివార్డ్‌ పాయింట్లకు అర్హత ఉండదు. రివార్డు పాయింట్లు పొందేందుకు ప్రతి లావాదేవీకి కనీస మొత్తం ఖర్చు చేయాలి. అవే పాయింట్లను ఇతర వస్తువులు, సేవల కోసం రిడీమ్‌ చేసుకోవచ్చు.

రివార్డ్‌ పాయింట్ల రిడీమ్‌, రద్దు

రివార్డ్ పాయింట్లు రిడీమ్‌ చేసుకునేటప్పుడు కొన్నిసార్లు సమయం కూడా చూడాలి. కొన్ని కంపెనీలు పండుగ సీజన్లలో ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తాయి. ఆ సమయంలో మన వద్ద ఉన్న పాయింట్లకు ఎక్కువ మొత్తంలో వస్తువులు కొనే అవకాశం ఉండొచ్చు. ఆఫ్‌లైన్‌ కంటే ఆన్‌లైన్‌లో లావాదేవీ కోసం రిడీమ్‌ చేసుకుంటే.. సాధారణంగా పాయింటు విలువ ఎక్కువుంటుంది. మరికొన్ని సంస్థలు క్రెడిట్‌ కార్డు బకాయిలను చెల్లించేందుకు కూడా పాయింట్లను వినియోగించుకునే అవకాశాన్నిస్తాయి. అయితే, క్రెడిట్ కార్డు లావాదేవీల ద్వారా లభించే రివార్డు పాయింట్లకు నిర్ణీత కాలపరిమితి ఉంటుంది. ఆ సమయం దాటితే వాటిని వాడుకోలేం. సాధారణంగా చాలా కంపెనీలు పాయింట్లు వాడుకునేందుకు రెండు, మూడు సంవత్సరాల వరకు గడువు ఇస్తాయి. కొన్ని కార్డుల్లో తక్కువ సమయంలోనే పాయింట్లు రద్దు అయిపోతుంటాయి. అందుకు గానూ క్రెడిట్‌ కార్డు స్టేట్‌మెంట్‌ను గమనిస్తూ ఉండాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని